ఏడాదికి రెండు సినిమాలు అంటాం.. కానీ అంత ఈజీనా?
ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజమే.
By: M Prashanth | 24 Aug 2026 10:02 AM ISTఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజమే. ఒక సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు వెయిట్ చేయడం ఎవరికి నచ్చదు. కానీ అదే సమయంలో కొత్త సినిమా అనౌన్స్ అయితే మాత్రం అది భారీగా ఉండాలి, కొత్త లుక్ ఉండాలి, యాక్షన్ పెద్దగా ఉండాలి, అన్ని భాషల్లో పని చేయాలి అంటారు. ఈ రెండూ ఒకేసారి జరగడం మాత్రం అంత ఈజీ కాదు.
ఇప్పుడు స్టార్ హీరో సినిమా అంటే జస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం కాదు. కథ ఫైనల్ కావడం నుంచి లుక్ టెస్టులు, భారీ సెట్స్, యాక్షన్ బ్లాక్స్, విదేశీ షెడ్యూల్స్, గ్రాఫిక్స్ వరకు చాలా పని ఉంటుంది. పైగా ఒక హీరో డేట్స్‌తోనే విషయం పూర్తవదు. మిగతా నటులు, టెక్నీషియన్స్, లొకేషన్స్ అన్నీ కలవాలి. అందుకే మూడు నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయడం కొన్ని కథలకు సాధ్యమే కానీ, ప్రతి పెద్ద సినిమాకూ కాదు.
అయితే ఇక్కడ మేకర్స్ వైపు కూడా తప్పించుకోలేని ప్రశ్న ఉంది. పెద్ద స్టార్ దొరికాడని ప్రతి కథను భారీ సినిమాగా మార్చాల్సిన అవసరం ఉందా? చిన్న కథను కూడా వందల కోట్ల సెటప్‌లో పెట్టి సంవత్సరాలు లాగితే చివరకు రిజల్ట్ పని చేయకపోతే ఆ టైమ్ మొత్తం వృథానే. ‘రాజా సాబ్’ విషయంలో వచ్చిన కామెంట్స్ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. చాలా కాలం తీసుకున్నా ఫలితం మాత్రం కలిసి రాలేదు.
ఇంకో విషయం స్టార్ హీరోల సెలక్షన్. ఇప్పుడు ఒక సినిమా పూర్తయ్యాకే తర్వాతది మొదలుపెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమా కూడా మొదలయ్యేది. ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్‌కే పూర్తిగా లాక్ అయిపోతున్నారు. అదే గ్యాప్‌ను ఇంకా పెంచుతోంది. కనీసం కథలు ముందే రెడీగా పెట్టుకుని, ఒకటి పూర్తయ్యేలోపే తర్వాతది ప్లాన్ చేస్తే టైమ్ కొంచెం తగ్గొచ్చు.
సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇంకా వరుసగా సినిమాలు చేస్తున్నారు. వాళ్లకు కూడా పెద్ద సినిమాలే ఉన్నాయి. కానీ ప్రతి సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ ప్రాజెక్ట్‌గా మార్చే ఒత్తిడి తక్కువ. అందుకే వాళ్ల దగ్గర రిలీజ్‌ల మధ్య గ్యాప్ కూడా కొంత తక్కువగా కనిపిస్తోంది. యంగ్ స్టార్స్ దగ్గర మాత్రం ఒక్క సినిమా మీదే రెండు మూడు సంవత్సరాలు పోతున్నాయి.
ఫ్యాన్స్ కోరేది చివరకు చాలా సింపుల్. ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా కావాలని కాదు.. కనీసం సంవత్సరానికి ఒక మంచి సినిమా అయినా రావాలి. దానికి సొల్యూషన్ కూడా పెద్దగా కష్టం కాదు. కథకు ఎంత స్కేల్ అవసరమో అంతే పెట్టాలి. హీరో మార్కెట్ పెద్దదని సినిమా కూడా తప్పనిసరిగా అంతే పెద్దదిగా చేయాల్సిన పని లేదు.
