Begin typing your search above and press return to search.

నిర్మాత‌- హీరో మ‌ధ్య ర్యాపో అలా కూడా కోల్పోతున్నారా?

సినిమా నిర్మాణంలో నిర్మాత కేవలం పెట్టుబడిదారుడు మాత్రమే కాదు. ఆ ప్రాజెక్టుకు వెన్నెముక వంటివాడు.

By:  Srikanth Kontham   |   23 March 2026 3:00 PM IST
నిర్మాత‌- హీరో మ‌ధ్య ర్యాపో అలా కూడా కోల్పోతున్నారా?
X

సినిమా నిర్మాణంలో నిర్మాత కేవలం పెట్టుబడిదారుడు మాత్రమే కాదు. ఆ ప్రాజెక్టుకు వెన్నెముక వంటివాడు. అయితే టాలీవుడ్‌లో నిర్మాతలకు - హీరోలకు మధ్య ఉండాల్సిన సమన్వయం లేద‌నే ఆరోప‌ణ చాలా కాలంగా ఉంది. ఇలా అంద‌రి విష‌యంలో కాదు. కొంత మంది హీరో-నిర్మాత‌ల మ‌ధ్య మాత్ర‌మే. దీనికి ప్రధాన కారణం కొంతమంది నిర్మాతలు సినిమా సెట్స్‌కు రాకపోవడమే అంటున్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత స్వయంగా అక్కడ ఉండకపోవడం వల్ల హీరోలతో నేరుగా మాట్లాడే అవకాశం త‌గ్గుతుంది. ఓ ర‌కంగా ఇది వారి మధ్య దూరాన్ని పెంచుతుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

చాలా మంది నిర్మాతలు తమ ప్రతినిధులను లేదా మేనేజర్లను సెట్స్‌కు పంపి, తాము మాత్రం ఆఫీసులకే పరిమితమవుతున్నారు. దీనివల్ల షూటింగ్ సమయంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారుతున్నాయి. హీరోలకు , నిర్మాతలకు మధ్య విభేదాలకు దారితీస్తున్నాయి. నిర్మాత నేరుగా సెట్స్‌లో ఉంటే, హీరోలకు ఏదైనా అవసరమైనా లేదా సినిమాలో ఏదైనా మార్పులు చేయాలన్నా వెంటనే చర్చించుకునే వీలుంటుంది. కానీ మధ్యలో వ్యక్తులు ఉండటం వల్ల సమాచారం సరిగ్గా చేరక అపార్థాలు చోటు చేసుకుం టున్నాయి.

నిర్మాత సెట్స్‌లో ఉండటం వల్ల ఆర్థికపరమైన లాభాలతో పాటు క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. ఖర్చు ఎక్కడ ఎక్కువ అవుతోంది? షూటింగ్ అనుకున్న సమయానికి జరుగుతుందా? లేదా? వంటి విషయాలపై నిర్మాతకు పట్టు ఉంటుంది. కానీ కొంతమంది నిర్మాతలు మొత్తం భారాన్ని హీరో పైనో లేదా దర్శకుడి పైనో వేసి వారినే న‌మ్ముతున్నారు. దీనివల్ల హీరోలు లేదా ద‌ర్శ‌కులు తమ నటనపై దృష్టి పెట్టడమే కాకుండా? ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా పర్యవేక్షించాల్సి రావడం వారికీ ఇబ్బందిగా మారుతోంది.

చాలా మంది స్టార్ హీరోలు తమ నిర్మాత సెట్స్‌లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. `మీరు ఇక్కడే ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. ఏ నిర్ణయమైనా వెంటనే తీసుకోవచ్చు` అని హీరోలు మొత్తుకుంటున్నా? కొందరు నిర్మాతలు మాత్రం దాన్ని అర్థం చేసుకోవడం లేదు. నిర్మాత దగ్గరుంటే షూటింగ్ వాతావరణం సందడిగా ఉంటుందని యూనిట్ సభ్యులందరిలోనూ ఒక రకమైన బాధ్యత పెరుగుతుందని హీరోల అభిప్రాయం. కానీ ఆఫీస్ పనుల సాకుతో నిర్మాతలు దూరంగా ఉండటం వల్ల ఆ పర్సనల్ టచ్ మిస్ అవుతోంది.

ఈ గ్యాప్ వల్ల కొన్నిసార్లు సినిమా బడ్జెట్ అదుపు తప్పుతోంది. నిర్మాత లేని సమయంలో దర్శకుడు లేదా ఇతర విభాగాల వారు అనవసరమైన ఖర్చులు పెంచే అవకాశం ఉంటుంది. అదే సమయంలో హీరోలకు ఏదైనా అసౌకర్యం కలిగినా? అది నిర్మాత దృష్టికి వెళ్లేసరికి చాలా సమయం పడుతుంది. ఈ జాప్యం వల్ల హీరోలలో అసహనం పెరిగి, అది చివరకు సినిమా అవుట్‌పుట్‌పై ప్రభావం చూపుతోంది. అందుకే నిర్మాత కేవలం చెక్కులు ఇచ్చే వ్యక్తిగా కాకుండా సెట్స్‌లో ఉండి సినిమాను నడిపించే నాయకుడిగా ఉండాలని పరిశ్రమ కోరుకుంటోంది.

మొత్తానికి నిర్మాత-హీరో మధ్య ర్యాపో అనేది కేవలం సినిమా విజయానికే కాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణానికి కూడా ఎంతో అవసరం. నిర్మాతలు సెట్స్‌కు క్రమం తప్పకుండా వెళ్లడం వల్ల విభేదాలు తగ్గి, ప్రాజెక్ట్ వేగంగా , నాణ్యంగా పూర్తవుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి, నిర్మాతలు తమ పంథా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే హీరోలకు - నిర్మాతలకు మధ్య పెరుగుతున్న గ్యాప్ ని పూడ్చడం కష్టతరంగా మారుతుంది.