చిన్న సినిమాలకు ప్రాణంగా పాటలు!
చిన్న సినిమాల్లో కంటెంట్ తో పాటు సంగీతం మాత్రమే ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించగలదు.
By: Srikanth Kontham | 28 May 2026 1:00 AM ISTచిన్న సినిమాల్లో కంటెంట్ తో పాటు సంగీతం మాత్రమే ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించగలదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు పాటలే అసలైన ప్రచార కర్తలుగా మారుతున్నాయి. టీజర్లు, ట్రైలర్ల కంటే ముందుగా విడుదలయ్యే ఒక్క పాట హిట్ అయితే? అది ఆ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్తోంది. ఆడియో సక్సెస్ ద్వారా థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించిన చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోనే యువ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న `ఎపిక్` సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలోని `సంచారమే` సాంగ్ ఇప్పటికే శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన `ప్రియ సఖి` అనే మెలోడీ పాట కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. చక్కని సాహిత్యంతో వినసొంపైన ట్యూన్స్‌తో వచ్చిన పాటలు సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడంలో వంద శాతం విజయవంతమయ్యాయి. అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న చిత్రం `చెనై లవ్ స్టోరీ`. ఈ స్టోరీ కూడా పూర్తి మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. `బేబి` వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌కు కథ, దర్శకత్వం వహించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ మార్కు అద్భుతమైన స్వరాలు, సాయి రాజేష్ మార్కు ఎమోషన్స్ ఈ చిన్న సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుందని చెప్పొచ్చు. అలాగే వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తోన్న `నాగబంధం` సినిమాలోని పాటలకు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. లవ్ స్టోరీలకే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ఫాంటసీ చిత్రాలకు సైతం సంగీతం ఏ స్థాయిలో హైప్ తీసుకురాగలదో? ఈ చిత్ర ఆల్బమ్ నిరూపిస్తోంది. దీంతో పాటు, టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న సరికొత్త చిత్రానికి కూడా మ్యూజిక్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం.
నిజానికి చిన్న సినిమాలకు సంగీతం అనేది వినోదం మాత్రమే కాదు. అదొక బలమైన మార్కెటింగ్ స్ట్రాటజీ. పెద్ద హీరోల సినిమాల్లా కోట్లాది రూపాయల పబ్లిసిటీ బడ్జెట్ లేని సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ లేదా యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్ సినిమాను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నేటి డిజిటల్ అండ్ స్ట్రీమింగ్ యుగంలో ఆల్బమ్ సూపర్ హిట్ అయితే థియేట్రికల్ రన్‌కు సగం పునాది పడినట్లేనని నిర్మాతలు నమ్ముతున్నారు. కథలో దమ్ముండి దానికి తోడు చార్ట్‌బస్టర్ పాటలు తోడైతే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలనైనా సృష్టించగలవు. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు లేకపోయినా? హృదయాన్ని హత్తుకునే సంగీతంతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చని ప్రస్తుత ట్రెండ్ స్పష్టం చేస్తోంది.
