Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. మ‌న నిర్మాత‌లు మారారండోయ్!

అవును.. మ‌న నిర్మాత‌లు మారారండోయ్.. వీలున్న‌ప్పుడ‌ల్లా ఇక‌పై రాజ‌కీయ నాయ‌కుల్ని క‌లిసేందుకు భేష‌జానికి పోవ‌డం లేదు!

By:  Sivaji Kontham   |   26 Aug 2025 12:59 PM IST
#గుస‌గుస‌.. మ‌న నిర్మాత‌లు మారారండోయ్!
X

అవును.. మ‌న నిర్మాత‌లు మారారండోయ్.. వీలున్న‌ప్పుడ‌ల్లా ఇక‌పై రాజ‌కీయ నాయ‌కుల్ని క‌లిసేందుకు భేష‌జానికి పోవ‌డం లేదు! ముఖ్యంగా ముఖ్య‌మంత్రుల‌ను మ‌ర్చిపోకుండా క‌ల‌వ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. అపుడెపుడో చంద్ర‌బాబు జ‌మానాలోనో, నంద‌మూరి తార‌క రామారావు జ‌మానాలోనో సీఎంల‌ను క‌లిసే అల‌వాటు ఉండేది! అన‌కుండా, ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సీఎం ఎవ‌రు వ‌చ్చినా వెళ్లి క‌ల‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇంత‌కుముందు తాడేప‌ల్లి గూడెంలో సీఎం చంద్ర‌బాబు నాయుడును మ‌న అగ్ర నిర్మాత‌లు, కొంద‌రు ద‌ర్శ‌కులు, హీరోలు వెళ్లి క‌లిసొచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎంతో చాలా సేపు మంత‌నాలు సాగించారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా వెళ్లి క‌లిసొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డిసి అధ్య‌క్షుడు దిల్ రాజు సార‌థ్యంలో నిర్మాత‌లంతా ముఖ్య‌మంత్రి రేవంత్ ని క‌ల‌వడం హుందాత‌నాన్ని పెంచింద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో సీఎం నివాసంలోనే ఈ భేటీ జ‌రిగింది.

ఈసారి భేటీలో దిల్ రాజుతో పాటు అగ్ర‌నిర్మాత‌లు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని,వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, దామోదర ప్ర‌సాద్, ఎన్వీ ప్రసాద్, రాధామోహన్ లాంటి టాప్ ప్రొడ్యూస‌ర్స్ ఉన్నారు. త్రివిక్ర‌మ్, బోయ‌పాటి, కొర‌టాల‌, సందీప్ వంగా, వంశీ పైడిప‌ల్లి, వెంకీ కుడుముల‌, అనీల్ రావిపూడి లాంటి పాపుల‌ర్ డైరెక్ట‌ర్లు కూడా ఈ భేటీలో సీఎంతో ముచ్చ‌టించారు. ఇంత‌మంది దిగ్గ‌జ సినీప్ర‌ముఖులు త‌న‌ను క‌ల‌వ‌గానే సీఎం రేవంత్ లోను కొత్త ఉత్సాహం క‌నిపించింద‌ని స్పాట్ బోయ్ ఒక‌రు వెల్ల‌డించారు.

అంతేకాదు.. రేవంత్ తెలుగు సినీప‌రిశ్ర‌మ అంత‌ర్జాతీయ స్థాయికి ఎద‌గాల‌నే త‌న ఆకాంక్ష‌ను నిర్మాత‌ల ముందు వెలిబుచ్చారు. ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌ని, తాను న్యూట్ర‌ల్ గా ఉంటాన‌ని, అన్ని వ‌ర్గాల‌కు స‌మ‌న్యాయం చేస్తాన‌ని మాటిచ్చారు. కార్మికుల‌తో మ‌రోమారు మాట్లాడ‌తాన‌ని రేవంత్ అన్నారు. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అంతేకాదు.. నైపుణ్య వృద్ధి కోసం ప్ర‌భుత్వ‌మే ఒక కార్ప‌స్ ఫండ్ ఏర్పాటు చేస్తుంద‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింది. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తామ‌ని, సినీప‌రిశ్ర‌మ‌లో కొంద‌రి నియంత్ర‌ణ లేకుండా మానిట‌రింగ్ అవ‌స‌ర‌మ‌ని రేవంత్ పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇక‌పై కార్మిక స‌మ‌స్య రాకుండా, నిర్మాత‌లు-కార్మికులు- ప్ర‌భుత్వం క‌లిసి సంయుక్తంగా ఒక పాల‌సీని తీసుకురావాల‌ని కూడా రేవంత్ సూచించిన‌ట్టు తెలుస్తోంది.