సెట్స్‌పై ఉన్న భారీ పీరియాడిక్ సినిమాలు: సిసలైన కాసులు కురిపించే ఫార్ములా!
1945 కాలం నాటి స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని.. ఇందులో ప్రభాస్ ఒక బ్రిటీష్ సైనికుడిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
By: Sivaji Kontham | 21 July 2026 10:33 PM ISTప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పీరియాడిక్ .. చారిత్రక కథాంశాల జోరు విపరీతంగా కొనసాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్, 'శ్యామ్ సింగరాయ్', 'సీతారామం', 'సలార్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి.. గతకాలపు కథలకు ఉన్న ఆదరణను చాటిచెప్పాయి. వీటి విజయాల స్పూర్తితో నేటి తరం యువ దర్శకులు కూడా చరిత్ర, విభిన్న కాలమానాల కలబోతతో కొత్త తరహా కథలను తెరకెక్కించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. విజువల్స్, మేకింగ్ పరంగా సరికొత్త అనుభూతిని అందించడంతో పాటు...ఆయా చిత్రాల ప్రత్యేకమైన బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుండటంతో ఈ జానర్ సినిమాలకు థియేటర్లలో విశేష ఆదరణ లభిస్తోంది. సమకాలీన కథల కంటే కూడా గతాన్ని పునర్నిర్మించి, విజువల్ వండర్స్‌గా తెరకెక్కించేందుకే అగ్ర దర్శకులు, కథానాయకులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ముఖ్యమైన ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తే.. 18వ శతాబ్దం నాటి కథల నుంచి 1970ల నాటి నేపథ్యం వరకు భిన్నమైన కాలమానాల్లో నడిచే పీరియాడిక్ కథలు రూపుదిద్దుకుంటుండటం విశేషం.
ఈ జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది జానపద-చారిత్రక అంశాలతో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ 'వారణాసి'. దాదాపు 18వ శతాబ్దానికి చెందిన కాలమానంతో పాటు పలు యుగాలలో నడిచే అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రధాన శకాల పరిధి చూస్తే.. క్రీ.పూ. 7,200 (7200 బిసిఇ) నుండి క్రీ.శ. 2027 (2027 CE) వరకు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి - మహేష్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మరోవైపు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఏకకాలంలో పలు సినిమాలు చేస్తూనే.. హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజి` అనే భారీ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. 1945 కాలం నాటి స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని.. ఇందులో ప్రభాస్ ఒక బ్రిటీష్ సైనికుడిగా సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా ఒక ఆసక్తికరమైన పీరియాడిక్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథాంశం 1854 - 1978 మధ్య సాగుతుంది. ఇది కొన్ని యథార్థ చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. విభిన్న కాలాలు.. ఘట్టాలతో సినిమా ఆద్యంతం రక్తి కట్టించనుందని సమాచారం. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే విలక్షణమైనదిగా నిలవనుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
యువ కథానాయకులు కూడా పీరియాడిక్ ఫార్ములాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువ హీరో నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ' సినిమా చారిత్రక- దైవిక అంశాల కలబోతగా ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ కథగా తెరకెక్కుతోంది. కథాంశం ప్రధానంగా క్రీ.శ. 985 (985 ఏడి) కాలంలో సాగుతుంది. చోళ రాజులు ..ఇతర సామ్రాజ్యాల విస్తరణ, భారతీయ నౌకాదళం మలుపులు తిరిగిన కాలానికి ముందు చోటుచేసుకున్న చారిత్రక సంఘటనలు, 'సెంగోల్' (పవిత్ర రాజదండం) చుట్టూ తిరిగే కథాంశంతో దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా.. కిరణ్ అబ్బవరం నటించిన 'క' చిత్రం 1970ల నాటి గ్రామీణ వాతావరణంలో సాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటోంది.
ఇక నేచురల్ స్టార్ నాని..'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం కూడా గత కాలం నాటి కథతోనే రూపొందుతోందని టాక్ ఉంది. సికింద్రాబాద్‌లోని ఒక పాత బస్తీ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బలమైన భావోద్వేగాలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి.. పాతకాలపు వాతావరణాన్ని.. నాటి సంస్కృతిని తెరపై పునఃసృష్టించి ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడానికి టాలీవుడ్ సిద్ధమవుతోంది. గత కాలం లేదా పాత కాలం కాసులు కురిపించే అద్భుతమైన ఫార్ములాగా రూపాంతరం చెందుతుందా లేదా? అనేది ఈ సినిమాలు విడుదలయ్యాక మరింత క్లారిటీ వస్తుంది.
