Begin typing your search above and press return to search.

మ‌ల‌యాళంలో కోటి అయితే ఇక్క‌డ 4 కోట్లు అవుతోంది

సినీకార్మికుల మెరుపు స‌మ్మెతో టాలీవుడ్ షూటింగులు ఇబ్బందుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   7 Aug 2025 9:15 AM IST
మ‌ల‌యాళంలో కోటి అయితే ఇక్క‌డ 4 కోట్లు అవుతోంది
X

సినీకార్మికుల మెరుపు స‌మ్మెతో టాలీవుడ్ షూటింగులు ఇబ్బందుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొన్ని పెద్ద సినిమాల కోసం కార్మికుల‌తో మాట్లాడుకుని మేనేజ్ చేస్తున్నా కానీ, చాలా సినిమాల‌కు ఫెడ‌రేష‌న్ (కార్మిక స‌మాఖ్య‌) స‌మ్మెతో ఇబ్బందులు త‌లెత్తాయ‌ని చెబుతున్నారు. 30శాతం వేతన పెంపును త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ఫెడ‌రేషన్ డిమాండ్ చేస్తూ స‌మ్మెకు దిగింది. అయితే దీనికి నిర్మాత‌లు స‌సేమిరా అంటున్నారు. ఇప్ప‌టికే ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల కంటే మ‌న సినీకార్మికుల‌కు డీసెంట్ వేత‌నం చెల్లిస్తున్నామ‌ని చెబుతున్నారు. స‌మ‌స్య తీవ్రంగా మార‌డంతో మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన నిర్మాత‌లు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక నిర్మాత‌ల గిల్డ్ మొద‌టి నుంచి కార్మికుల వేత‌న స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగానే ఉంది. గిల్డ్ స‌భ్యులు అయిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వ‌ప్ర‌సాద్ తాజాగా మీడియా స‌మావేశంలో కార్మికుల వేత‌న స‌మ‌స్య గురించి మాట్లాడారు. తాము ప‌రిశ్ర‌మ‌లో స‌రిప‌డా వేత‌నాలు అందిస్తున్నామ‌ని అన్నారు. అంతేకాదు.. మాలీవుడ్ తో పోలిస్తే మ‌న‌కు నాలుగైదు రెట్లు ఖ‌ర్చు ఎక్కువ అవుతోంద‌ని కూడా వ్యాఖ్యానించారు. విశ్వ‌ప్ర‌సాద్ తాజా స‌మ‌స్య‌పై చెప్పిన సంగ‌తులు ఇలా ఉన్నాయి...

వ్య‌వ‌స్థ అలా ఉంది:

మ‌ల‌యాళంలో కోటి రూపాయ‌ల‌కే సినిమా చేస్తుంటే, తెలుగులో 4 కోట్లు అవుతోంది. సినిమా చేయ‌డం తెలిసిన వారికి 4-5 అవుతుంది. తెలియ‌ని వారికి 10-15 అవుతోంది. ఇక్క‌డ వ్య‌వ‌స్థ అలా ఉంది. మేకింగ్ తెలియ‌ని వారికి ఒక‌లా బ‌డ్జ‌ట్ అవుతోంది. తెలిసిన వారికి ఒక‌లా అవుతోంది. ప‌రిశ్ర‌మ‌లో త‌క్కువ వేత‌నాలు ఇస్తున్నారు అనేది క‌రెక్ట్ కాదు.

50శాతం మందికి సాఫ్ట్ వేర్ వేత‌నాలు:

సెట్ లో డైలీ 300 మంది ఉంటారు. ఇందులో 50 శాతం మందికి సాఫ్ట్ వ‌ర్ త‌ర‌హా వేత‌నం అందుతోంది. మిగ‌తా వారికి డీసెంట్ గానే వేత‌నం అందుతోంది. తెలంగాణ గ్రామాల్లో దిన‌స‌రి వేత‌నం కంటే ప‌రిశ్ర‌మ‌లో ఉత్త‌మంగా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ప‌రిశ్ర‌మ‌లో వంద శాతం నైపుణ్యం ఉన్న‌వారు దొర‌క్కపోతే, బ‌య‌టి నుంచి తీసుకు రావాల్సి వ‌స్తోంది. దానివ‌ల్ల కాస్ట్ పెరుగుతోంది.

అసోసియేష‌న్ మెంబ‌ర్‌షిప్‌లు అడ్డుగోడ‌:

స్థానిక ప్ర‌తిభావంతులు ప‌రిశ్ర‌మ‌లోకి రావాలంటే, అసోసియేష‌న్ ల‌లో మెంబ‌ర్ షిప్ కి పెద్ద‌గా పేచేయాల్సి వ‌స్తోంది. ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌డానికి మెంబ‌ర్ షిప్ అనే అడ్డుగోడ ఉంది. అయితే ఈ విష‌యాలు చాలా కాలంగా ఇంట‌ర్న‌ల్ గా నేను మాట్లాడుతున్నాను. నేను చాంబ‌ర్ నుంచి వెళుతూ మీడియా ఎదుట మొద‌ట మాట్లాడాను కాబ‌ట్టి నా పేరు హైలైట్ అవుతోంది. నేను ఫెడ‌రేష‌న్ కి వ్య‌తిరేకిని కాను. ఆవేశంగాను మాట్లాడ‌టం లేదు. ఈ స‌బ్జెట్ పై చాలా కాలంగా మాట్లాడుతున్నాను. ప్ర‌స్తుత కార్మిక స‌మ్మె స‌మ‌యంలో నేను మీడియాతో మాట్లాడాను కాబ‌ట్టి ఇది హైలైట్ అయింది. నేను స‌మ‌స్య‌లేంటో మాట్లాడ‌తాను.

గిల్డ్ వేదికపై ప‌రిష్కారం:

సినిమా రంగంలో చాలా స‌మ‌స్య‌లు ఉంటాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను అంద‌రూ క‌లిసి ప‌రిష్క‌రించుకోవాలి. గిల్డ్ మాత్ర‌మే ప‌రిష్క‌రిస్తుందా? లేదూ గిల్డ్ తో క‌లిసి అంద‌రూ ప‌రిష్కారం వెతుకుతారా? అనేది ఇక్క‌డ చాలా ముఖ్యం. గిల్డ్ లో యాక్టివ్ గా సినిమాలు చేసే నిర్మాత‌లు ఒక వేదిక‌పైకి వ‌స్తున్నారు. వారంతా క‌లిసి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు..... అంటూ నిర్మాత‌ విశ్వ‌ప్ర‌సాద్ ఇంట‌ర్వ్యూ ముగించారు.