ఓటీటీ డీల్స్ వెనుక అసలు కథ.. లోకల్ మేనేజ్‌మెంట్‌తో నిర్మాత బ్లాక్ దందా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కంటే ఓటీటీ డీల్స్ మీదే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు.
By: M Prashanth | 26 March 2026 11:00 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కంటే ఓటీటీ డీల్స్ మీదే నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం ప్రాజెక్టును సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్తోంది. జనాలు కూడా థియేటర్ల కంటే ఓటీటీలకే ఎక్కువగా అలవాటు పడటంతో స్ట్రీమింగ్ సంస్థలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి. అయితే ఈ భారీ డీల్స్ వెనుక ఇప్పుడు ఒక సరికొత్త నెట్వర్క్ నడుస్తోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఈ బ్యాక్ డోర్ వ్యవహారాలు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా ఓటీటీ దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలు విదేశాల్లో ఉంటాయి. కానీ భారత్ వంటి దేశాల్లో ఏ సినిమాలు కొనాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి అనే విషయాలను ఇక్కడి లోకల్ మేనేజ్‌మెంట్ టీమ్స్ చూసుకుంటాయి. సినిమాల క్వాలిటీని బట్టి డీల్స్ ఖరారు చేయాల్సిన ఈ టీమ్స్, ఇప్పుడు కొందరు బడా నిర్మాతలకు అనుకూలంగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా సరే, భారీ రేటుకు ఓటీటీ సంస్థలు కొనేలా లోపల చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాత ఈ విషయంలో చాలా ఆరితేరినట్లు తెలుస్తోంది. ఓటీటీ సంస్థల్లో కీలక బాధ్యతల్లో ఉన్న ఉద్యోగులను తన గుప్పిట్లోకి తెచ్చుకుని, తన బ్యానర్ నుండి వచ్చే నాసిరకం సినిమాలకు కూడా భారీ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు టాక్. ఇందుకోసం సదరు మేనేజ్‌మెంట్ వ్యక్తులకు ఖరీదైన గిఫ్ట్‌లు, ఇతర ప్రయోజనాలతో ఎర వేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ అమౌంట్ ఓటీటీ ద్వారానే వెనక్కి వచ్చేలా ఈ నిర్మాత పక్కాగా పావులు కదుపుతున్నారు.
ఇలాంటి ‘బ్లాక్ డీల్స్’ వల్ల ఇండస్ట్రీలో ఒక పెద్ద సమస్య తలెత్తుతోంది. ప్రతి ఓటీటీ సంస్థ ఏడాదికి ఒక నిర్ణీత బడ్జెట్ లిమిట్‌ను పెట్టుకుంటుంది. ఉదాహరణకు టాలీవుడ్ నుంచి ఈ ఏడాది కేవలం 300 కోట్ల రూపాయల విలువైన కంటెంట్ మాత్రమే కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటే, అందులో మెజారిటీ వాటా ఇలాంటి మేనేజ్డ్ డీల్స్ వైపు వెళ్ళిపోతోంది. దీనివల్ల మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు, నిజాయితీగా సినిమాలు తీసే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి సినిమాల్లో దమ్మున్నా కూడా, ఓటీటీ సంస్థల దగ్గర బడ్జెట్ లేదనే కారణంతో మంచి ఆఫర్లు రావడం లేదు.
ఈ తరహా వ్యవహారాలు ఓటీటీ సంస్థల మనుగడకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉంది. నాసిరకం సినిమాలను భారీ ధరలకు కొనడం వల్ల సబ్ సబ్ స్క్రైబర్లు తగ్గిపోవడమే కాకుండా, సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. విదేశాల్లో ఉండే అసలు యజమానులకు ఇక్కడ జరుగుతున్న ఈ లోకల్ నెట్వర్క్ గురించి సరైన సమాచారం లేకపోవడమే ఈ నిర్మాతలకు ప్లస్ అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కొందరు తమ వ్యక్తిగత లాభాల కోసం అడ్డాగా మార్చుకుంటున్నారు. దీనివల్ల క్రియేటివ్ సినిమాలకు దక్కాల్సిన గుర్తింపు, ఆదరణ తగ్గిపోతున్నాయి.
సినిమా రంగం బాగుండాలంటే ఇలాంటి బ్యాక్ డోర్ పద్ధతులకు చెక్ పడాలి. కేవలం మేనేజ్‌మెంట్‌ను ట్రాప్ చేసి డీల్స్ సెట్ చేసుకోవడం వల్ల కొంతకాలం లాభపడవచ్చు కానీ, లాంగ్ రన్‌లో అది పతనానికి దారితీస్తుంది. ఓటీటీ సంస్థలు కూడా తమ లోకల్ టీమ్స్ పనితీరుపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే కంటెంట్ ఉన్న సినిమాలకు న్యాయం జరుగుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఓటీటీల పుణ్యమా అని లాభాలు పంచుకుంటూనే ఉంటాయి, కానీ మంచి సినిమాలు తీసే వారు మాత్రం తెరమరుగైపోతారు.
