టాలీవుడ్‌ను ముంచెత్తుతున్న రిపీట్ కాంబినేషన్ల క్రేజ్!
ఈ రిపీట్ కాంబినేషన్ల హవా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని అంతే కలిగిస్తోంది.ఈ సేఫ్ అండ్ క్రేజీ జోన్‌లోకి టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ముందే అడుగుపెట్టారు.
By: Srikanth Kontham | 31 May 2026 8:30 AM ISTఒక సినిమా అంటే? వందల కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉంటుంది. అందుకే ప్రస్తుత తరుణంలో ప్రయోగాల కంటే పక్కా సక్సెస్ ఫార్ములా వైపే టాలీవుడ్ అగ్ర హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఒకే దర్శకుడితో ఒక స్టార్ హీరో మళ్లీ సినిమా చేయాలంటే? ఏళ్ల సమయం పట్టేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ పూర్తిగా మారింది. గతంలో భారీ హిట్స్ అందించిన దర్శకులతోనే మళ్లీ మళ్లీ చేతులు కలపడానికి స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ల హవా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ అనే నమ్మకాన్ని అంతే కలిగిస్తోంది.ఈ సేఫ్ అండ్ క్రేజీ జోన్‌లోకి టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ముందే అడుగుపెట్టారు.
`వాల్తేరు వీరయ్య` కమర్శియల్ గాసక్సెస్ అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితొ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగా 158 టైటిల్ తో సెట్స్ లో ఉందీ చిత్రం. అలాగే `వీరసింహారెడ్డి` లాంటి భారీ మాస్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ మరోసారి దర్శకుడు గోపీచంద్ మలినేని తో పని చేస్తున్నారు. మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ పై దండెత్తేందుకు సిద్దమవుతున్నారు. ఈ కాంబినేషన్ కూడా ఆన్ సెట్స్ లో ఉంది. ఇక పండగ సీజన్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో విక్టరీ వెంకటేష్- డైరెక్టర్ అనిల్ రావిపూడిల ట్రాక్ రికార్డ్ అద్భుతమైనది. వచ్చే సంక్రాంతి రేసును టార్గెట్ చేస్తూ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన విశేషం ఉంది. దాదాపు పదేళ్ల క్రితం అనీల్ తొలి చిత్రం `పటాస్` తో దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఇందులో కీలక భాగమయ్యారు. ఆ రకంగా ఈప్రాజెక్ట్ మల్టీస్టారర్ గామారింది. వినోదానికి విభిన్నమైన కమర్షియల్ హంగులు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
పాన్-ఇండియా రేంజ్‌లో వందల కోట్ల బడ్జెట్ నడుస్తున్న తరుణంలో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తన నమ్మకమైన దర్శకులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే విజువల్ వండర్‌గా నిలిచిన `కల్కి` ఘన విజయంతో ప్రభాస్-నాగ్ అశ్విన్ ల `కల్కి 2` పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
దీంతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సంచలనం `సలార్` తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి `సలార్ 2` ను పట్టాలెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాల రిస్క్‌ను తగ్గించుకోవడానికి ఈ తరహా క్రేజీ సీక్వెల్స్ - రిపీట్ కాంబినేషన్లు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ల లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎప్పుడూ స్పెషలే. `అరవింద సమేత వీర రాఘవ` తర్వాత `గాడ్ ఆఫ్ వార్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ కాంబో మళ్లీ తెరపైకి రావడం విశేషం. అలాగే `రంగస్థలం` లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
