Begin typing your search above and press return to search.

ఈ వారం సినిమాలు.. సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించడం లేదు. లావణ్య త్రిపాఠి కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సతీ లీలావతి సినిమాతో ఆమె మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు.

By:  M Prashanth   |   8 May 2026 9:00 AM IST
ఈ వారం సినిమాలు.. సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందా?
X

టాలీవుడ్‌ లో గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాల హడావిడి తగ్గిపోవడంతో బాక్సాఫీస్ మళ్లీ కాస్త స్లో అయినట్లు పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల్లో సరైన ఆసక్తి క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వారం విడుదలకు సిద్ధమైన మూడు తెలుగు సినిమాల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉండటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

మే 8వ తేదీన థియేటర్లలోకి వస్తున్న చిత్రాల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందిన రేజర్, యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన గోదారి గట్టుపైన ఉన్నాయి. అయితే ఆ మూడు సినిమాల్లో ఏదీ విడుదలకు ముందు ప్రేక్షకుల్లో బజ్ చేయకపోవడం గమనార్హం. అయితే సాధారణంగా సినిమా విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు, పాటలు లేదా ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా కొంత హైప్ తీసుకురావడం కామన్.

కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించడం లేదు. లావణ్య త్రిపాఠి కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సతీ లీలావతి సినిమాతో ఆమె మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ చిత్రానికి అనుకున్న రేంజ్ లో బజ్ కనిపించడం లేదు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినా, ప్రమోషన్స్ నిర్విహించినా.. కథ ఏమిటి, ఏ జానర్‌ లో వస్తోంది అన్న విషయాలపై కొందరు ప్రేక్షకుల్లో స్పష్టత తక్కువగానే ఉందని వినికిడి.

ఇక దర్శకుడు రవిబాబు తన ప్రత్యేకమైన కథలతో గుర్తింపు పొందిన సెలబ్రిటీ. భిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు రేజర్ అనే థ్రిల్లర్ తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఆ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో ప్రచారం జరగలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో రవిబాబు సినిమాలకు ఉండే ఆసక్తి ఈసారి కనిపించడం లేదని టాక్ నడుస్తోంది.

మరోవైపు సుమంత్ ప్రభాస్ నటించిన గోదారి గట్టుపైన కూడా విడుదలకు సిద్ధమైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమా కంటెంట్ పరంగా బాగుంటుందనే టాక్ ఉన్నప్పటికీ.. అది ప్రేక్షకులకు పెద్దగా చేరలేదని అంటున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ వీక్ గా ఉండటం సినిమాకు మైనస్‌ గా మారిందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య, సరైన ప్రమోషన్ లేకపోవడం, స్టార్ హీరోల సినిమాల మధ్య నలిగిపోవడం వంటి అంశాలు పెద్ద సవాలుగా మారాయి. మంచి కంటెంట్ ఉన్నా ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లడంలో మేకర్స్ ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశాలు లేకపోతే సినిమాపై ఆసక్తి పెరగడం కష్టమైపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బజ్ లేకుండా విడుదలై తర్వాత మంచి టాక్‌ తో విజయాలు సాధించిన చిన్న సినిమాలు గతంలో ఉన్నాయి. అందుకే ఆ మూడు చిత్రాలు కూడా కంటెంట్‌ తో ఆకట్టుకుంటే ప్రేక్షకుల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ వారం విడుదలవుతున్న మూడు సినిమాల్లో ఏదైనా బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌ గా నిలుస్తుందేమో అంతా వేచి చూడాలి.