సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిసిన నిర్మాతలు.. దిల్ రాజు కనపడలేదే!
సినిమా ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలు అందరూ కలిసి నేడు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు.
By: Madhu Reddy | 11 Aug 2025 4:55 PM ISTసినిమా ఇండస్ట్రీలో సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలు అందరూ కలిసి నేడు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలో చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో నిర్మాతలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వెల్లడించినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యంగా ఈ భేటీలో.. నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, డీవీవీ దానయ్య, కేఎల్ నారాయణ, ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్, నాగవంశీ, ఎర్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రి మూవీస్ చెర్రీ, వివేక్ కూచిభోట్ల సాహు గారపాటి ఈ సమావేశంలో భేటీ అయ్యారు. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేస్తూ భేటీలో జరిగిన విషయాన్ని పంచుకున్నారు.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ట్విట్టర్ ఖాతా ద్వారా.." రాష్ట్ర సచివాలయంలో సినీ నిర్మాతలతో సమావేశం జరిగింది. సినీరంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాతల నుండి వినతి పత్రం స్వీకరించాను. ఇరుపక్షాల అభిప్రాయాలను శ్రద్ధగా విని, ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి నివేదించి చర్చిస్తాను. అలాగే ప్రభుత్వం జోక్యం అవసరమైతే రాష్ట్రస్థాయిలో తగిన నిర్ణయం కూడా తీసుకుంటాము అని నిర్మాతలతో తెలిపాము. ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి కూడా ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అంటూ కందుల దుర్గేష్ నిర్మాతలతో తెలిపినట్టు ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాతలు అందరూ కూడా ఈ భేటీలో కనిపించారు. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ఎస్సీ క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ భేటీకి హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఆయనతోపాటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత సురేష్ బాబు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. మరి ఈ నిర్మాతలు ఈ భేటీకి హాజరు కాకపోవడానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో సినీ కార్మికులకు, సినీ నిర్మాతలకు మధ్య వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ కార్మికులు 30% వేతనం పెంచాలి అని డిమాండ్ చేస్తుండగా.. అటు నిర్మాతలు సినీ పరిశ్రమ ప్రస్తుతమున్న పరిస్థితిల్లో వేతనాలు పెంచడం కుదరదు అని స్పష్టం చేశారు. దీంతో సినీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
