కాంబినేషన్ సెట్ అయ్యాకే స్టోరీ డిస్కషన్?
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాణ ప్రక్రియలో ఓ పెను మార్పు చోటు చేసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 9 May 2026 5:00 PM ISTప్రస్తుతం టాలీవుడ్ నిర్మాణ ప్రక్రియలో ఓ పెను మార్పు చోటు చేసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కథ సిద్ధమైన అనంతరం ఆ కథకు సరిపోయే హీరోను- దర్శకుడిని వెతుక్కునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. ముందుగా క్రేజీ హీరో-దర్శకుడి కాంబినేషన్‌ను సెట్ చేయడం ఆ తర్వాత ఇద్దరికీ సరిపోయే కథ కోసం చర్చలు జరపడం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న కొత్త మాట. ఇలా కాంబినేషన్ సెట్ చేసే పద్ధతి బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్‌ను ముందే ఖరారు చేస్తోందని నిర్మాతలు బలంగా నమ్మి ముందుకెళ్తున్నారుట.
ఈ మార్పుకు ప్రధాన కారణం మార్కెట్ సమీకరణాలంటున్నారు. ఒక పెద్ద హీరో - స్టార్ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. శాటిలైట్, డిజిటల్ , థియేట్రికల్ హక్కుల రూపంలో భారీ ధర పలుకుతుంది. అందుకే నిర్మాతలు కథ కంటే ముందుగా క్రేజీ కాంబోను సెట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ పద్ధతి వల్ల ప్రాజెక్టుకు అవసరమైన ఫండింగ్ , క్రేజ్ సులభంగా దక్కుతుందన్నది నిర్మాతల నమ్మకం. అయితే ఈ విధానంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం కాంబినేషన్ కోసం కథను బలవంతంగా అల్లడం వల్ల కొన్నిసార్లు స్క్రీన్ ప్లే దెబ్బతినే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా దర్శకుడి స్టైల్ కు తూగేలా కథను మార్చడం వల్ల సహజత్వం లోపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథా చర్చలు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తర్వాతే మొదలవ్వడం వల్ల దర్శకుడిపై ఒత్తిడి పెరుగుతుంది. నిర్ణీత సమయంలోపు కథను సిద్ధం చేయాల్సి రావడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడాల్సి వస్తోంది. మరోవైపు ఈ ట్రెండ్ వల్ల యువ రచయితలకు , ప్రతిభావంతులకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఒకసారి కాంబినేషన్ సెట్ అయ్యాక ఆ హీరో-దర్శకుడికి సరిపోయే విభిన్నమైన పాయింట్స్ కోసం నిర్మాతలు కొత్త రచయితల వేటలో పడుతున్నారు.
ఈ క్రమంలోనే అనేక రైటర్స్ రూమ్స్ ఏర్పడి సరికొత్త ఐడియాల కోసం మథనం జరుగుతోంది. కథ ఏంటన్నది సెకండరీగా మారి ఏ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రకటించిన కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈ తరహాలోనే రూపుదిద్దుకున్నాయంటున్నారు. డైరెక్టర్ డేట్స్ ఉన్నప్పుడు దానికి సరిపోయే పాన్ ఇండియా స్టార్‌ను తీసుకురావడం వల్ల ప్రాజెక్ట్ విలువ అమాంతం పెరుగుతుంది. అటుపై నెలల తరబడి కథా చర్చలు జరిపి స్క్రిప్ట్‌ను లాక్ చేస్తున్నారు.
ఈ పద్ధతి వల్ల సినిమా మేకింగ్‌లో భారీ తనం కనిపిస్తున్నా? కథలో ఆత్మ లోపిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టాలీవుడ్ వ్యాపార కోణంలో ఈ కాంబినేషన్ సెట్టింగ్ విజయవంతంగా కొనసాగుతోంది. సినిమా అంటే కేవలం కళ మాత్రమే కాదు. వందల కోట్ల పెట్టుబడితో కూడిన వ్యాపారం కాబట్టి నిర్మాతలు రిస్క్ తగ్గించుకోవడానికి ఈ బాట పడుతున్నారు. చివరగా ప్రేక్షకులు చూసేది కథనే కాబట్టి కాంబినేషన్‌తో పాటు కంటెంట్‌పై కూడా సమానమైన శ్రద్ధ పెట్టినప్పుడే ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయన్నది అంతే వాస్తవం.
