హీరో-దర్శకుడి పారితోషికాల్ని బడ్జెట్‌లో 25 శాతానికి కుదించాలి!
టాలీవుడ్‌లో హీరోలు, దర్శకుల పారితోషికాలు సినిమా బడ్జెట్‌లో 60-75 శాతం వరకు ఉంటున్నాయనే చర్చ సాగుతోంది. అగ్ర హీరోలు రూ.70 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పైగా, స్టార్ దర్శకులు రూ.30 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. దీనివల్ల నిర్మాణ నాణ్యతపై రాజీ పడాల్సి వస్తోందని, రెమ్యునరేషన్లను బడ్జెట్‌లో 25 శాతానికి పరిమితం చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
By: Sivaji Kontham | 23 Nov 2026 8:05 AM ISTప్రపంచంలోని ఏ ఆరోగ్యకరమైన సినీ పరిశ్రమలోనైనా ఒక సినిమా మొత్తం బడ్జెట్‌లో హీరో-దర్శకుడి పారితోషికం కేవలం 20 - 25 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన 75 శాతం నిధులను తెరపై కనిపించే సినిమా నిర్మాణ విలువలు, విజువల్ క్వాలిటీ- సాంకేతిక హంగుల కోసం ఖర్చు చేస్తారు. కానీ ప్రస్తుత టాలీవుడ్‌లో ఈ వ్యాపార లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయనే ఆవేదన కనిపిస్తోంది. ఇక్కడ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఒక్క షాట్ కూడా చిత్రీకరించకముందే బడ్జెట్‌లో ఏకంగా 60 - 75 శాతం సొమ్ము హీరోలు, దర్శకులు, ప్రధాన సాంకేతిక నిపుణుల జేబుల్లోకి వెళ్లిపోతుండటం నిర్మాతలకు పెను భారంగా మారుతోందనే విశ్లేషణ సాగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో టైర్-1 స్థాయి పాన్-ఇండియా స్టార్స్ ఒక్కో సినిమాకు రూ. 70 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారు. పారితోషికంతో పాటు, సినిమా లాభాల్లో భారీ వాటాలను డిమాండ్ చేస్తున్నారు. కేవలం అగ్ర హీరోలే కాకుండా తమ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 30-40 కోట్ల షేర్ రాబట్టడానికి కూడా నానా తంటాలు పడుతున్నా కానీ.. టైర్-2 హీరోలు, సీనియర్ హీరోలు సైతం తమ రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా వీరు రూ. 25 కోట్ల నుంచి రూ. 45 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారనేది ఫిలింనగర్ గుసగుస.
స్టార్ డైరెక్టర్లు సైతం ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 30 కోట్ల నుంచి రూ. 70 కోట్లకు పైగా పారితోషికం అడుగుతుండటంతో.. ఒక సాధారణ కథను తెరకెక్కించడం కూడా నిర్మాతలకు రూ. 150 కోట్ల భారీ జూదంగా మారిపోయింది. బడ్జెట్‌లో సింహభాగం పారితోషికాలకే కరిగిపోతుండటంతో.. అసలైన కంటెంట్ .. ప్రొడక్షన్ క్వాలిటీపై రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు.. ఈ అదుపు తప్పిన పారితోషికాలను ప్రేక్షకుల నుంచి వసూలు చేయాల్సి రావడంతోనే టికెట్ ధరలు పెరిగి, జనం థియేటర్లకు రావడం మానేసారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
సినిమా అనేది 24 శాఖలు కలిసి పని చేసేది. కానీ కేవలం స్టార్ల పారితోషికాలను మోసే ప్రాపర్టీగా మారిపోయింది. ఇది ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదనే వాదనలు ఇటీవల టాలీవుడ్ సర్కిల్స్ లో మళ్లీ రైజ్ అవుతున్నాయి. బడ్జెట్‌లో 20 శాతం మాత్రమే రెమ్యునరేషన్‌కు పరిమితమై.. మిగిలిన మొత్తాన్ని తెరపై నాణ్యత కోసం వెచ్చించినప్పుడే టాలీవుడ్‌లో మళ్లీ ఆరోగ్యకరమైన సినిమా వాతావరణం నెలకొంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోలతో కాంబినేషన్లు సెట్ చేసి రిలీజ్ ముందే లాభపడే నిర్మాతల కారణంగా ఇండస్ట్రీలో ఇలాంటి అనారోగ్యకర వాతావరణం ఏర్పడిందని కూడా విశ్లేషిస్తున్నారు. బయ్యరు, ఎగ్జిబిటర్ కూడా బావున్నప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుందని కూడా అనలిస్టులు చెబుతున్నారు. అయితే హీరో, దర్శకుడి పారితోషికాలను బడ్జెట్లో 25 శాతానికి పరిమితం చేస్తామని నిర్మాత అంటే దానికి అంగీకరిస్తారా? అనేదే పెద్ద చిక్కు ప్రశ్న!
