పవన్ 'ఉస్తాద్'.. టాలీవుడ్ హీరోల మౌనమేంటి?
ఉగాది పండుగ సందర్భంగా ఈసారి బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
By: M Prashanth | 22 March 2026 12:09 AM ISTఉగాది పండుగ సందర్భంగా ఈసారి బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 ఒకేసారి విడుదల కావడంతో సోషల్ మీడియాలో ఆ రెండు చిత్రాలు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలైతే.. ఇతర హీరోలు కూడా ఆ చిత్రాన్ని ప్రోత్సహించడం టాలీవుడ్ లో కనిపించే సాంప్రదాయం. అయితే ఈసారి పరిస్థితి కొంత వేరేగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు కొందరు ధురంధర్ 2పై స్పందించడం చర్చకు దారి తీసింది. మహేష్ బాబు, జూనియర్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ధురంధర్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించారు.
సినిమా కథ, విజువల్స్, అలాగే రణవీర్ సింగ్ నటన ఆకట్టుకుందని వారు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు. దీంతో బాలీవుడ్ చిత్రానికి టాలీవుడ్ నుంచి మంచి మద్దతు లభించినట్లయింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై నెట్టింట పెద్దగా స్పందన కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. మన ఇండస్ట్రీకి చెందిన హీరో సినిమా విడుదలైతే ముందు దానికి మద్దతు ఇవ్వాలనే భావన కొందరు అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ధురంధర్ 2పై ట్వీట్లు చేయడం మరింత చర్చకు కారణమైంది. సాధారణంగా కుటుంబానికి చెందిన హీరో సినిమా వచ్చినప్పుడు మరింత ప్రోత్సాహం ఉంటుందని భావించే అభిమానులు ఇప్పుడు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే మరోవైపు కొంతమంది సినీ ప్రియులు మాత్రం మంచి సినిమా అయితే అది ఏ భాషలో వచ్చినా ప్రశంసించడం సహజమేనని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను ఇంకా చూడకపోవడం వల్లే కొందరు స్పందించలేదేమో అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు పెద్దగా స్పందన లేకపోవడం కూడా గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ విడుదల సమయంలో స్పందించినప్పటికీ, సినిమా విడుదల తర్వాత ఇంకా అధికారికంగా అభిప్రాయం వ్యక్తం చేయలేదు.
అయితే తాజాగా ఆయన చిత్రాన్ని వీక్షించగా.. త్వరలో స్పందించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. వరుణ్ తేజ్ మాత్రం విడుదలకు ముందు ఆల్ ది బెస్ట్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ సినిమా విడుదల తర్వాత ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. బహుశా ఇంకా మూవీ చూడలేదేమో.. మొత్తానికి ధురంధర్ 2 మూవీపై టాలీవుడ్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తడం తప్పు కాదని చెప్పుకుంటూనే.. ఉస్తాద్ భగత్ సింగ్ పై తెలుగు హీరోల మౌనం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
