Begin typing your search above and press return to search.

చిరంజీవి దోస‌లు.. ఎన్టీఆర్ పునుగులు..!

భార్య పిల్ల‌లు, ఇత‌ర‌ కుటుంబీకుల కోసం స‌మ‌యం కేటాయించ‌డ‌మే కాదు, వీకెండ్స్ లో వంట గ‌దిలో చేరి గ‌రిటె తిప్పేస్తూ అంద‌రి మెప్పు పొందుతుంటారు

By:  Sivaji Kontham   |   7 Aug 2025 10:21 AM IST
చిరంజీవి దోస‌లు.. ఎన్టీఆర్ పునుగులు..!
X

మ‌న స్టార్ల‌లో కొంద‌రు వంట‌శాల‌లో గ‌రిటె తిప్ప‌డంలో న‌ల‌భీముల‌కు త‌క్కువేమీ కాదు. భార్య పిల్ల‌లు, ఇత‌ర‌ కుటుంబీకుల కోసం స‌మ‌యం కేటాయించ‌డ‌మే కాదు, వీకెండ్స్ లో వంట గ‌దిలో చేరి గ‌రిటె తిప్పేస్తూ అంద‌రి మెప్పు పొందుతుంటారు. అలాంటి జాబితాలో ఎంతో ఒదిగి ఉండే మ‌న స్టారాధి స్టార్లు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్యంగా రుచిక‌ర‌మైన వంట చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు.

మెగాస్టార్ చిరంజీవి త‌మ ఇంట్లో వంట‌శాల‌లోకి వెళితే రుచిక‌ర‌మైన‌ దోసెలను వేడి వేడిగా త‌న‌వారికి అందిస్తాన‌ని గ‌తంలో చెప్పారు. చిరు దోస చాలా ఫేమ‌స్ అయింది కూడా. ఈ దోసెలు తినేందుకు చిరు స‌హ‌చ‌రులు చెన్నై నుంచి కూడా జూబ్లీహిల్స్ లోని ఇంటికి వ‌స్తుంటారు. ఆ విష‌యాన్ని అప్ప‌టికే దోసెలు రుచి చూసిన ప‌లువురు మ‌ద‌రాసీ స్టార్లు, ఎయిటీస్ క్లాస్ న‌టీమ‌ణులు చెప్పుకొచ్చారు. అలాగే హైద‌రాబాద్ లో ప్ర‌ఖ్యాత రెస్టారెంట్ లో చిరు దోసె పేరుతో మెనూలో ఒక కాల‌మ్ ని కేటాయించారని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ఓసారి మద్రాసు ఔట‌ర్ లో షూటింగు కోసం వెళుతున్నప్పుడు మార్గ‌మ‌ధ్యంలో బ్రేక్ ఫాస్ట్ తినేందుకు చిరంజీవి, సురేఖ దంప‌తులు ఆగారు. అక్క‌డ రోడ్ సైడ్ ఒక కాకా హోట‌ల్ లోకి వెళ్ల‌గా, దోసె విప‌రీతంగా ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత ఆ ఫార్ములాను త‌మ‌కు చెప్పాల్సిందిగా ఆ కాకా హోట‌ల్ య‌జ‌మానిని చిరు- సురేఖ దంప‌తులు కోరారు. కానీ అత‌డు స‌సేమిరా అన్నాడు. ఆ త‌ర్వాత అచ్చం అలాంటి దోసెలు కావాల‌ని మెగాస్టార్ నేరుగా ఇంట్లో కిచెన్ లో ప్ర‌యోగాలు ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చిన దోసె ఇంచుమించు ఆ కాకా హోట‌ల్ దోసెలా అదే రుచితో కుద‌ర‌డంతో ఇక దానిని కంటిన్యూ చేసామ‌ని కూడా చిరు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. మొత్తానికి చిరు దోసెలు అలా ఫేమ‌స్ అయ్యాయి. తండ్రి బాట‌లోనే రామ్ చ‌ర‌ణ్ కూడా వంట‌శాల‌లో త‌న‌వంతు ప్ర‌యోగాలు చేస్తుంటార‌ని కూడా స‌మాచారం ఉంది.

ఇప్పుడు పాపుల‌ర్ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న పాక‌శాల నైపుణ్యం గురించి మాట్లాడారు. ఘుమ‌ఘుమ‌లాడే వంట‌కాల‌ను వండి వార్చ‌డంలో త‌న త‌ర్వాతేన‌ని తార‌క్ అన్నారు. చెయ్యి తిరిగిన వంట‌గాడిలా తాను వండుతాన‌ని, భార్య ప్ర‌ణ‌తి పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన ఆహారాన్ని తినిపిస్తాన‌ని తార‌క్ చెప్పారు.

అంతేకాదు త‌న స్నేహితులు కూడా త‌న వంట‌ను రుచి చూసార‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్యంగా త‌న‌కు ఇష్ట‌మైన వంట‌కం పునుగులు అని కూడా చెప్పాడు. ఇది ఇడ్లీ లేదా దోసె పిండితో చేస్తాను. ఉల్లిపాయలు, దినుసులు కూడా పునుగుల వంట‌కానికి ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అలాగే బిరియానీ వండ‌టంలోను ఎన్టీఆర్ త‌ర్వాతే. దీనిని బ‌ట్టి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, అభ‌య్ రామ్ ఇత‌రులు కూడా తార‌క్ వంట‌కాల్ని బాగానే ఆస్వాధిస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన వార్ 2 ఈ నెల 14న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ చిత్రంలో హృతిక్ రోష‌న్ ఒక కీల‌క పాత్ర‌ధారి. అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించ‌గా, య‌ష్ రాజ్ ఫిలింస్ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. వార్2లో ఎన్టీఆర్ వ‌ర్సెస్ హృతిక్ ఢీ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. ఇప్ప‌టికే విదేశాల‌లో ప్రీబుకింగులు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రీరిలీజ్ వేడుక ఈ ఆదివారం జ‌ర‌గ‌నుంది.