చిరు, వెంకీ ఓకే.. బాలయ్య, నాగ్ పరిస్థితేంటి?
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందిన ఆ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
By: M Prashanth | 24 Jan 2026 12:00 PM ISTటాలీవుడ్ కు ఫోర్ పిల్లర్స్ గా అంతా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వయసు లెక్కచేయకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తమ క్రేజ్ ను నిలబెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. ఆ నలుగురిలో ఇద్దరు ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంటే.. మరో ఇద్దరు మాత్రం హిట్ కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.
అయితే చిరంజీవి, వెంకటేష్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగాస్టార్ చిన్న గ్యాప్ తర్వాత సరైన కమర్షియల్ హిట్ అందుకుని గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆయన నటించిన రీసెంట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో మళ్లీ టాప్ ఫామ్ లోకి వచ్చారన్న మాట వినిపిస్తోంది. మరోవైపు వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ట్రాక్ లోకి వచ్చారు.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందిన ఆ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు మూవీలో కూడా వెంకీ నటించి సందడి చేశారు. దీంతో చిరు, వెంకీ ఇద్దరూ ప్రస్తుతం సూపర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే పరిస్థితి బాలకృష్ణ, నాగార్జున విషయంలో కొంచెం భిన్నంగా ఉంది.
వరుస హిట్స్ తో దూసుకెళ్లిన బాలయ్య ఇటీవల అఖండ –2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. కథ, కథనం పరంగా అభిమానులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాలయ్య ఖాతాలో మరో పెద్ద హిట్ కోసం వెయిటింగ్ తప్పలేదు.
ప్రస్తుతం ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కొత్త సినిమాను ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ తో మళ్లీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. ఇక నాగార్జున పరిస్థితి కూడా దాదాపు అంతే. ఇటీవల ఆయన నటించిన కూలీ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ… బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ప్రస్తుతం నాగ్ యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో కింగ్ 100 చిత్రాన్ని చేస్తున్నారు. కెరీర్ లో వందో సినిమాగా తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్ పై నాగార్జున భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి అలా చిరు, వెంకీ ఫుల్ ఫామ్ లో కొనసాగుతుంటే.. బాలయ్య, నాగ్ మాత్రం కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆశలు, అంచనాలు అన్నీ రాబోయే సినిమాలపైనే ఉన్నాయి. మరి అప్ కమింగ్ మూవీలతో ఆ ఇద్దరూ మళ్లీ సూపర్ హిట్స్ అందుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.
