Begin typing your search above and press return to search.

18 రోజుల స‌మ్మెకు తెర‌..CM రేవంత్‌పై టాలీవుడ్ పెద్ద‌ల‌ ప్ర‌శంస‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో స‌మ‌స్య సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్కారం కావ‌డంతో ఇండ‌స్ట్రీ స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేసింది.

By:  Sivaji Kontham   |   22 Aug 2025 9:37 AM IST
18 రోజుల స‌మ్మెకు తెర‌..CM రేవంత్‌పై టాలీవుడ్ పెద్ద‌ల‌ ప్ర‌శంస‌లు
X

18 రోజులుగా టాలీవుడ్ లో కార్మికుల‌ నిర‌వ‌ధిక‌ స‌మ్మె కార‌ణంగా షూటింగులు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌ ప్ర‌భుత్వం నేరుగా జోక్యం చేసుకుని కార్మిక స‌మ్మెను విర‌మించింది. దీంతో ఈరోజు (22 ఆగ‌స్టు 2025) నుంచి షూటింగులు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో స‌మ‌స్య సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్కారం కావ‌డంతో ఇండ‌స్ట్రీ స‌ర్వ‌త్రా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేసింది.

ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌తలు: చిరంజీవి

ఎంతో జ‌టిల‌మైన‌ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ను చాలా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా, ఇటు నిర్మాత‌లకు, అటు కార్మికులకు స‌మ‌న్యాయం జ‌రిగే విధంగా ప‌రిష్క‌రించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకొంటున్నాను. తెలుగు చిత్ర‌సీమ అభివృద్ధికి ముఖ్య‌మంత్రి గారు తీసుకొంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయం. హైద‌రాబాద్ ను దేశానికే కాదు, ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర రంగానికే ఓ హ‌బ్ గా మార్చాల‌న్న ఆయ‌న ఆలోచ‌న‌లు, అందుకు చేస్తున్న కృషి హ‌ర్షించ‌ద‌గిన‌వి. తెలుగు చిత్ర‌సీమ ఇలానే క‌లిసి మెలిసి ముందుకు సాగాల‌ని, ప్ర‌భుత్వం కూడా అన్ని ర‌కాలుగా అండ‌దండ‌లు అందిస్తుంద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటున్నాను అని అన్నారు.

అస‌లు స‌మ‌స్యేంటి?

30శాతం వేత‌న పెంపును వ‌ర్తింప‌జేయాల‌ని కార్మిక ఫెడ‌రేష‌న్ ఈసారి మెరుపు స‌మ్మెకు దిగిన సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న వేత‌న స‌వ‌ర‌ణను ఈసారి విజ‌య‌వంతం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా స‌మ్మెను నిర్వ‌హించారు. ఈ స‌మ్మె కార‌ణంగా కొన్ని పెద్ద సినిమాల షూటింగులు మిన‌హా ఓవ‌రాల్ గా చాలా సినిమాల షూటింగులు ఆగిపోవ‌డం ఆందోళ‌న క‌లిగించింది. స‌మ్మె స‌మయంలో ఫిలింఛాంబ‌ర్- నిర్మాత‌ల మండ‌లి పెద్ద‌లు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షకార్య‌ద‌ర్శుల‌తో మంత‌నాలు సాగించారు. కానీ 30 శాతం పెంపున‌కు నిర్మాత‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత జ‌టిల‌మైంది. మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు పెద్ద‌లు కార్మిక ఫెడ‌రేష‌న్ ని ఒప్పించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేసినా చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి.

ఎట్ట‌కేల‌కు స‌మ‌స్య‌కు తెర‌:

ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొర‌వ‌, చ‌ర్చ‌ల కార‌ణంగా 18 రోజుల ఎంప్లాయీస్ ఫెడరేషన్ స‌మ్మెకు తెర‌ప‌డింది. ఈ సమస్యను పరిష్కరించడంలో వేగంగా వ్యవహరించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌హా ప‌లువురు సినీపెద్ద‌లు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను ఒక ప్రధాన సినీహ‌బ్ గా మార్చాలనే దార్శనికత సీఎం రేవంత్ రెడ్డికి ఉందని దిల్ రాజు అన్నారు.

వేత‌న స‌వ‌ర‌ణ నియ‌మాలు:

చివ‌రికి కార్మికుల డిమాండ్ మేర‌కు వేత‌న స‌వ‌ర‌ణ‌కు నిర్మాత‌లు అంగీక‌రించారు. దీని ప్ర‌కారం....సినీ కార్మికులకు మొత్తం వేతనాల్లో 22.5 శాతం పెంపుదల ఈ శుక్ర‌వారం(22 ఆగ‌స్టు) నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంది. ర‌క‌ర‌కాల‌ వేతన నిష్పత్తుల ఆధారంగా సర్దుబాట్లు ఉంటాయి. ఈ పెంపును మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి సంవత్సరంలో 15 శాతం, రెండవ సంవత్సరంలో 2.5 శాతం, మూడవ సంవత్సరంలో 5 శాతం పెంపును అమ‌ల్లోకి తేవాల‌ని చ‌ర్చా స‌మావేశాల్లో నిర్ణ‌యించారు. దీంతో పాటు ప‌లు శాఖ‌ల్లోని కార్మికుల డిమాండ్ల‌కు ఆమోదం ల‌భించింది. అస‌లు కార్మికుల‌కు ఇంకా ఎలాంటి క‌ఠిన స‌మ‌స్య‌లు ఉన్నాయి? అనేదానిపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కానుంది. ఈ క‌మిటీ ఒక నెలలోపు తన నివేదికను ప్ర‌భుత్వానికి సమర్పిస్తుంది.

ప్ర‌భుత్వానికి థాంక్స్:

నిర‌వ‌ధిక స‌మ్మెను విర‌మింప‌జేయ‌డంలో నిర్ణయాత్మక పాత్ర పోషించినందుకు తెలంగాణ‌ ప్రభుత్వానికి, కార్మిక శాఖకు, ముఖ్యంగా కార్మిక కమిషనర్‌కు కార్మిక‌ సమాఖ్య(ఫెడ‌రేష‌న్) అధ్యక్షుడు అనిల్ వల్లభనేని కృతజ్ఞతలు తెలిపారు. యూనియ‌న్ల ప‌రిధిలో ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించినందుకు ఆయ‌న సీఎం రేవంత్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు.