Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ ట్రెండ్!

పచ్చని పల్లెటూళ్లు, మనుషుల మధ్య కల్మషం లేని బంధాలు, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే కథల వైపు నేటి దర్శకులు, కథానాయకులు ఆకర్షితులవుతున్నారు.

By:  Srikanth Kontham   |   11 July 2026 5:56 PM IST
టాలీవుడ్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ ట్రెండ్!
X

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓ సరికొత్త మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు విలాసవంతమైన నగరాలు, విదేశీ లొకేషన్లు, సూట్లు-బూట్లు వేసుకున్న కథానాయకులతో సాగిన వాణిజ్య సినిమాలు మళ్లీ మూలాల్లోకి ప్రయాణిస్తున్నాయి. పచ్చని పల్లెటూళ్లు, మనుషుల మధ్య కల్మషం లేని బంధాలు, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే కథల వైపు నేటి దర్శకులు, కథానాయకులు ఆకర్షితులవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ట్రెండ్ ఒక వర్గానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తోంది.

గడచిన కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో వచ్చిన గ్రామీణ నేపథ్య చిత్రాలు సాధించిన విజయాలే దీనికి నిదర్శనం. పల్లెటూరి రాజకీయాలు, ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన `రంగస్థలం`.. కోస్తా తీర ప్రాంత ప్రేమకథగా అలరించిన `ఉప్పెన`, గ్రామీణ మూఢనమ్మకాలు-మిస్టరీ చుట్టూ తిరిగిన `విరూపాక్ష` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అలాగే గంధపు చెక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగిన `పుష్ప`, బొగ్గు గనుల కార్మికుల జీవితాలను ఆవిష్కరించిన `దసరా` ప్రకృతికి-మనుషులకు ఉన్న బంధాన్ని చూపిన కన్నడ డబ్బింగ్ చిత్రం `కాంతార` వంటి సినిమాలు ప్రాంతీయ సరిహద్దులను దాటి సంచలనం సృష్టించాయి. ఈ చిత్రాల విజయం పల్లెటూరి కథలలో ఎంతటి సత్తా ఉందో పరిశ్రమకు నిరూపించింది.

పరిశ్రమలోని అగ్ర కథానాయకులు సైతం రెగ్యులర్ ఇమేజ్‌ను పక్కనబెట్టి మరీ పల్లెటూరి పాత్రల్లో ఒదిగిపోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యువ హీరోలు, రగ్గడ్ రా లుక్‌లో కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పల్లెటూరి యాసను స్పష్టంగా పలుకుతూ అక్కడి జీవన విధానాన్ని తెరపై ప్రతిబింబిస్తూ నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నారు. స్టార్ హీరోల సైతం ఇలాంటి వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడంతో రూరల్ సినిమాల మార్కెట్ పరిధి ఊహించని స్థాయికి పెరిగింది.

ఇదే బాటలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు కూడా గ్రామీణ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. అఖిల్ అక్కినేని సరికొత్త మేకోవర్‌తో వచ్చిన `లెనిన్` చిత్రం ఓ జాతర నేపథ్యంలోని భావోద్వేగపూరిత ప్రేమకథతో ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సాన తెరకెక్కించిన `పెద్ది` చిత్రం గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా , భావోద్వేగాల కలబోతగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. మట్టి వాసన కలిగిన కథలకు థియేటర్లలో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉంటుందని ఈ నయా చిత్రాలు మరోసారి నిరూపించాయి.

టెక్నికల్ గా చూస్తే రూరల్ ట్రెండ్ సినిమాలకు సాంకేతిక నిపుణుల పనితనం ప్రధాన బలంగా మారుతోంది. పల్లెటూరి ప్రకృతి అందాలను, అక్కడి సహజత్వాన్ని అద్భుతంగా బంధించే కెమెరా పనితనం ఒక ఎత్తయితే? జానపద బాణీలతో కూడిన సంగీతం, హృదయానికి హత్తుకునేలా ఉండే నేపథ్య సంగీతం మరో ఎత్తు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై మరింత రిచ్‌గా, కంటికి ఇంపుగా చూపిస్తుండటంతో ప్రేక్షకులు ఆయా కథల్లో సులభంగా లీనమైపోతున్నారు.

పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉన్న నేటి కాలంలో తెలుగు ప్రేక్షకులు మళ్లీ పల్లెటూరి మూలాలను.. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను వెండితెరపై చూసేందుకు మక్కువ చూపిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ రూపుదిద్దుకుంటున్న ఇలాంటి చిత్రాలు టాలీవుడ్ స్థాయిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మరింత పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన రూరల్ కథలు తెలుగు తెరపై సందడి చేసే అవ‌కాశం లేక‌పోలేదు.