కార్మిక సమ్మెపై మెగా పరిష్కారం ఎప్పుడు?
సినీకార్మికుల సమాఖ్య మెరుపు సమ్మెతో టాలీవుడ్ లో చాలా షూటింగులు బంద్ అయ్యాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
By: Sivaji Kontham | 7 Aug 2025 9:31 AM ISTసినీకార్మికుల సమాఖ్య మెరుపు సమ్మెతో టాలీవుడ్ లో చాలా షూటింగులు బంద్ అయ్యాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొందరు అగ్ర నిర్మాతలు కార్మికులతో చర్చించుకుని పెండింగ్ చిత్రీకరణలు పూర్తి చేస్తున్నా, మెజారిటీ వర్గాలు ఇబ్బందుల్లోనే ఉన్నారని గుసగుస వినిపిస్తోంది. 30శాతం వేతన పంపును అమలు చేస్తూ తక్షణం అంగీకార పత్రం రాయాలని ఫెడరేషన్ అల్టిమేటం జారీ చేసింది. కానీ దీనికి ససేమిరా అంటున్న నిర్మాతలు అసోసియేషన్లతో సంబంధం లేని బయటి ప్రతిభను ఎంకరేజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇరు వర్గాల నడుమా ప్రస్తుతానికి వార్ కొనసాగుతోంది.
ఫెడరేషన్ పెద్దలు దిగొస్తారా?
అయితే ఈ సమస్య ఇలానే కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లోనే తాను జోక్యం చేసుకుంటానని మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చారు. పరిశ్రమకు పెద్ద దిక్కు హోదాలో చిరంజీవి తనను కలిసిన నిర్మాతలకు ప్రామిస్ చేసారు. దీనిని బట్టి ఫెడరేషన్ పెద్దల్ని పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. నిర్మాతలు ఫెడరేషన్ ప్రముఖులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వేతన సవరణపై చిరుతో కార్మిక సమాఖ్య నాయకులు మాటా మంతీ సాగించేందుకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నదానిపై ఇంకా సరైన సమాచారం లేదు. చిరు చెప్పినట్టు రెండు రోజుల గడువు ఈరోజుతో ముగుస్తోంది. ఈ శుక్ర, శనివారాల్లో ఆయన చొరవతో ఏదైనా పరిష్కారం లభిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.
పైకి చెప్పడం లేదు కానీ...
పైకి చెప్పకపోయినా కానీ కార్మికుల మెరుపు సమ్మెతో చాలా మంది నిర్మాతలు ఇరకాటంలోనే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఫెడరేషన్ ఆజ్ఞల్ని ధిక్కరించి అసోసియేషన్లలో మెంబర్ అయిన ఏ కార్మికుడు సెట్స్ కి వెళ్లలేడు. అలా వెళితే అతడిపై కఠిన చర్యలు అమల్లోకి వస్తాయి. అందుకే ఈ సమస్య ఉప్పు నిప్పులా కాలుతోంది. మరోవైపు ఉపాధి లేకపోతే కాలే కడుపులకు కూడా ఇబ్బంది తప్పదు. నిత్యావసరాల కొనుగోలు, ఈఎంఐ చెల్లింపులు వగైరా సమస్యలు కార్మికులకు ఉంటాయి. అందుకే దీనికి వెంటనే పరిష్కారం కనుగొనకపోతే చాలా ఇబ్బందులే తలెత్తుతాయని భావిస్తున్నారు.
చిరు వద్దకే ఎందుకు వచ్చారు?
గతంలో తెలుగు పరిశ్రమలో ఏ సమస్య ఉన్నా నేనున్నాను! అంటూ దర్శకరత్న డా.దాసరి నారాయణరావు పెద్దరికం చూపించేవారు. ఆయన ఛరిష్మా, మాటకారితనం కారణంగా చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి. కానీ ఆయన దివంగతులు అయ్యాక సినీపరిశ్రమ పెద్ద దిక్కులేనిది అయింది. అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆ పాత్రను పోషించాలని పరిశ్రమ వర్గాలు కోరుకున్నాయి. కానీ దీనిని కొందరు హీరోలు వ్యతిరేకించారు. చిరంజీవి కూడా సమస్య ఉందని వస్తే తాను స్పందిస్తానని, సహాయపడతానని, తనకు తానుగా పెద్ద దిక్కుగా మారాలనే కోరికలు ఏవీ లేవని కూడా వివరణ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే కరోనా క్రైసిస్ సహా చాలా సందర్భాలలో పరిశ్రమ కోసం చేయాల్సిన సహాయం చేసారు. కొన్నిసార్లు సినిమా వర్గాల్లో తలెత్తిన సంక్షోభాలు, సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నిజాయితీగా పెద్దరికం నెరిపారు. అవన్నీ మంచి ఫలితాలను కూడా ఇచ్చాయి. అందుకే ఇప్పుడు కార్మికుల సమ్మె పంచాయితీని నిర్మాతలు విధిగా మెగాస్టార్ చిరంజీవి వద్దకే తీసుకుని వెళ్లారు. అయితే దీనికి సరైన పరిష్కారంతో ఎండ్ కార్డ్ పలికి మరోసారి మెగాస్టార్ క్లిష్ఠ సమయంలో అందరికీ సహకరించాల్సి ఉంది.
