Begin typing your search above and press return to search.

బ్యాక్ టు బ్యాక్ ఓపెనింగ్స్‌..రిట‌ర్న్స్ మాటేంటీ?

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో కొత్త త‌రం మేక‌ర్స్ పుట్టుకొచ్చారు. వేళ్ల మీద లెక్క‌పెట్ట‌ద‌గ్గ ఒకరిద్ద‌రు ప్రొడ్యూస‌ర్స్ మాత్ర‌మే స‌క్సెస్ అవుతున్నారు.

By:  Ravindar Gorantla   |   23 Feb 2026 12:17 PM IST
బ్యాక్ టు బ్యాక్ ఓపెనింగ్స్‌..రిట‌ర్న్స్ మాటేంటీ?
X

టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొద‌లైందా?.. ఒక ద‌శ‌లో వ‌రుస నిర్మాణాల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన ఇండ‌స్ట్రీ వాతావ‌ర‌ణం ఇప్పుడు క‌నిపిస్తోందా?..బ్యాక్ టు బ్యాక్ ఓపెనింగ్స్ ఇదే చెబుతున్నాయా?..అంటే కొంత మంది ఔన‌నే స‌మాధానం చెబుతున్నారు. కొంత మంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ కొత్త చిత్రాల ఓపెనింగ్స్ బాగానే ఉంది కానీ.. అంటూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన డిబేట్‌కు తెర‌లేపారు. అ డిబేట్ ఏంటీ? వ‌రుస‌గా చిన్నా, పెద్ద సినిమాల నిర్మాణంతో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడుతున్న టాలీవుడ్ దాని వెన‌క ఎలాంటి విచిత్ర‌మైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది?..ప్రొడ్యూస‌ర్స్ నిజంగానే లాభాల్ని సొంతం చేసుకుంటున్నారా? ఎవ‌రూ న‌ష్ట‌పోవ‌డం లేదా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

టాలీవుడ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి గురించి మాట్లాడు కోవాలంటే బాహుబ‌లికి ముందు త‌రువాత అని మాట్లాడుకోవాల్సిందే. బాహుబ‌లికి ముందు టాలీవుడ్‌లో క‌నిపించిన ప‌రిస్థితి వేరు.. బాహుబ‌లి త‌రువాత మారిన ప‌రిస్థితులు వేరు. దీని త‌రువాతే టాలీవుడ్ సినిమాల‌కు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో మార్కెట్ ఏర్ప‌డింది. చిన్న హీరో సినిమాకు హిట్ అనే మాట వ‌చ్చిందంటే భారీ స్థాయిలో ఓటీటీ రేటు ప‌లుకుతోంది. అంతే కాకుండా శ్రీ‌విష్ణు లాంటి హీరోల సినిమాల‌కు ఉత్త‌రాది డ‌బ్బింగ్ రైట్స్ విష‌యంలో మంచి రేటు ప‌లుకుతున్న ప‌రిస్థితి.

ఇక భారీ పాన్ ఇండియా సినిమాల గురించి అయితే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. నిర్మాణంలో ఉండ‌గానే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు క‌ర్చీఫ్‌లు వేసేసి భారీ మొత్తాన్ని చెల్లించి స్ట్రీమింగ్ హ‌క్కుల్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే చిన్న సినిమాల ప‌రిస్థితి మాత్రం అలా లేదు. సూప‌ర్ అంటే త‌ప్ప ఓటీటీలు ముందుకు రావ‌డం లేదు. గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటే మ‌రి బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాల నిర్మాణం, ఓపెనింగ్స్ జోరుగా ఎలా సాగుతున్నాయి? అన్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో కొత్త త‌రం మేక‌ర్స్ పుట్టుకొచ్చారు. వేళ్ల మీద లెక్క‌పెట్ట‌ద‌గ్గ ఒకరిద్ద‌రు ప్రొడ్యూస‌ర్స్ మాత్ర‌మే స‌క్సెస్ అవుతున్నారు. మిగ‌తా వారు న‌ష్టాల‌ని చూడాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల‌కు మించి యంగ్ ప్రొడ్యూస‌ర్స్‌, న్యూ ప్రొడ్యూస‌ర్స్ ఖ‌ర్చు చేస్తున్నారు. కానీ రిట‌ర్న్స్ మాత్రం ఆ స్థాయిలో ఉండ‌టం లేదు. ఒక్కో నిర్మాత స‌గానికి స‌గం పోగొట్టుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక మ‌రి కొంత మంది నిర్మాత‌లైతే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌ని హీరోలుగా ప‌రిచ‌యం చేస్తూ సినిమాలు చేస్తున్నారు.

వాటిని రిలీజ్ చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో అవి రెండు మూడేళ్ల పాటు ల్యాబ్‌ల‌కే ప‌రిమితం అవుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయిన ఓ చిన్న సినిమా దిల్ రాజు, మైత్రీ లాంటి సంస్థ‌లు చుట్టూ తిరిగి చివ‌రికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వారి చేతికి వెళ్లింది. ఏదో అనుకుని, ఏదో చేయాల‌ని దిగి చిన్న నిర్మాత‌లు ఫైన‌ల్‌గా ఏదో అయిపోతున్నారు. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌ప్ప న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికైనా మ‌ల‌యాళ‌, త‌మిళ మేక‌ర్స్ త‌ర‌హాలో రూటెడ్‌, రియ‌లిస్టిక్ స్టోరీస్‌ని న‌మ్ముకుని చిన్న నిర్మాత‌లు ప్ర‌యోగాలు చేస్తే కొంత మేర‌కు న‌ష్టాల నుంచి త‌ప్పుకునే వీలుంటుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.