Begin typing your search above and press return to search.

క్రేజీ సినిమాల‌తో ముస్తాబైన సెప్టెంబ‌ర్

90స్ మిడిల్ క్లాస్, అన‌గ‌న‌గా త‌ర్వాత ఈటీవీ విన్ నుంచి వ‌స్తోన్న సినిమా లిటిల్ హార్ట్స్. మౌళి త‌నూజ్, శివానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు మార్తాండ్ సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Aug 2025 11:26 AM IST
క్రేజీ సినిమాల‌తో ముస్తాబైన సెప్టెంబ‌ర్
X

టాలీవుడ్ లో గ‌త కొన్నాళ్లుగా బాక్సాఫీస్ చాలా డ‌ల్ గా ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీలో సాలిడ్ స‌క్సెస్ వ‌చ్చి చాలా రోజుల‌వ‌డంతోనే ఈ ప‌రిస్థితి నెల‌కొంది. ఆగ‌స్ట్ లో ప‌లు భారీ సినిమాలు రిలీజైన‌ప్ప‌టికీ అవి స‌క్సెస్ అవ‌క‌పోగా, ఆ సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా కావు. నెక్ట్స్ వీక్ లో త్రిబాణ‌ధారి బార్బ‌రిక్, పర‌దా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. దీంతో ఆగ‌స్ట్ నెల ముగియ‌నుంది. ఇక ఇప్పుడంద‌రి దృష్టి సెప్టెంబ‌ర్ లో వ‌చ్చే సినిమాల‌పైనే ఉంది. సెప్టెంబ‌ర్ లో టాలీవుడ్ నుంచి ప‌లు క్రేజీ సినిమాలు రానున్నాయి. వాటిలో ముందుగా..

మిరాయ్‌

హ‌నుమాన్ సినిమా త‌ర్వాత తేజ స‌జ్జ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన పాన్ ఇండియా సూప‌ర్ హీరో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ మిరాయ్. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మిరాయ్ నుంచి రిలీజైన కంటెంట్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి.

ఘాటీ

మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా త‌ర్వాత అనుష్క న‌టిస్తున్న కంబ్యాక్ సినిమా ఘాటీ. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కూడా సెప్టెంబ‌ర్ 5నే రిలీజ్ కానుంది. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, చైత‌న్య రావు, విక్ర‌మ్ ప్ర‌భు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ది గ‌ర్ల్‌ఫ్రెండ్

ఇక ర‌ష్మిక మంద‌న్నా లీడ్ రోల్ లో న‌టించిన ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ది గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా సెప్టెంబ‌ర్ 5వ తేదీనే రిలీజ్ కానుంది. టాలీవుడ్ న‌టుడు మ‌రియు డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించగా, ద‌స‌రా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించారు.

కిష్కింధ‌పురి

భైర‌వం త‌ర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వ‌స్తోన్న సినిమా కిష్కింధ‌పురి. రేడియో స్టేష‌న్ నేప‌థ్యంలో జ‌రిగే హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ తెర‌కెక్కింది. కౌశిక్ పెగ‌ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇప్ప‌టికే రిలీజైన గ్లింప్స్, టీజ‌ర్ ఆడియ‌న్స్ లో మంచి ఆస‌క్తిని క‌లిగించాయి.

లిటిల్ హార్ట్స్

90స్ మిడిల్ క్లాస్, అన‌గ‌న‌గా త‌ర్వాత ఈటీవీ విన్ నుంచి వ‌స్తోన్న సినిమా లిటిల్ హార్ట్స్. మౌళి త‌నూజ్, శివానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు మార్తాండ్ సాయి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెప్టెంబ‌ర్ 12న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుండ‌గా, థియేట్రిక‌ల్ ర‌న్ పూర్త‌య్యాక ఈటీవీ విన్ లో ప్రీమియ‌ర్ కు రానుంది.

భ‌ద్ర‌కాళి

ఇక త‌మిళ న‌టుడు కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన విజ‌య్ ఆంటోనీ భ‌ద్ర‌కాళి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా మార్గ‌న్ సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన విజ‌య్ ఆంటోనీ ఇప్పుడు సెప్టెంబ‌ర్ 19న మ‌రోసారి ఆడియ‌న్స్ ను ప‌ల‌క‌రించ‌నున్నారు. అరుణ్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఏషియ‌న్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది.

ఓజి

టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా వ‌స్తోన్న మూవీ ఓజి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన ఈ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీపై ఎన్నో అంచ‌నాలున్నాయి. ఎప్పుడెప్పుడు ఓజి సినిమాను చూస్తామా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలా ఎగ్జెటింగ్ గా ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహ‌న్, ఇమ్రాన్ హ‌ష్మీ, శ్రియా రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన విష‌యం తెలిసిందే.

అఖండ‌2

ఓజితో పాటూ అదే రోజున నంద‌మూరి బాల‌కృష్ణ- బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన అఖండ‌2 కూడా రిలీజ్ కానుంది. ఇంకా చెప్పాలంటే సెప్టెంబ‌ర్ 25న త‌మ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అంద‌రికంటే ముందు చెప్పింది అఖండ‌2 టీమే. అఖండ కు సీక్వెల్ గా వ‌స్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. కాక‌పోతే అఖండ‌2 వాయిదా ప‌డుతుంద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు.

మ‌రి ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమాలు ఆడియ‌న్స్ అంచాల‌ను అందుకుని, వారిని అల‌రించి బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్లుగా నిలుస్తాయో చూడాలి.