Begin typing your search above and press return to search.

ఎండలు మండుతోన్న రెస్ట్ లెస్ గా హీరోలు!

న‌టీన‌టులంతా చెప్పిన టైమ్ కి అటెండ్ అవ్వ‌డంతో? కీల‌క స‌న్నివేశాలు పూర్తి చేస్తున్నారు. ఎండ తీవ్ర‌త పెరిగిన స‌మ‌యంలో కాస్త చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో సీన్స్ షూట్ చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   17 March 2026 5:00 PM IST
ఎండలు మండుతోన్న రెస్ట్ లెస్ గా హీరోలు!
X

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. బయట అడుగు పెట్టాలంటేనే? హడలెపోతున్నారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఎండలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. తమ సినిమాలను సకాలంలో పూర్తి చేసి ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో మండుతున్న ఎండల్లోనూ రెస్ట్‌లెస్ గా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలంతా వివిధ ప్రాంతాల్లో సెట్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ `వారణాసి` షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్‌లో సినిమా చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా సాగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మహేష్ ఏమాత్రం విరామం తీసుకోకుండా కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. చిత్ర యూనిట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ను వేగవంతం చేస్తోంది.

అలాగే గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి రెండు సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శక త్వంలో తెరకెక్కుతున్న `ఫౌజీ` షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కిస్తోన్న `స్పిరిట్` షూటింగ్ కు క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాల కోసం ప్రభాస్ ఎండను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. ఆయన డెడికేషన్ చూసి చిత్ర బృందం స్ట‌న్ అవుతుంది.

నేచురల్ స్టార్ నాని కూడా `పారడైజ్` కోసం అంతే శ్రమిస్తున్నారు. హలో నేటివ్ స్టూడియోలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `కొరియన్ కనకరాజు` షూటింగ్ కొరియాలో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అక్కడ వాతావరణం భిన్నంగా ఉన్నప్పటికీ? ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం వ‌రుణ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు. అక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఆయన రెస్ట్‌లెస్ గా పని చేస్తున్నారు. ఇంకా చాలా మంది హీరోలు భానుడి భ‌గ‌భ‌గ‌ల్ని లెక్క చేయ‌కుండా షూట్ లో పాల్గొంటున్నారు. త‌మ కార‌ణంగా నిర్మాత ఎలాంటి ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం షూట్ కు హాజ‌ర‌వుతున్నారు. మేక‌ర్స్ షూటింగ్ ను ఉద‌యాన్నే వీలైనంత త్వ‌ర‌గా మొద‌లు పెడుతున్నారు.

న‌టీన‌టులంతా చెప్పిన టైమ్ కి అటెండ్ అవ్వ‌డంతో? కీల‌క స‌న్నివేశాలు పూర్తి చేస్తున్నారు. ఎండ తీవ్ర‌త పెరిగిన స‌మ‌యంలో కాస్త చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో సీన్స్ షూట్ చేస్తున్నారు. తెలుగు హీరోల అంకితభావం చూస్తుంటే? ఎండల కంటే వారి సినిమాపై ఉన్న ప్రేమే ఎక్కువగా కనిపిస్తోంది. తమ అభిమానులను అలరించడం కోసం, నిర్మాతలకు నష్టం కలగకుండా ఉండటం కోసం సమ్మర్ హీట్‌ను సైతం భరిస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి శ్రమకు తగ్గట్టుగా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.