Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ రైటర్ల పారితోషికాలు: అక్షరానికి అక్షరాలా కోట్లు!

ఈ స్థాయికి త‌గ్గ‌ట్టుగానే రైట‌ర్ల రేంజ్ ఎదుగుతోందా? మ‌న‌కు ఉన్న టాప్- 5 ట్యాలెంటెడ్ స్టార్ రైట‌ర్ల పారితోషికాల రేంజ్ ఏమిట‌న్న‌ది చ‌ర్చిస్తే తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాలివి..

By:  Sivaji Kontham   |   27 Jun 2026 12:45 PM IST
టాలీవుడ్ స్టార్ రైటర్ల పారితోషికాలు: అక్షరానికి అక్షరాలా కోట్లు!
X

టాలీవుడ్ లో స్టార్ రైట‌ర్స్ రేంజ్ అంత‌కంత‌కు పెరుగుతోందా? ర‌చయిత‌ల‌ పారితోషికాల రేంజ్ ఎలా ఉంది? ఒక్కో సినిమా బ‌డ్జెట్ 100 కోట్ల స్థాయి నుంచి 500 కోట్ల రేంజుకు ఎదిగింది. ఈ స్థాయికి త‌గ్గ‌ట్టుగానే రైట‌ర్ల రేంజ్ ఎదుగుతోందా? మ‌న‌కు ఉన్న టాప్- 5 ట్యాలెంటెడ్ స్టార్ రైట‌ర్ల పారితోషికాల రేంజ్ ఏమిట‌న్న‌ది చ‌ర్చిస్తే తెలిసిన ఆస‌క్తిక‌ర విష‌యాలివి..

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్:

టాలీవుడ్ చరిత్రలో రచయితలకు స్టార్ స్టేటస్, హీరోలతో సమానమైన గుర్తింపు తెచ్చిన ఘనత `పరుచూరి బ్రదర్స్` (పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ) దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల బ్లాక్‌బస్టర్ సినిమాల వెనుక వీరి కలం బలం ఉంది. ప‌రుచూరి సోద‌రులు ఫామ్‌లో ఉన్న కాలంలో ఒక్కో సినిమాకు రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు పారితోషికం అందుకునేవారు. అప్ప‌ట్లో కోటి బ‌డ్జెట్ అనేది చాలా పెద్ద‌ది. నాటి కాలమాన పరిస్థితులు - సినిమా బడ్జెట్‌లతో పోలిస్తే వారిది అప్పట్లో ఒక రికార్డు స్థాయి రెమ్యునరేషన్ కావడం విశేషం. కాలంతో పాటే మార్పు. ప‌రుచూరి సోద‌రుల త‌ర్వాత చాలా మంది స్టార్ రైట‌ర్లు త‌మ స్థాయిని విస్త‌రించుకుంటూ ఎదిగారు.

విజ‌యేంద్ర ప్ర‌సాద్:

బాహుబలి, బాహుబ‌లి 2, భజరంగీ భాయిజాన్, మ‌ణిక‌ర్ణిక‌, త‌లైవి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగంలోనే తిరుగులేని స్టార్ రైటర్‌గా ఎదిగారు వి. విజయేంద్ర ప్రసాద్. `బాహుబలి` బ్రాండ్ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ప‌రుచూరి సోద‌రులు స‌మ‌కాలికుడిగా ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపు-గౌర‌వం అందుకున్నారు. ప్రస్తుతం విజయేంద్రుడు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు పారితోషికం వసూలు చేస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. బాలీవుడ్ ప్రాజెక్టుల‌కు 8కోట్ల రేంజులో అందుకున్నార‌ని కూడా అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్‌లో ఆయన కథ అందించిన `భజరంగీ భాయిజాన్`, `మణికర్ణిక`, కోలీవుడ్ ప్రాజెక్ట్ `తలైవి` చిత్రాలకు సైతం కోట్లలోనే భారీ పారితోషికాన్ని అందుకుని దేశంలోనే అత్యధిక ప్యాకేజీ అందుకునే రచయితగా నిలిచారు.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్:

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారడానికి ముందే స్టార్ రైటర్‌గా ఒక్కో సినిమాకు రూ. 3-4 కోట్ల వరకు పారితోషికం అందుకునే స్థాయికి చేరి తన అక్షరాల విలువను నిరూపించారు. రచయితగా ఆయన కెరీర్‌లో `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి`, `మన్మథుడు` వంటి చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ద‌ర్శ‌కుడిగా మారాక ఆయ‌న త‌న ర‌చ‌నా వైవిధ్యంతో ఇండ‌స్ట్రీ రికార్డులు, సంచ‌ల‌నాలు సృష్టించారు. నిత్య జీవితంలోని సున్నితమైన హాస్యాన్ని, మధ్యతరగతి భావోద్వేగాలను తనదైన శైలి ప్రాసలు, పదునైన పంచ్‌లతో మేళవించి ఆయన రాసిన సంభాషణలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించాయి. `స్వయంవరం`, `చిరునవ్వుతో` చిత్రాలతో మొదలైన ఆయన కలం ప్రయాణం.. `సముద్రం`, `వాసు` వంటి వైవిధ్యమైన సినిమాలకు అద్భుతమైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించేలా చేసింది. కేవలం మాటలతోనే థియేటర్లలో నవ్వులు పూయించడమే కాక, గుండెలను పిండేసే సెంటిమెంట్‌ను సైతం అలవోకగా పలికించగలగడం త్రివిక్రమ్ బెస్ట్ రచనల ప్రత్యేకత.

కొరటాల శివ: రచయితగా కోట్లు దాటిన ప్రయాణం

నేడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ, అంతకుముందు సుదీర్ఘ కాలం పాటు స్టార్ రైటర్‌గా ప‌రిశ్ర‌మ‌కు సేవలు అందించారు. భద్ర, సింహా, బృందావనం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన కథ, డైలాగ్స్ అందించారు. దర్శకుడిగా మారడానికి ముందే కొరటాల శివ స్టార్ రైటర్‌గా ఒక్కో సినిమాకు రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం అందుకునే స్థాయికి చేరారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి వందల కోట్ల మార్కెట్‌ను శాసిస్తున్నారు.

పోసాని కృష్ణ మురళి:

తెలుగు చిత్రసీమలో తనదైన విలక్షణ శైలితో గుర్తింపు తెచ్చుకున్న రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి. ఒకప్పుడు ఈయన కలం నుండి వచ్చిన గాయం, పవిత్ర బంధం, ఆపరేషన్ దుర్యోధన వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. రచయితగా పోసాని కృష్ణ మురళి బాగా బిజీగా ఉన్న రోజుల్లో ఒక్కో సినిమాకు రూ. 30 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు పారితోషికం అందుకున్నారు. ఆ కాలంలో ఒక రైటర్‌కు ఆ మొత్తం చాలా పెద్దది. పోసాని న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగాను విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ ఆలో రౌండ‌ర్ నైపుణ్యంతో ఇండ‌స్ట్రీలో నాలుగు వైపులా ఆర్జిస్తూ త‌న స్థాయిని కొన‌సాగించారు.

కోన వెంకట్:

తెలుగు సినిమాలో వాణిజ్య సూత్రాలను మార్చి `కోన మార్క్` కామెడీ ట్రెండ్‌ను సెట్ చేసిన సీనియర్ స్టార్ రైటర్ కోన వెంకట్. ఒకప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న రచయితలలో ఈయన ఒకరు. కోన వెంకట్ కేవలం కథ, స్క్రీన్‌ప్లే మాత్రమే కాకుండా ఒక ప్యాకేజీ రూపంలో (రైటింగ్ టీమ్‌తో కలిపి) సినిమాకు వర్క్ చేస్తారు. ఇందుకోసం ఆయన రూ. 2 కోట్ల నుండి రూ. 3 కోట్ల వరకు ప్యాకేజీ తీసుకుంటారని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆయన కథా విభాగంలో నిరంతరాయంగా 5 నుండి 10 మంది యువ రచయితలు అసోసియేట్స్‌గా పనిచేస్తుంటారు. ఇటీవల ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రాలకూ ఇదే స్థాయిలో పారితోషికం లభించింది.

సాయిమాధవ్ బుర్రా:

చారిత్రాత్మక, పౌరాణిక సినిమాలే కాకుండా భారీ కమర్షియల్ చిత్రాలకు తన పదునైన సంభాషణలతో ప్రాణం పోసే ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా. గౌతమిపుత్ర శాతకర్ణి, మహానటి, ఆర్ఆర్ఆర్ (RRR) వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు డైలాగ్స్ అందించిన ఆయనకు టాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్ప‌డింది. ఇటీవ‌లి టాలీవుడ్ బెస్ట్ సినిమాల‌న్నిటికీ ఆయ‌నే ర‌చ‌యిత‌. మెజారిటీ సినిమాల‌కు 50ల‌క్ష‌ల నుంచి 75ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకున్నారు. ప్రస్తుతం సాయిమాధవ్ బుర్రా ఒక్కో సినిమాకు రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన పని చేసిన భారీ చిత్రాలకు సైతం ఇదే రేంజ్‌లో రెమ్యునరేషన్ దక్కినట్లు టాక్.

బి.వి.ఎస్. రవి కథ, స్క్రీన్‌ప్లేలు అందించ‌డంలో నిష్ణాతుడు. రూ. 70 లక్షలు నుంచి రూ. 1.2 కోట్లు రేంజులో అందుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. గోపీమోహన్ స్క్రీన్‌ప్లే నైపుణ్యం కలిగిన స్టోరీ డెవలప్‌మెంట్ కోసం రూ. 50 లక్షలు - రూ. 1 కోటి ఇండివిడ్యువ‌ల్ పారితోషికం అందుకుంటార‌ని స‌మాచ‌రం. శ్రీ‌నువైట్ల‌తో క‌లిసి గోపి మోహ‌న్ ఇంకా పెద్ద ప్యాకేజీలు అందుకునేవార‌నే టాక్ ఉంది.

సినిమా విజయంలో కథే ప్రధాన భూమిక పోషిస్తుందని నమ్మే రోజులు మళ్లీ వచ్చాయి. అందుకే టాలీవుడ్‌లో కేవలం మాటలు, కథల కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనుకాడడం లేదు. నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (దర్శకుడిగా మారిన రచయిత), విజయేంద్ర ప్రసాద్, కోన వెంకట్, సాయిమాధవ్ బుర్రా వంటి కొద్దిమంది మాత్రమే టాలీవుడ్‌లో కోటి పైగా అందుకునే క్లబ్‌లో ఉన్న స్టార్ రైటర్లు. కంటెంట్ బాగుంటే ఎంతైనా ఖర్చు పెట్టేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉన్నా ఈ స్థాయి పారితోషికాలు కేవలం వేళ్లమీద లెక్కించదగిన కొద్దిమంది అగ్ర రచయితలకే దక్కుతున్నాయి. పరిశ్రమలో మరిన్ని మంచి కథలు రావాలంటే, కొత్త రచయితలను సైతం ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.