30 శాతం పెంచడం జరిగే పని కాదు: తమ్మారెడ్డి
కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ప్రతి సంవత్సరం జీతాలు పెంచాలి. దినసరి వేతనానికి పని చేసేవారికి కూలీ పెంచాలి. నెలవారీ జీతగాళ్లకు ప్రతి సంవత్సరం పెంచుతారు..
By: Sivaji Kontham | 8 Aug 2025 2:01 AM ISTకార్మికుల మెరుపు సమ్మెతో షూటింగులు డైలమాలో పడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కొద్దిరోజులుగా స్థంభించిపోయింది. షూటింగులు సజావుగా జరగకపోవడంతో నిర్మాతలు గందరగోళంలో పడ్డారు. సమ్మెను ఆపేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మిక సమాఖ్యతో చర్చలు జరుపుతున్నా సఫలం కావడం లేదు. 15 శాతం వేతన పెంపునకు నిర్మాతలు అంగీకరించారని, కానీ దానికి ఫెడరేషన్ అంగీకరించడం లేదని కూడా వార్తలు వచ్చాయి. 30 శాతం పెంచాల్సిందేనని పట్టుబడుతున్నట్టు కథనాలొస్తున్నాయి.
ఎవరి వెర్షన్ వారికి ఉంది:
తాజా పరిణామాలపై ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మీడియాతో మాట్లాడారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ-``కార్మికులు వేతనాలు పెంచమని అడగడం తప్పు లేదు కానీ.. 30 శాతం పెంచడం జరిగే పని కాదు. పెంచాలని వాళ్లు అంటారు! 30శాతం పెంచితే ఇప్పుడున్న పరిస్థితిలో నెట్టుకొచ్చేదెలా? అని నిర్మాతలు అంటారు. 3 సంవత్సరాల వేతనం 30శాతం పెంచాలని అంటారు. 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మాకు 30శాతం పెంచలేరా? అని కార్మికులు అడుగుతున్నారు. అయితే నిర్మాతలు ఒకరకంగా డబ్బు వృథా చేస్తున్నారు. ఒక్కొక్క ఆర్టిస్టుకు 5-10 మంది అసిస్టెంట్లు ఉంటున్నారు. వారందరి కోసం పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు. 100 కోట్లు 200 కోట్ల పెట్టుబడులు కాదు.. మార్కెట్‌ని బట్టి బడ్జెట్ పెడుతున్నారు.. అది కాదు సమస్య. అనవసర ఖర్చు తగ్గించుకోవాలి.. అని అన్నారు.
అసంఘటిత రంగంలో పెంచరు:
కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ప్రతి సంవత్సరం జీతాలు పెంచాలి. దినసరి వేతనానికి పని చేసేవారికి కూలీ పెంచాలి. నెలవారీ జీతగాళ్లకు ప్రతి సంవత్సరం పెంచుతారు.. కానీ అసంఘటిత రంగం కాబట్టి ఇక్కడ పెంచరు.. అని తెలిపారు.
అప్పట్లోను సమ్మెలు చేసాం:
నేను ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమ్మెలు చేసాం. ఏడాదికోసారి జరిగేవే ఇవి. తర్వాత సమస్య పరిష్కారం అయ్యేది. 2022లో కూడా సమ్మె జరిగింది. వేతనం సవరించారు. ఇప్పుడు మళ్లీ ఫెడరేషన్ సమ్మె ఉధృతంగా జరుగుతోంది! అని చెప్పారు.
