సీనియర్ల వైపు ఓ లుక్కేయండి బాస్!
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రస్థానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు.
By: Srikanth Kontham | 25 Jun 2026 1:16 PM ISTప్రస్తుతం తెలుగు సినిమా ప్రస్థానం సరికొత్త పుంతలు తొక్కుతోంది. రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. టాలీవుడ్ నుంచి వస్తున్న విజువల్ వండర్స్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లను రాబడుతున్నాయి. అయితే ఈ పాన్-ఇండియా ప్రభంజనంలో ఎక్కువగా నేటి తరం యంగ్ లేదా మిడ్-రేంజ్ స్టార్స్ మాత్రమే భాగస్వాములు అవుతున్నారు. ఈ అగ్ర దర్శకులందరి చూపు కూడా ప్రస్తుత క్రేజ్ ఉన్న యువ హీరోలపైనే ఉండటం వల్ల పరిశ్రమను దశాబ్దాలుగా భుజాలపై మోసిన సీనియర్ స్టార్స్ ఈ భారీ ప్రాజెక్టులకు కాస్త దూరంగానే ఉండిపోతున్నారు.
టాలీవుడ్ నాలుగు స్తంభాలుగా పిలవబడే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు ఉన్న మాస్ ఫాలోయింగ్, నటన అనుభవం సామాన్యమైనవి కావు. ఇప్పటికీ వీరు బాక్సాఫీస్ వద్ద తమదైన శైలిలో వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ పండించడంలో వీరికి సాటిలేరు. సరిగ్గా సరిపోయే కథ పడితే, ఆయా పాత్రలను గ్లోబల్ ఆడియన్స్‌కు సైతం కనెక్ట్ చేయగల సత్తా సీనియర్ హీరోలకు ఉంది. కేవలం ఒక ప్రాంతీయ మార్కెట్‌కే వీరిని పరిమితం చేయకుండా వీరిలోని అసలైన మాస్ పవర్‌ను, నటనను పాన్-ఇండియా వేదికపై ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.
పక్క పరిశ్రమలను గమనిస్తే సీనియర్ హీరోల హవా స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్లు లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి నేటి తరం దర్శకులతో చేతులు కలిపి `విక్రమ్`, `జైలర్` వంటి ఇండస్ట్రీ హిట్లను పాన్-ఇండియా స్థాయిలో అందుకున్నారు. మాలీవుడ్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ సైతం వైవిధ్యమైన, భారీ బడ్జెట్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు. అలాంటప్పుడు టాలీవుడ్ మేకర్స్ కూడా ఈ సీనియర్ లెజెండ్స్ వైపు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టకూడదనే ప్రశ్న తలెత్తుతోంది. వీరికి ఉన్న ఇమేజ్‌ను నేటి తరం డైరెక్టర్ల మేకింగ్ స్టైల్‌తో ముడిపెడితే బాక్సాఫీస్ సమీకరణాలు మారిపోతాయి.
రాజమౌళి విజువల్ గ్రాండియర్, సుకుమార్ రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, నాగ్ అశ్విన్ వరల్డ్ బిల్డింగ్.. ఇవన్నీ ఒకెత్తయితే ,ఈ తరహా మేకింగ్‌కు చిరంజీవి గ్రేస్, బాలయ్య పవర్-ప్యాక్డ్ డైలాగ్ డెలివరీ, వెంకటేష్ క్లాసిక్ ఎమోషన్స్, నాగార్జున స్టైలిష్ ప్రెజెన్స్ తోడైతే వచ్చే కిక్కే వేరు. ఈ దర్శకుల శైలికి సరిపోయేలా సీనియర్ల వయసుకు, ఇమేజ్‌కు తగినట్టుగా పవర్‌ఫుల్ పాత్రలను డిజైన్ చేస్తే అది ఇండియన్ సినిమాలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్ అవుతుంది. యువ తారల చుట్టూనే కథలు అల్లుకోకుండా లెజెండ్స్ కోసం ప్రత్యేకమైన కాన్సెప్ట్స్ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
నిజానికి సీనియర్ హీరోలు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉంటారు. అయితే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ దృష్ట్యా వారికి కూడా సరైన విజువల్ ప్లాట్‌ఫార్మ్ లభించాల్సి ఉంది. కేవలం రొటీన్ ఫార్ములా కథలతోనే కాకుండా నేటి తరం పాన్-ఇండియా దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా తమను తాము సరికొత్తగా ఆవిష్కరిం చుకోవడానికి వారు కూడా ఆసక్తి చూపిస్తారు. ఇండస్ట్రీలో మార్పు రావాలంటే దర్శకులే ముందడుగు వేసి ఈ సీనియర్ టాప్ స్టార్స్ కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేయాలి. అప్పుడే సీనియర్ల పొటెన్షియల్ ఏంటనేది నేటి తరం పాన్-ఇండియా ప్రేక్షకులకు పూర్తిగా పరిచయమవుతుంది.
తెలుగు సినిమా గ్లోబల్ లీగ్‌లో దూసుకుపోతున్న తరుణంలో అందరినీ కలుపుకొని వెళ్లడమే పరిశ్రమకు మరింత బలాన్నిస్తుంది. కొంతమంది స్టార్లకే పరిమితం కాకుండా సీనియర్ హీరోలను కూడా పాన్-ఇండియా రేంజ్‌లో నిలబెట్టే బాధ్యతను అగ్ర దర్శకులు భుజాన వేసుకోవాలి. టాలీవుడ్‌ను ఇక్కడి వరకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఈ నలుగురు పిల్లర్స్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసినప్పుడే పాన్-ఇండియా మార్కెట్ మరింత విస్తరిస్తుంది. మరి టాప్ డైరెక్టర్లు ఇకనైనా సీనియర్ల వైపు ఓ లుక్కేసి ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
