పెద్ది రిస్క్ చేస్తే.. భారీ మార్పులేనా?
టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెవెన్యూ షేరింగ్ వివాదం మరింత ఆసక్తికర దశకు చేరుకుంటోంది.
By: M Prashanth | 14 May 2026 1:44 PM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెవెన్యూ షేరింగ్ వివాదం మరింత ఆసక్తికర దశకు చేరుకుంటోంది. ముఖ్యంగా భారీ చిత్రాల విడుదలల విషయంలో అద్దె వర్సెస్ పర్సంటేజ్ విధానం చుట్టూ జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా చుట్టూ కొత్త చర్చ మొదలైంది.
తెలంగాణలోని అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు, లీజ్ హోల్డర్లు ఇకపై రెంటల్ విధానంలో సినిమాలు ప్రదర్శించేందుకు ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే పరిస్థితి పెద్ది సినిమాకూ ఎదురైతే ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
అయితే కొందరు సినీ ఎక్స్పర్ట్స్ మాత్రం దీనిని నిర్మాతలకు ఒక అవకాశంగా కూడా చూస్తున్నారు. ఎగ్జిబిటర్లు సహకరించకపోయినా, అందుబాటులో ఉన్న స్క్రీన్లలో మాత్రమే సినిమాను విడుదల చేసి విజయాన్ని సాధిస్తే, ఇండస్ట్రీలో ఉన్న ప్రస్తుత వ్యవస్థను మార్చే పరిణామాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మొత్తం స్క్రీన్లలో ఎక్కువ వాటా మల్టీప్లెక్స్ చైన్‌లదే.
ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ వంటి సంస్థలకు తెలంగాణలో వందకు పైగా స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలో పెద్ది వంటి భారీ చిత్రాన్ని కొన్ని ఎంపిక చేసిన మల్టీప్లెక్సుల్లో మాత్రమే విడుదల చేసినా మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు కొన్ని ఎగ్జిబిటర్లు, ప్రముఖ థియేటర్ సంస్థలు పెద్ద సినిమాలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్, అల్లు సినిమాస్ వంటి సంస్థలు పెద్ద చిత్రాలకు స్క్రీన్లు కేటాయించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో అడ్డంకులు వచ్చినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం కొన్ని వందల స్క్రీన్లలో సినిమా విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. అసలు ఆసక్తికర అంశం ఏమిటంటే.. పెద్ది పరిమిత స్క్రీన్లలో విడుదలై కూడా భారీ వసూళ్లు సాధిస్తే, అది ఎగ్జిబిటర్ వ్యవస్థకు గట్టి షాక్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మిస్తున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఇదే మోడల్ ను భవిష్యత్తులో అనుసరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ, డ్రాగన్ వంటి పాన్ ఇండియా చిత్రాలు కూడా ఇదే దారిలో వెళ్లే పరిస్థితి రావొచ్చని చర్చ సాగుతోంది. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత టాలీవుడ్ నిర్మాతలు ఇతర భాషల మార్కెట్ల ద్వారా పెద్ద ఎత్తున్న ఆదాయాన్ని పొందుతున్నారు.
దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల థియేటర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి గతంతో పోలిస్తే తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో స్థానిక ఎగ్జిబిటర్లు మాత్రం పెద్ద సినిమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకే ఆ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే రెండు వర్గాలకు నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పరస్పర అంగీకారానికి వస్తారా? లేక పెద్ది లాంటి భారీ సినిమా టాలీవుడ్ విడుదల వ్యవస్థలో కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
