Begin typing your search above and press return to search.

ఐదు భారీ అస్త్రాలు.. 2027 బాక్సాఫీస్ దిమ్మతిరగాల్సిందే!

ఒక్కో సినిమాకు మధ్య మంచి స్పేస్ దొరకడంతో, రికార్డుల ఊచకోత నాన్ స్టాప్ గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

By:  M Prashanth   |   18 Oct 2026 5:00 PM IST
ఐదు భారీ అస్త్రాలు.. 2027 బాక్సాఫీస్ దిమ్మతిరగాల్సిందే!
X

బాక్సాఫీస్ క్యాలెండర్ లో ఎప్పుడూ లేనంత క్రేజీ లైనప్ సిద్ధమవుతోంది. 2027లో టాలీవుడ్ నుంచి రాబోయే ఐదు భారీ పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లను ఒక రేంజ్ లో షేక్ చేయబోతున్నాయి. ప్రభాస్ 'ఫౌజీ', మహేష్ బాబు 'వారణాసి', ఎన్టీఆర్ 'డ్రాగన్', మళ్లీ ప్రభాస్ 'స్పిరిట్', చివరగా అల్లు అర్జున్ 'రాకా'.. ఇలా టాప్ స్టార్లు వరుసపెట్టి తమ బాక్సాఫీస్ వేటను మొదలుపెట్టబోతున్నారు. ఒక్కో సినిమాకు మధ్య మంచి స్పేస్ దొరకడంతో, రికార్డుల ఊచకోత నాన్ స్టాప్ గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

మొదటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది డిసెంబర్ లో రావాల్సిన ఈ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో సమ్మర్ స్టార్టింగ్ లోకి షిఫ్ట్ అయ్యింది. ఇక ఆ తరువాత సందడి ఏప్రిల్ 7 నాటికి పీక్స్ కు చేరుతుంది. ఆ రోజున ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న విజువల్ వండర్ 'వారణాసి' బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. జక్కన్న మార్క్ గ్రాండియర్ తో మహేష్ గ్లోబల్ లెవెల్ లో చేయబోయే హంగామా బాక్సాఫీస్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.

ఆ తర్వాత జూన్ 11న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ 'డ్రాగన్' బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనుంది. రాజమౌళి సినిమా తర్వాత దొరికిన రెండు నెలల గ్యాప్ ఈ మాస్ ఎపిక్ కు పర్ఫెక్ట్ గా కుదిరింది. నీల్ మార్క్ ఎలివేషన్స్ కు తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన సాలిడ్ ట్రీట్ ను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ సరైన టైమ్ లోనే దిగుతోంది.

ఇక పండగ సీజన్ రాగానే అక్టోబర్ 29న సందీప్ రెడ్డి వంగా తన పవర్ ఫుల్ కాప్ డ్రామా 'స్పిరిట్'తో బాక్సాఫీస్ ను ఊపేయబోతున్నారు. రఫ్ పోలీస్ గా ప్రభాస్ స్వాగ్ దీపావళి బాక్సాఫీస్ కు అసలైన కిక్ ఇవ్వనుంది. ఇదే సమయంలో ప్రచారంలో ఉన్న 'రామాయణ' రెండో భాగం కూడా కాస్త వెనక్కి జరిగి మంచి డేట్ చూసుకుంటే ఇంకా బెటర్. అప్పుడు స్పిరిట్ సోలోగా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి మరింత క్లియర్ వే దొరుకుతుంది.

సంవత్సరం చివర్లో డిసెంబర్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రాకా' థియేటర్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పుష్ప క్రేజ్ తర్వాత బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, దానికి అట్లీ మార్క్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ జత కావడంతో ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇయర్ ఎండ్ సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకుంటూ ఆ ఏడాదికి ఒక అదిరిపోయే ముగింపు ఇవ్వడానికి రాకా రెడీ అవుతోంది.

ఈ ఐదు చిత్రాల రిలీజ్ ప్లానింగ్ చాలా క్లియర్ గా, హెల్తీ గ్యాప్ తో కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ లెక్కలను తిరగరాయడం ఖాయం. దాదాపు అన్ని సినిమాలకు 1000 కోట్లు కొట్టే స్టామినా ఉంది. సరైన ప్లానింగ్ తో ఒక్కొక్కరు థియేటర్లలోకి దిగితే, వచ్చే ఏడాది భారతీయ సినీ చరిత్రలోనే టాలీవుడ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం పక్కా.