Begin typing your search above and press return to search.

ప‌బ్లిసిటీ ఫీవ‌ర్‌..అప్ప‌ట్లో స్క్రిప్టెడ్‌ వీడియోస్‌..ఇప్పుడు..!

సినిమా ప‌బ్లిసిటీ దేవుడెరుగు.. మూవీ టీమ్‌, హీరో పోలీస్టేష‌న్‌ల చుట్టూ, మ‌హిళా క‌మీష‌న్‌ల చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

By:  Tupaki Entertainment Desk   |   5 Feb 2026 1:08 PM IST
ప‌బ్లిసిటీ ఫీవ‌ర్‌..అప్ప‌ట్లో స్క్రిప్టెడ్‌ వీడియోస్‌..ఇప్పుడు..!
X

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో సినిమాల ప‌బ్లిసిటీ గ‌త కొంత కాలంగా వింత పోక‌డ‌లు పోతోంది. త‌మ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులే మౌత్ ప‌బ్లిసిటీ చేస్తార‌ని మ‌ర‌చిన మేక‌ర్స్‌, హీరోలు త‌మ సినిమా ప్ర‌చారం కోసం అడ్డ‌దారులు తొక్క‌డం ప‌రిపాటిగా మారింది. చిన్న హీరోలే ఈ త‌ర‌హా ప్ర‌మోష‌న్స్‌కు తెర‌లేపుతుండ‌టంతో అనేక వివాదాలు త‌లెత్తుతున్నాయి. సినిమా ప‌బ్లిసిటీ దేవుడెరుగు.. మూవీ టీమ్‌, హీరో పోలీస్టేష‌న్‌ల చుట్టూ, మ‌హిళా క‌మీష‌న్‌ల చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి.

కొన్నేళ్ల క్రితం మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ తాను న‌టించిన 'అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం' సినిమా రిలీజ్ టైమ్‌లో సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ని ప‌ట్టుకుని రోడ్డుపై చేసిన వీడియో అప్ప‌ట్లో వివాదాల‌కు దారి తీయ‌డం తెలిసిందే. అది కాస్తా ఓ టీవీ ఛాన‌ల్‌లో బిగ్ డిబేట్‌కు తెర తీయ‌డం..అదే డిబేట్‌లో యాంక‌ర్ హీరో విశ్వ‌క్‌సేన్‌ని 'గెట్ ఔట్ మై స్టూడియో' అంటూ అవ‌మానించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ త‌రువాత కూడా విశ్వ‌క్‌సేన్ న‌టించిన సినిమా ఈవెంట్‌లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాట‌లు వివాదం కావ‌డంతో 'లైలా' సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట పెద్ద ఉద్య‌మ‌మే న‌డిచింది.

ఈ గోల స‌ద్ద‌మ‌నిగింది ఇక ఇలాంటి వివాదాలు ఉండ‌వు అనుకుంటున్న టైమ్‌లో 'దండోరా' ప్రెస్ మీట్‌లో శివాజీ హీరోయిన్‌ల వేష‌ధార‌ణ‌, కాస్ట్యూమ్స్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో దీనిపై పెద్ద దుమార‌మే రేగింది. చివ‌రికి మ‌హిళా క‌మీష‌న్ కూడా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. అక్క‌డి వ‌ర‌కు వెళ్లాక గానీ ఈ వివాదం స‌ద్దుమ‌న‌గ‌లేదు. ఆ త‌రువాత కూడా అన‌సూయ ఈ వివాదాన్ని మ‌రింత వైర‌ల్ చేయాల‌ని ప్ర‌య‌త్నించింది కూడా. అయితే సినిమాల ఈవెంట్‌ల పేరుతో జ‌రుగుతున్న వివాదాల ప‌బ్లిసిటీ ఇప్పుడు చంద్ర‌హాస్ ఉదంతంతో ప‌రాకాష్ట‌కు చేరింది.

ఈటీవీ ప్ర‌భాస్ త‌న‌యుడు చంద్ర‌హాస్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `బ‌రాబ‌ర్ ప్రేమిస్తా`. ఈ మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్ర‌హాస్ పాడిన పాట ఇప్పుడు వివాదాస్ప‌దం అవ్వ‌డ‌మే కాకుండా పోలీస్ కేస్ ఫైల్ అయ్యే వ‌ర‌కు వెళ్లింది. ఈ ఈవెంట్‌లో చంద్ర‌హాస్ పాటిన పాట‌లో అస‌భ్య‌క‌ర‌మైన ప‌దాలు దొర్లాయి. దీనిపై అదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జెడీ చ‌క్ర‌వ‌ర్తి అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా ఆ స‌మ‌యంలో తాను అక్క‌డి నుంచి వెళ్లిపోయి ఉండాల్సింద‌ని, ఇలాంటివి తాను స‌హించ‌న‌ని ప్ర‌త్యేకంగా ఓ వీడియోనే రిలీజ్ చేశాడు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌హాస్ వాడిన భాష స‌రికాదంటూ ఓ ఛాన‌ల్ ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ అశోక్ కుమార్ ఓ వీడియోని విడుద‌ల చేయ‌డంతో దానిపై స్పందిస్తూ చంద్ర‌హాస్ వార్నింగ్ ఇవ్వ‌డం మ‌రో వివాదానికి తెర‌లేపింది. దీంతో చంద్ర‌హాస్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు న‌మోదైంది. త‌న‌ని విమ‌ర్శించిన జ‌ర్న‌లిస్ట్‌ని బెదిరిస్తూ 24 గంట‌ల‌లో త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో దీనిపై స‌ద‌రు ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ పోలీసుల‌ని సంప్ర‌దించాడు. దీంతో వారు చంద్ర‌హాస్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు ఫైల్ చేయ‌డంతో ఈ టాపిక్ మ‌రో చ‌ర్చ‌కు తెర‌లేపింది. సినిమాని ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం త‌ప్పుకాదు కానీ వైర‌ల్ కావాల‌నే వంక‌తో హ‌ద్దులు దాటితేనే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఈ ఉదంతాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప‌బ్లిసీటీ పిచ్చి పీక్స్ చేరిన నేప‌థ్యంలో మ‌రోసారి ఇలాంటి వివాదాలు జ‌ర‌క్కుండా మేక‌ర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో లేక ఇవే త‌మ‌కు ప‌బ్లిసిటీని తెచ్చి పెడ‌తాయ‌ని కంటిన్యూ చేస్తారో చూడాలి.