Begin typing your search above and press return to search.

స్పోర్ట్స్ డ్రామాలపై 'తెలుగు' మేకర్స్ అంత ఫోకస్ ఎందుకు?

విజయం వెనుక జరిగిన పోరాటం ఏంటి? టార్గెట్ చేరుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఓటమి నుంచి మళ్లీ ఎలా నిలబడ్డాడు? ఇలాంటి అంశాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

By:  M Prashanth   |   5 July 2026 7:39 AM IST
స్పోర్ట్స్ డ్రామాలపై తెలుగు మేకర్స్ అంత ఫోకస్ ఎందుకు?
X

హీరో గెలిచాడా.. ఓడిపోయాడా? అనేది మాత్రమే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా కాదు. విజయం వెనుక జరిగిన పోరాటం ఏంటి? టార్గెట్ చేరుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఓటమి నుంచి మళ్లీ ఎలా నిలబడ్డాడు? ఇలాంటి అంశాలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే తెలుగు సినీ మేకర్స్ దృష్టి ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాలపై పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అడపాదడపా మాత్రమే వచ్చిన ఆ జోనర్ సినిమాలు.. ఇప్పుడు తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ ట్రెండ్‌ గా మారుతున్నాయి.

టాలీవుడ్ లో చాలా కాలం పాటు కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలదే హవా కొనసాగింది. ఆ తర్వాత కొత్త తరహా కథలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరిగింది. దీంతో మేకర్స్ రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ పై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. గతంలో స్పోర్ట్స్ సినిమాలంటే ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ హీరోలే కనిపించేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపించడం విశేషం.

స్పోర్ట్స్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ప్రధాన కారణం ఎమోషన్ అని చెప్పొచ్చు. సాధారణ కమర్షియల్ సినిమాలో హీరోకు ఒక టార్గెట్ ఉంటుంది. స్పోర్ట్స్ డ్రామాలోనూ అదే ఉంటుంది. కానీ ఇక్కడ గెలుపు కోసం హీరో చేసే ప్రయాణం ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేస్తుంది. అన్ని అంశాలను ఆటతో లింక్ చేసి చూపించే అవకాశం ఉంటుంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను సిద్ధం చేసేందుకు మేకర్స్‌ కు ఛాన్స్ లభిస్తోంది.

నిజానికి గతంలో తెలుగులో స్పోర్ట్స్ కథలు అనగానే ఎక్కువగా క్రికెట్ చుట్టూనే కథలు తిరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కుస్తీ, బైక్ రేసింగ్‌ తో పాటు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని క్రీడలను కథల్లో భాగం చేసేందుకు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఇది మేకర్స్‌ కు కొత్త స్టోరీలు చెప్పే అవకాశం కల్పిస్తే.. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తోంది.

మరోవైపు ఓటీటీలు కూడా మార్పునకు ఓ కారణంగా చెప్పొచ్చు. ఇతర భాషల్లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ సినిమాలు, సిరీసులను తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా ఆ జోనర్‌ లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఓ భారీ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ప్రకటన రానుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు, టాప్ హీరో కాంబినేషన్‌ లో భారీ విజన్‌ తో ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్‌ లో స్పోర్ట్స్ డ్రామాల ట్రెండ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.

ఏదేమైనా కొత్తదనం, స్ట్రాంగ్ ఎమోషన్, హీరో ప్రయాణాన్ని ఆసక్తికరంగా చూపించే అవకాశం ఉండటమే స్పోర్ట్స్ డ్రామాల వైపు తెలుగు మేకర్స్ ఫోకస్ పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రేక్షకుల టేస్ట్ మారుతున్న సమయంలో రెగ్యులర్ కమర్షియల్ కథలకు ఆప్షన్ గా స్పోర్ట్స్ జోనర్ నిలుస్తోంది. మరి ఫ్యూచర్ లో టాలీవుడ్ నుంచి ఇంకెన్ని కొత్త కథలు వస్తాయో చూడాలి.