వేల కోట్ల నష్టం చేసిన పైరసీ గ్యాంగ్ అరెస్ట్..!
పైరసీ గురించి ఎప్పుడూ ఉండేదే అనుకుంటూ అంతా ఉన్న సమయంలో తెలంగాణలో అతి పెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు అయింది.
By: Ramesh Palla | 29 Sept 2025 1:17 PM ISTసినిమా ఇండస్ట్రీని పైరసీ పట్టి పీడిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ నష్టపోయిన మొత్తం లెక్కలు తీస్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడి పోతారు. ఆ స్థాయిలో సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతున్నప్పటికీ ఎవరూ ఏమీ చేయలేక పోతున్నారు. ఒక భాషలో కాకుంటే మరో భాషలో, ఒక దేశంలో కాకుంటే మరో దేశంలో అన్నట్లుగా పైరసీ జరుగుతోంది. పైరసీ పై పోరాడటమే మానేసిన ఇండస్ట్రీ, నష్టాన్ని తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. సినిమాలు పైరసీ కాకుండా చూడటం ఎవరి తరం కావడం లేదు, కానీ పైరసీ అయినా నష్టం లేకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఇండస్ట్రీ అన్వేషిస్తుంది అనేది చాలా మంది కామెంట్. పైరసీ గురించి ఎప్పుడూ ఉండేదే అనుకుంటూ అంతా ఉన్న సమయంలో తెలంగాణలో అతి పెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు అయింది.
టాలీవుడ్ సినిమాల పైరసీ
తెలుగుతో పాటు అన్ని ఇండియన్ భాషల, హాలీవుడ్ సినిమాలను పైరసీ చేస్తున్న ముఠాను సైబర్ పోలీసులు పట్టుకున్నారు. గత 18 నెలల్లో దాదాపు 50 సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లుగా గుర్తించారు. సినిమా విడుదల అయిన రోజే పైరసీ చేయడం ద్వారా ఈ ముఠా భారీ ఎత్తున సంపాదిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరు క్రిప్టో పేమెంట్ల ద్వారా వ్యాపారం సాగించడం ద్వారా ఇన్నాళ్లు బయటకు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సమయంలో కూడా వీరు చేస్తున్న పైరసీ ఇండస్ట్రీని మరింతగా ఇబ్బందికి గురి చేస్తుందని సినీ ప్రేమికులు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పైరసీ ముఠా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
పైరసీ ముఠా అరెస్ట్
ఈ ముఠా చేసిన పైరసీ కారణంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వేలల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకే దాదాపుగా రూ.3500 కోట్లు నష్టం చేకూరిందని అంటున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు నిర్మాతలను భయపెడుతూ ఉంటే, పైరసీ మొత్తం నిర్మాతలు ఇండస్ట్రీ వదిలి పారిపోయే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. కేవలం థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్‌ను సైతం వీరు పైరసీ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటల్లోనే వీరు ఆయా కంటెంట్‌ను పైరసీ చేసి క్రిప్టో పేమెంట్లకు అమ్మేస్తున్నారు. వీరు అంందుకు గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కరోనా తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి
సినిమా ఇండస్ట్రీ కరోనా తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ప్రేక్షకులు థియేటర్‌కి రావడం చాలా వరకు తగ్గింది. అంతే కాకుండా నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కారణంగా థియేటర్ పట్ల ఆసక్తి చూపడం లేదు, ఇలాంటి సమయంలో మంచి క్వాలిటీతో పైరసీ అందుబాటులోకి వస్తే వెంటనే చూస్తున్నారు. దాంతో థియేటర్ ఆధాయంలో గండి పడుతుంది, అదే సమయంలో ఓటీటీకి కూడా ప్రేక్షకులు దూరం అవుతున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీ అన్ని విధాలుగా నష్టాలను చవిచూస్తోంది. అందుకే పైరసీ పై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎన్నో ముఠాలు పైరసీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని సగటు సినీ ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు.
