Begin typing your search above and press return to search.

సెకండాఫ్ లోనే అసలైన సందడి.. అన్నీ అనుకున్నట్టు వస్తే..

2026 ఫస్టాఫ్ మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అవ్వనుండగా.. ఈసారి టాలీవుడ్ కు పెద్దగా ఊపునివ్వలేకపోయిందనే చెప్పాలి.

By:  M Prashanth   |   6 Jun 2026 5:00 AM IST
సెకండాఫ్ లోనే అసలైన సందడి.. అన్నీ అనుకున్నట్టు వస్తే..
X

2026 ఫస్టాఫ్ మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అవ్వనుండగా.. ఈసారి టాలీవుడ్ కు పెద్దగా ఊపునివ్వలేకపోయిందనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో థియేటర్లకు రాకపోవడంతో ప్రేక్షకులు భారీ చిత్రాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. సంక్రాంతికి తర్వాత ఇప్పుడు జూన్ లో మళ్లీ రామ్ చరణ్ పెద్ది మూవీ రాగా.. పరిస్థితి కాస్త మారింది. ఇక సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ గా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే జూన్ నెలలో పెద్ది తర్వాత స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం, అఖిల్ సినిమా లెనిన్ విడుదలవుతున్నాయి. అయితే అసలు సందడి జూలై నుంచి మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. నాగబంధం, రావు బహదూర్, చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్, భోగి వంటి చిత్రాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

సెప్టెంబర్‌ లో రణబాలి, అక్టోబర్‌ లో ఆదర్శ కుటుంబం, కింగ్ 100, బాలయ్య- గోపీచంద్ మలినేని వంటి పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, డిసెంబర్‌ లో రానున్న గూఢచారి 2పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీలు ఫిక్స్ అవ్వకపోయినా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనేక చిత్రాలు కూడా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, ప్రభాస్ ఫౌజీ, నాని ది ప్యారడైజ్, నాగచైతన్య వృషకర్మ, నిఖిల్ స్వయంభూ, సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటి గట్టు, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్, నితిన్ కొత్త చిత్రం వంటి సినిమాలు విడుదల తేదీల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్మెంట్స్ కూడా రానున్నాయి.

ఇక సీనియర్ హీరోల నుంచి యుంగ్ హీరోల వరకు దాదాపు అందరూ ఈ ఏడాది సెకండాఫ్ లో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్లతో పాటు ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, శర్వానంద్, అఖిల్, నితిన్ వంటి హీరోలు కూడా తమ సినిమాలతో బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా మారనుంది. వీటితోపాటు కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా రానున్నాయి.

అయితే ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో సినిమాలు అన్నీ అనుకున్నట్లు వస్తాయా? లేక కొన్ని చిత్రాలు వాయిదా పడతాయా? అన్నది కూడా కీలకమే. డిజిటల్ రైట్స్, నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల కొన్నిసార్లు విడుదల తేదీలు మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ లో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.

అయినప్పటికీ అన్ని చిత్రాలు అనుకున్న సమయానికి విడుదలైతే 2026 సెకండాఫ్ తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత బిజీ సీజన్‌ గా నిలిచే అవకాశం ఉంది. వరుసగా పెద్ద సినిమాలు వస్తే థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అదే సమయంలో మంచి హిట్స్ గా నిలిస్తే టాలీవుడ్‌ కు ఇది మరింత స్పెషల్ ఇయర్ గా మారొచ్చు. అందుకే ఇప్పుడు అందరి చూపు రాబోయే కొత్త సినిమాలపైనే ఉంది.