కార్మికులు (X) నిర్మాతలు: 15 శాతానికి ఒప్పుకోని ఫెడరేషన్?
ప్రస్తుతం ఫెడరేషన్ తో నిర్మాతల మీటింగ్స్ జరుగుతున్నాయని సోషల్ మీడియాల్లో ప్రచారం వేడెక్కిస్తోంది.
By: Sivaji Kontham | 8 Aug 2025 2:01 AM ISTఫెడరేషన్ వర్సెస్ నిర్మాతల వార్ కొనసాగుతోంది. 30శాతం వేతన పెంపునకు నిర్మాతల అంగీకరించడం లేదు. 15 శాతం పెంపును అంగీకరించినా ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదు. మొత్తానికి చర్చలు సమావేశాల్లో అంతిమ ఫలితం ఇంకా తేలలేదని టాక్ వినిపిస్తోంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా గుసగుస వినిపిస్తోంది. అంతవరకూ షూటింగులు అయోమయంలోనే...!
9-9 పని గంటల నియమం:
ప్రస్తుతం ఫెడరేషన్ తో నిర్మాతల మీటింగ్స్ జరుగుతున్నాయని సోషల్ మీడియాల్లో ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో 15 శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఒప్పుకున్నా, 9గం.ల నుంచి 9గంటల వరకూ పని చేయాలనే (ఒక కాల్షీట్) నియమాన్ని తెరపైకి తెచ్చారని తెలిసింది. అయితే దీనికి ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదని సమాచారం. నిర్మాతలు చెప్పే వేతనానికి ఫెడరేషన్ రాజీకి రావడం లేదు.
చిన్న నిర్మాతలు బెంబేలు:
అయితే అగ్ర నిర్మాతల వ్యవహారం ఎలా ఉన్నా వేతనంలో పెంపును అంగీకరించలేమని చిన్న నిర్మాతలు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది. 15శాతాన్ని మించి వేతనం పెంచితే తమకు ఆర్థికంగా భారం మరింత పెరుగుతుందని చిన్న నిర్మాతలు బెంబేలెత్తుతున్నారట. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏదీ తేలలేదు. మరో రెండ్రోజుల్లో సమస్యకు పరిష్కారం లభించవచ్చని అంటున్నారు. సోమవారం నుంచి షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
చిరు జోక్యంతోనే పరిష్కారం:
గడిచిన నాలుగు రోజులుగా కార్మికుల సమ్మె కారణంగా సెట్స్ పై షూటింగులు అన్నీ బంద్ అయ్యాయి. కొందరు అగ్ర నిర్మాతలు మేనేజ్ చేస్తున్నా మెజారిటీ షూటింగులు నిలిచిపోయాయి. ఫెడరేషన్ ఈసారి తగ్గేదేలే! అంటూ భీష్మించుకుని కూచుకుంది. ఈ వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జోక్యం చేసుకుని చర్చలకు సానుకూల పరిస్థితిని తెస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో పరిష్కరించేలా వ్యవహారాన్ని ముందుకు నడిపిస్తున్నట్టు సమాచారం.
