స్టార్ హీరోల సినిమాల మధ్య గ్యాప్ ఇంకెప్పుడు తగ్గుతుంది?
ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి దాదాపు ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు వచ్చేవి. కొన్నిసార్లు ఏడాదిలోనే రెండు రిలీజులు కూడా కనిపించేవి.
By: M Prashanth | 1 Jun 2026 2:41 PM ISTటాలీవుడ్ రేంజ్ గత కొన్నేళ్లలో ఫుల్ గా పెరిగిపోయిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. భారీ మార్కెట్, హై బడ్జెట్లు, వరల్డ్ రేంజ్ టెక్నికల్ వాల్యూస్ తో తెలుగు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. కానీ తెలుగు సినీ ప్రియులను ఎక్కువగా నిరాశపరుస్తున్న విషయం ఒకటుంది. అదే స్టార్ హీరోల సినిమాల మధ్య గ్యాప్.
ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి దాదాపు ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు వచ్చేవి. కొన్నిసార్లు ఏడాదిలోనే రెండు రిలీజులు కూడా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత విడుదల కావడానికి రెండేళ్లు, మూడు సంవత్సరాలు పట్టడం సాధారణంగా మారింది. దీంతో అభిమానులు తమ ఫేవరెట్ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తోంది.
అయితే దానికి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు రూపొందించడం, భారీ సెట్లు, షూటింగ్ లు, మోడ్రన్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, మల్టీ లాంగ్వేజ్ వంటి అంశాలే కారణాలు. అవి నిర్మాణ సమయాన్ని పెంచుతున్నాయి. నిర్మాతలు కూడా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకపోవడంతో ప్రాజెక్టులు అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాయి. అయితే అభిమానుల మనసులో మాత్రం ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. ఈ గ్యాప్ ఇంకెప్పుడు తగ్గుతుంది? అని.
దానికి సొల్యూషన్ పూర్తిగా స్టార్ హీరోల ప్లాన్ పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి.. ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించకుండా ఉండే విధానం కంటే, ముందుగానే లైనప్ సిద్ధం చేసుకుని ప్యారలల్ గా వర్క్ ముందుకు తీసుకెళ్తే గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుంది. షూటింగ్ పూర్తైన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగా మరో సినిమా చిత్రీకరణ ప్రారంభించే విధానాన్ని ఫాలో అయితే పరిస్థితి మారవచ్చు.
ఇలా జరిగితే కేవలం అభిమానులకే కాదు, మొత్తం ఇండస్ట్రీకి లాభమని చెప్పాలి. థియేటర్లకు పెద్ద సినిమాల కొరత తగ్గుతుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరింత వ్యాపార అవకాశాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఉండే జోష్ కొనసాగుతుంది. అలా తెలుగు సినిమా మార్కెట్ పెరుగుతున్న సమయంలో పెద్ద హీరోల సినిమాలు వెంట వెంటనే వస్తే చాలా లాభాలు ఉన్నాయి.
ఏడాది కనీసం ఒక సినిమా, సాధ్యమైతే రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటే అభిమానుల వెయిటింగ్ తగ్గుతుంది. అయితే ఆ విషయంలో స్టార్ హీరో హీరో ప్రభాస్ ను ఫాలో అవ్వాలని అనేక మంది నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రాజా సాబ్ తో రాగా.. త్వరలో ఫౌజీతో రానున్నారని తెలుస్తోంది. కాబట్టి మిగతా హీరోలు అలా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు.
ఏదేమైనా స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ ఇంకెప్పుడు తగ్గుతుందంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమా మరింత వేగంగా ఎదగాలంటే దీనికి సమాధానం కూడా త్వరలోనే కనిపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. స్టార్ సినిమాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి మారితే, టాలీవుడ్ రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
