కమర్షియల్ చిత్రాల్లో అవార్డు విన్నింగ్ నటన!
దీనిని అందిపుచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు .. అవార్డులు అందుకునేలా నటనను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు.
By: Srikanth Kontham | 7 Jun 2026 7:00 AM ISTఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఫైట్లు, పాటలు, మాస్ డైలాగులు, హీరో ఎలివేషన్ల చుట్టూనే తిరిగేది. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు కేవలం ప్యారలల్ సినిమా లేదా ఆర్ట్ చిత్రాలకే పరిమితం అనే భావన ఉండేది. కానీ కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారింది. గాల్లో లేచే సుమోలు, రొటీన్ ఫార్ములా కథలను చూసి బోర్ ఫీలవుతున్న ఆడియన్స్, కమర్షియల్ హంగులు ఉంటూనే గుండెకు హత్తుకునే నటనను ఆశిస్తున్నారు. దీనిని అందిపుచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు .. అవార్డులు అందుకునేలా నటనను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్‌కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. `రంగస్థలం` చిత్రంలో చిట్టిబాబుగా చెవుడు ఉన్న పాత్రలో ఆయన చూపిన నటన నటుడిగా సరికొత్త జన్మనిచ్చింది. అటుపై `ఆర్ ఆర్ ఆర్` లో అల్లూరి సీతారామరాజుగా రౌద్రం, భావోద్వేగాలను పండించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. `గేమ్ చేంజర్` ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయం సాధించకపోయినా? అందులోని అప్పన్న అనే వృద్ధుడి పాత్రలో చరణ్ నటనకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. తాజాగా విడుదలైన `పెద్ది` సినిమాలో ఆయన పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. కమర్షియల్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పాత్రలో లీనమవ్వడమే చరణ్ సక్సెస్ సీక్రెట్. ఈ పాత్రకు గాను జాతీయ అవార్డు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన వారెంతో మంది.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కమర్షియల్ సినిమాల రూపురేఖలను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సుకుమార్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `పుష్ప: ది రైజ్` చిత్రంలో తగ్గేదేలే అంటూ ఆయన చూపించిన మేనరిజం, బాడీ లాంగ్వేజ్, చిత్తూరు యాస ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించాయి. మాస్ మసాలా కమర్షియల్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. కమర్షియల్ హీరోలకు జాతీయ అవార్డులు రావు అనే అపోహను బన్నీ పటాపంచలు చేశారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `రాకా` సినిమాలో కూడా అంతకు మించిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
వీరిద్దరే కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా క్లాస్, స్టైలిష్ లుక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మహేష్ ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న`వారణాసి` చిత్రంలో మహేష్ మునుపెన్నడూ చూడని సరికొత్త, వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రపంచ స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు, మహేష్ లోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరించేలా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కమర్షియల్ ఇమేజ్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉన్న కథలపై దృష్టి సారించారు. `బాహుబలి` తర్వాత భారీ యాక్షన్ చిత్రాలు చేసినా? నటనకు .. ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను ఆయన ఎంచుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ `స్పిరిట్` లో ప్రభాస్ ఖాకీ దుస్తుల్లో పవర్‌ఫుల్ గా హైలైట్ అవుతున్నారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెర కెక్కుతున్న `ఫౌజీ` చిత్రంలో చారిత్రక నేపథ్యంతో కూడిన బలమైన భావోద్వేగాలను పండించనున్నారు. ఇవి యాక్షన్ సినిమాల్లా కాకుండా నటుడిగా ప్రభాస్‌ను సరికొత్త ఎత్తులో నిలబెట్టే చిత్రాలుగా మారనున్నాయి.వీటిలో ఏ పాత్రకైనా డార్లింగ్ జాతీయ అవార్డు అందుకునే అవకాశాలు లేకపోలేదు.
