Begin typing your search above and press return to search.

పల్లె బాట పట్టిన యంగ్ స్టార్స్!

ఒకప్పుడు పల్లెటూరి కథలంటే కేవలం సెంటిమెంట్‌కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు అవే కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   11 April 2026 7:00 AM IST
పల్లె బాట పట్టిన యంగ్ స్టార్స్!
X

ఓవైపు తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టిస్తుంటే మ‌రికొంత మంది న‌వ‌త‌రం మేక‌ర్స్ గ్రామీణ నేపథ్యంగ‌ల‌ సినిమాల ట్రెండ్ ను అంత‌కంత‌కు పెంచుతున్నారు. ఒకప్పుడు పల్లెటూరి కథలంటే కేవలం సెంటిమెంట్‌కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు అవే కథలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి ఘనవిజయం సాధించడం ఈ మార్పుకు నిదర్శనం. అంత‌కు ముందు రిలీజ్ అయిన బ‌ల‌గం గొప్ప చిత్రంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. నేటి యువ తరం హీరోలు , దర్శకులు విదేశీ లోకేషన్ల కంటే పచ్చని పల్లెటూరి పొలాలనే తమ కథా వేదికలుగా ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. మాధవ్ నటిస్తోన్న మారెమ్మ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందుతోంది. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొత్త హీరోలు తమను తాము నిరూపించుకోవడానికి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఇలాంటి సహజసిద్ధమైన పాత్రలను ఎంచుకోవడం సానుకూల పరిణామం.

మరోవైపు బలగం సినిమాతో పల్లెటూరి ఎమోషన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు వేణు ఎల్దండి తదుపరి చిత్రం ఎల్లమ్మ`పై దృష్టి సారించాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ హీరోగా న‌టిస్తోన్న‌ ఈ సినిమా కూడా గ్రామీణ సంస్కృతి , ఆచారాల చుట్టూ తిరిగే కథతో వస్తోంది. `బలగం అందించిన స్ఫూర్తితో వేణు ఈసారి మరింత లోతైన భావోద్వేగాలను, పల్లెటూరి జీవన విధానాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇవ్వనుంది.

యువ హీరో కిరణ్ అబ్బవరం సైతం తన పంథాను మార్చి గ్రామీణ కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఆయన నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం తిమ్మరాజుపల్లి అనే చిత్రం ఏప్రిల్ 17న విడుదలవుతుంది. ఈ సినిమా పూర్తిగా రూరల్ సెటప్‌లో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. కిరణ్ అబ్బవరం గత చిత్రాల్లో పల్లెటూరి అబ్బాయిగా మెప్పించి నప్పటికీ ఈ చిత్రం ఆయన కెరీర్‌లో విభిన్నమైన మలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లెల్లో ఉండే రాజకీయాలు , సామాజిక అంశాలను ఇందులో స్పృశించినట్లు తెలుస్తోంది.

గ్రామీణ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం అందులో ఉండే సహజత్వం. నగర జీవితంలోని యాంత్రికతకు దూరంగా, స్వచ్ఛమైన అనుబంధాలు, పల్లెటూరి చిలిపి పనులు ,మట్టి మనుషుల కథలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతున్నాయి. బలగం, కేర్ ఆఫ్ కంచరపాలెం వంటి చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధించడం చూసాక‌ యంగ్ స్టార్స్ కూడా తమ కంఫర్ట్ జోన్ దాటి మరీ పల్లెటూరి వాతావరణంలోకి వెళ్తున్నారు. ఇది కంటెంట్ పరంగానే కాకుండా బడ్జెట్ పరంగా కూడా నిర్మాతలకు గిట్టుబాటు అయ్యే అంశం.

ఆ ర‌కంగా పల్లెటూరి కథల ట్రెండ్ టాలీవుడ్‌లో సరికొత్త ఊపిరి పోస్తోంది. భారీ గ్రాఫిక్స్ కంటే బలమైన కథలు, మట్టి వాసన ఉన్న పాత్రలే సినిమాను గట్టెక్కి స్తాయని యంగ్ స్టార్స్ నిరూపిస్తున్నారు. మాధవ్, వేణు, కిరణ్ అబ్బవరం వంటి వారు తీసుకొస్తున్న ఈ రూరల్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి. ఏదేమైనా? తెలుగు సినిమా మళ్లీ రూట్స్ వెతుక్కుంటూ గ్రామాల వైపు వెళ్లడం శుభపరిణామంగా చెప్పొచ్చు.