Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ మార్కెట్‌లో చల్లబడ్డ టాలీవుడ్ హవా!

మార్కెట్ చల్లబడటానికి కేవలం సినిమా ఫలితాలు మాత్రమే కార‌ణం కాదు. అక్కడ మారుతోన్న రాజకీయ , ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

By:  Srikanth Kontham   |   7 Aug 2026 11:42 AM IST
ఓవర్సీస్ మార్కెట్‌లో చల్లబడ్డ టాలీవుడ్ హవా!
X

టాలీవుడ్‌ పరిశ్రమకు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టిన ఓవర్సీస్ మార్కెట్ ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద గణనీయమైన మందగమనం కనిపిస్తోంది. తెలుగు చిత్రాలకు విదేశాల్లో ఉన్న భారీ క్రేజ్, రికార్డు స్థాయి ప్రీ-సేల్స్, మిలియన్ డాలర్ల ప్రీమియర్ కలెక్షన్ల జోరు గతంతో పోలిస్తే చాలా వరకు త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ప‌రిస్థితులు ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మార్కెట్ చల్లబడటానికి కేవలం సినిమా ఫలితాలు మాత్రమే కార‌ణం కాదు. అక్కడ మారుతోన్న రాజకీయ , ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

అమెరికాలో ఏర్పడిన రాజకీయ అస్థిరత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు, వీసా నిబంధనలు , ద్రవ్యోల్బణ ప్రభావం అక్కడి తెలుగు ప్రేక్షకుల జీవనశైలిపై పడుతున్నాయి. ఫలితంగా, వినోదం కోసం ఖర్చు చేసే బడ్జెట్‌ను ప్రజలు తగ్గించుకుంటున్నారు. ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ..బయర్లు సినిమాలను కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. గతంలో భారీ రేట్లకు రైట్స్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఇప్పుడు భారీ నష్టాలను చవిచూడటంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కంటెంట్‌పై పూర్తి నమ్మకం ఉంటే తప్ప భారీ మొత్తాలు వెచ్చించడానికి వెనుకడుగు వేస్తున్నారు. దీనికి తోడు సరైన కంటెంట్ ఉన్న బ్లాక్‌బస్టర్ హిట్లు సరిగ్గా పడకపోవడం కూడా మార్కెట్‌ను దెబ్బతీసింది. ఎప్పుడో ఒకసారి వచ్చే భారీ చిత్రాలు మినహా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఓవర్సీస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. సినిమాలు విడుదలైన తక్కువ కాలంలోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం కూడా థియేటర్‌లో చూడాలి అనే ఆసక్తిని తగ్గించ‌డంలో పెద్ద పాత్ర పోషిస్తోంది.

అయితే ఈ నిరాశాజనక వాతావరణం శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్ట్‌లపై టాలీవుడ్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. త్వరలో విడుదల కానున్న రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవిల `రామాయణం`, యశ్ నటించిన `టాక్సిక్`, అలాగే మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `వారణాసి` వంటి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లు ఓవర్సీస్ మార్కెట్‌కు పూర్వవైభవాన్ని తెస్తాయని చాలా న‌మ్మ‌కం క‌నిపిస్తోంది.

చివ‌రిగా ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ క్లిష్టమైన దశను ఎదుర్కోంటున్నా? ప్రేక్షకులను మెప్పించే అసాధారణ కంటెంట్ .. విజువల్ వండర్స్ వస్తే మాత్రం సరికొత్త స‌రికొత్త సృష్టించడం ఖాయం. నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటే విదేశీ గడ్డపై తెలుగు సినిమా సత్తాను మళ్లీ పూర్తిగా చాటుకోవడానికి అవకాశం ఉంద‌న్న‌ది అంతూ నిజం.