బాలీవుడ్‌లో తెలుగు నిర్మాతల తెలివైన అడుగులు
ఇటీవలి కాలంలో టాలీవుడ్ దర్శకుల గురించే కాదు.. టాలీవుడ్ నిర్మాతల గురించి జాతీయ మీడియాలో ఎక్కువ చర్చలు వేడెక్కిస్తున్నాయి.
By: Sivaji Kontham | 8 Aug 2026 10:45 AM ISTఇటీవలి కాలంలో టాలీవుడ్ దర్శకుల గురించే కాదు.. టాలీవుడ్ నిర్మాతల గురించి జాతీయ మీడియాలో ఎక్కువ చర్చలు వేడెక్కిస్తున్నాయి. పరిశ్రమ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారితో పాటు ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు, సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత పేరు కూడా ప్రముఖంగా హిందీ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం వీరంతా బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తూ తమ ప్రొడక్షన్ పరిధిని విస్తరిస్తుండటమే.
తాము పాన్ ఇండియన్ సినిమాలను నిర్మించడంలో ముంబై బడా నిర్మాతలతో పోటీపడగలమని నిరూపించడమే ధ్యేయంగా వీరంతా పావులు కదుపుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం అగ్ర నిర్మాత దిల్ రాజు నేరుగా సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకుడితో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తూ హిందీ పరిశ్రమలోకి దూసుకెళుతున్నారు. ఇలాంటి సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా ఇప్పుడు అదే హీరోతో మరో భారీ ప్రాజెక్ట్ ను ఖాయం చేసుకోవడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.
తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ వ్యాపార పరిధిని ఇతర భాషలకు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తమిళం, మలయాళ చిత్ర రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ...పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో `జాట్` చిత్రాన్ని నిర్మించి హిందీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒక అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రీ సంస్థ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రాజ్ అండ్ డికె తో డీల్ కుదుర్చుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇటీవలే రాజ్ అండ్ డికె సల్మాన్ ఖాన్‌కు వినిపించిన కథా కథనాలు ఎంతో ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కి సల్మాన్ నుండి అత్యంత సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆసక్తికరంగా మైత్రి మూవీ మేకర్స్ తరహాలోనే టాలీవుడ్ నుంచి పలు ప్రతిష్ఠాత్మక బ్యానర్లు హిందీ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాయని కథనాలొస్తున్నాయి. మునుముందు వాటికి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
బాలీవుడ్ లో తెలుగు నిర్మాతల ఘనచరిత్ర:
అయితే బాలీవుడ్ తో అనుబంధం కొనసాగించడం ఈనాటిది కాదు. అది దశాబ్ధాలుగా కొనసాగుతున్న ప్రక్రియ. అయితే నేటితరం జెన్ జి నిర్మాతలు దీనిని కొనసాగిస్తూ రేసులో ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరిత్ర పూర్వాపరాలను పరిశీలిస్తే.. దశాబ్దాల క్రితమే ఎల్.వి. ప్రసాద్, నాగిరెడ్డి-చక్రపాణి వంటి దిగ్గజాలు బాలీవుడ్‌లో అడుగుపెట్టి సంచలన విజయాలు సాధించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్.వి. ప్రసాద్ `మిలన్` (1967), `ఖిలోనా` (1970), `ఏక్ దూజే కేలియే` (1981) వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి హిందీ ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో విజయ వాహిని పిక్చర్స్ ద్వారా నాగిరెడ్డి-చక్రపాణి `రామ్ ఔర్ శ్యామ్` (1967), `జుగ్ను`, `స్వయంవర్` వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. వారి బాటలోనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. రామానాయుడు ప్రేమ్‌నగర్ (1974), తోఫా (1984), అనాథి (1993), `దిల్‌వాలే` వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందారు.
ఇక ఆధునిక కాలంలోనూ మన టాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ అమితాబ్ బచ్చన్‌తో `ఆఖ్రీ రాస్తా` (1986), శ్రీదేవితో `ఖుదా గవా` (1992) వంటి భారీ చిత్రాలను నిర్మించగా.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్‌తో తీసిన `గజినీ` (2008) బాలీవుడ్ చరిత్రలోనే మొదటి 100 కోట్ల గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఇటీవలి కాలంలో దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా `జెర్సీ` (2022), `హిట్: ది ఫస్ట్ కేస్` రీమేక్‌లను అందించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సన్నీ డియోల్‌తో `జాట్` చిత్రాన్ని తెరకెక్కించింది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ కూడా హిందీలో నేరుగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ బాలీవుడ్ వ్యాపారంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు.
