అదుపు తప్పే ఖర్చులపై నిర్మాత నాగవంశీ ప్రాక్టికల్ విశ్లేషణ
టాలీవుడ్ లో ప్రస్తుతం బడ్జెట్ నియంత్రణ ఆన్-సెట్ ఖర్చులు నిర్మాతల సర్కిల్స్ లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
By: Sivaji Kontham | 11 Aug 2026 9:17 AM ISTటాలీవుడ్ లో ప్రస్తుతం బడ్జెట్ నియంత్రణ ఆన్-సెట్ ఖర్చులు నిర్మాతల సర్కిల్స్ లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలి కాలంలో షూటింగ్ సెట్స్‌లో ప్రొడక్షన్ ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయని ప్రముఖ నిర్మాత నాగవంశీ వంటి పలువురు మేకర్స్ సైతం బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. సెట్‌లోని సాంకేతిక నిపుణులు, నటీనటులు, సిబ్బందికి ప్రతిరోజూ అందించే విలాసవంతమైన కేటరింగ్.. అనవసరమైన లగ్జరీ క్యారవాన్లు... అలాగే సమర్థవంతమైన కాల్-షీట్ ప్లానింగ్ లేకపోవడం వంటి కారణాల వల్ల రోజువారీ మేకింగ్ బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. ఒక వైపు రెమ్యూనరేషన్లు భారీగా ఉండగా.. మరోవైపు సెట్ నిర్వహణకే రోజుకు లక్షలాది రూపాయలు దాటిపోతుండటంతో చిత్ర నిర్మాణంపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
ఈ విషయమై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ సెట్‌లో జరిగే ఖర్చుల వెనుక ఉన్న ఆసక్తికరమైన, యథార్థమైన పరిస్థితులను సరదాగా వివరిస్తూనే ఆందోళన వ్యక్తం చేశారు. ``ఇంట్లో భార్యను ఉదయాన్నే నాలుగు రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి పెట్టమంటే రెండో రోజే అది సాధ్యం కాదని చెప్తారు.. ఇంట్లో ఒకటే టిఫిన్ తినడం మనకు అలవాటే. కానీ సినిమా సెట్‌కి వస్తే మాత్రం నాలుగైదు రకాల వంటకాలతో బఫే పెట్టాల్సిందే, ఒక్క రకం పెడితే ఎవరూ ఒప్పుకోరు`` అని ఆయన అన్నారు. ఉదయం 9 గంటలకు ఫస్ట్ షాట్ తీయాలంటే సిబ్బంది, నటీనటులు ఉదయం 6 లేదా 7 గంటలకే సెట్‌కు చేరుకోవాల్సి వస్తుందని.. అంత త్వరగా ఇంట్లో తిని రావడం కుదరదు కాబట్టి ప్రొడక్షనే బ్రేక్‌ఫాస్ట్ అందించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ప్రతిరోజూ బఫే తరహాలో గ్రాండ్‌గా వంటకాలు ఏర్పాటు చేయడం వల్లే ప్రొడక్షన్ ఖర్చులు ఎందుకు తగ్గడం లేదో అర్థమవుతుందని ఆయన వివరించే ప్రయత్నం చేసారు. అయితే నిర్మాతకు ఒక్క బ్రేక్ ఫాస్ట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. కానీ అదనపు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు.
ఈ తరహా ఆన్-సెట్ ఖర్చులను సమర్థవంతంగా అదుపు చేయడానికి నిర్మాతలు ముందుగా ఆచరణాత్మక వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. సెట్స్‌లో అందించే కేటరింగ్ విధానంలో వృథాను అరికట్టడం.. కేటరింగ్ మాత్రమే కాదు వృథా లేకుండా ఒక్కో చిన్న చిన్న విషయంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఓవరాల్ బడ్జెట్‌లో 5 శాతం నుండి 10 శాతం వరకు వ్యయాన్ని తగ్గించవచ్చని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం లగ్జరీ సౌకర్యాల కంటే షూటింగ్ ఉత్పాదకతపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో మొదటి అడుగు కావాలి. అంతేకాకుండా ఆర్టిస్టుల కాల్-షీట్లను సరిగ్గా ప్లాన్ చేసి.. లొకేషన్‌లో సమయం వృథా కాకుండా చూసుకోవడం ద్వారా షూటింగ్ రోజుల సంఖ్యను తగ్గించవచ్చు. ప్రొడక్షన్ ప్లానింగ్‌లో పారదర్శకతను పెంచి.. రోజువారీ వ్యయాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆడిటింగ్ వ్యక్తులను ఏర్పాటు చేయడం వల్ల అనవసర ఖర్చులకు అడ్డుకట్ట పడుతుంది.
అలాగే ప్రీ-ప్రొడక్షన్ దశలోనే పక్కా స్క్రిప్ట్ లాకింగ్.. డిజిటల్ ప్రి-విజువలైజేషన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం అత్యంత కీలకం. ఏ సన్నివేశానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే కచ్చితమైన ప్రణాళిక వేసుకుంటే సెట్‌పై గందరగోళం తగ్గి.. అనవసర రీ-షూట్‌లు .. అదనపు డేట్ల ఖర్చు తప్పుతుంది. లొకేషన్ పర్మిషన్లు, క్రూ మేనేజ్‌మెంట్ వంటి అంశాలలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ప్రొడక్షన్ ఆలస్యాన్ని అరికట్టవచ్చు. ఇటువంటి చిన్న చిన్న ప్రణాళికలే మేకర్స్‌కు ఆర్థికంగా పెద్ద మొత్తంలో ఉపశమనాన్ని కలిగిస్తాయి.
చివరగా సినిమా నిర్మాణం ఆశించిన విధంగా సాగాలంటే నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకరికొకరు పరస్పర అవగాహనతో ముందుకు సాగాల్సి ఉంది. కేవలం పబ్లిసిటీ లేదా విజువల్ గ్రాండ్‌నెస్ కోసమే కాకుండా కంటెంట్ నాణ్యతపై ప్రధానంగా దృష్టి పెట్టినప్పుడే టాలీవుడ్‌లో ఆన్ సెట్ ఖర్చులు అదుపులోకి వస్తాయి. ప్రొడక్షన్ మేకింగ్‌లో బాధ్యతాయుతమైన మార్పులు తెచ్చినప్పుడే సినిమా బడ్జెట్లు అదుపులో ఉండి.. పరిశ్రమ మరింత ఆరోగ్యకరమైన.. లాభదాయకమైన బాటలో పయనిస్తుంది.
