Begin typing your search above and press return to search.

చిన్న హీరోలు అంత బిజీగా ఉన్నారా?

టాలీవుడ్‌లో మ‌రో త‌రం లైమ్ లైట్‌లోకి వ‌చ్చేస్తోందా?.. స్టార్ హీరోలు చేయ‌లేని క‌థ‌ల‌కు ప్ర‌త్యామ్న‌యంగా మారుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   2 Feb 2026 11:10 AM IST
చిన్న హీరోలు అంత బిజీగా ఉన్నారా?
X

టాలీవుడ్‌లో మ‌రో త‌రం లైమ్ లైట్‌లోకి వ‌చ్చేస్తోందా?.. స్టార్ హీరోలు చేయ‌లేని క‌థ‌ల‌కు ప్ర‌త్యామ్న‌యంగా మారుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఓటీటీల ప్ర‌భావం, భారీ బ‌డ్జెట్‌తో నిర్మించే పాన్ ఇండియా మూవీస్‌, సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో వ‌చ్చిన విప్ల‌వాత్మ‌క మార్పుల కార‌ణంగా కొత్త కొత్త హీరోలు తెర‌పైకి వ‌స్తున్న విషయం తెలిసిందే. గ‌త కొంత కాలంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా, హీరో స‌హాయ‌కులుగా, విల‌న్‌ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ల‌లో మెరిసిన వారంతా ఇప్పుడు హీరోలుగా మారి కొత్త నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు మంచి ఆధారంగా మారుతున్నారు.

ఒక ద‌శ‌లో పెద్ద హీరోలు బిజీగా ఉంటే రామ్ పోతినేని, నాని, శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వెంట‌ప‌డేవారు. కానీ ఇప్పుడు ఈ హీరోలు కూడా బిజీ అయిపోయి మ‌రో ఫేజ్‌లోకి చేర‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి చిన్న హీరోల‌పై ప‌డుతోంది. కొత్త త‌ర‌హా క‌థాబ‌ల‌మున్న సినిమాలకు ప్రేక్ష‌కులు బాక్సాఫీస్ వ‌ద్ద బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో కొత్త ప్రొడ్యూస‌ర్‌లు, స్టార్ ప్రొడ్యూస‌ర్లు సైతం కొత్త హీరోల‌పై దృష్టిసారిస్తున్నారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు బ్యాక్ బెంచ్ త‌ర‌హా ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్న వారంతా ఇప్పుడు లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసి బిజీ అవుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

యంగ్ డైరెక్ట‌ర్లు కూడా ఈ మ‌ధ్య హీరోలుగా మార‌డంతో వారితో నిర్మాత‌లు వ‌రుస ప్రాజెక్ట్‌లు చేస్తుండ‌టంతో ప్ర‌స్తుతం వారు కూడా కొత్త డైరెక్ట‌ర్ల‌కు అందుబాటులో ఉండ‌లేని ప‌రిస్థితి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన ఎక్జాంపుల్ తిరువీర్‌. బొమ్మ‌ల రామారం నుంచి ట‌క్ జ‌గ‌దీష్ వ‌ర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించి తిరువీర్ మ‌సూద‌, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో` చిత్రాల‌తో హీరోగా మంచి పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు య‌మ బిజీ అయిపోయాడు. `ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో` స‌క్సెస్‌కి ముందే వ‌రుస ప్రాజెక్ట్‌ల‌లో లాక్ అయిన తిరువ‌ర్ వాటిలో ఒక్కొక్క మూవీని ఇప్పుడిప్పుడే బ‌య‌టికి తీస్తున్నాడు.

భ‌గ‌వంతుడు, ఓ సుకుమారి త్వ‌ర‌లో రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా మ‌రి కొన్ని అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్నాయి. త‌న‌దో సినిమాలు చేయాల‌ని చాలా మంది కొత్త ద‌ర్శ‌కులు అత‌ని కోసం ఎదురుచూస్తున్నారు. మ‌రో రెండేళ్ల వ‌ర‌కు త‌న వ‌ద్ద డేట్స్ లేవ‌ని, ఆ త‌రువాతే క‌లుద్దామ‌ని యంగ్ డైరెక్ట‌ర్ల‌కు తిరువీర్ చెబుతున్నాడంటే చిన్న హీరోల ప‌రిస్థితి ఎలా మ‌రిందో స్ప‌ష్ట‌మ‌వుతోంది. తిరువీరు లాంటి హీరోలు డేట్స్ లేవ‌ని చెప్ప‌డంతో యంగ్ డైరెక్ట‌ర్లు `శుభం` మూవీలో న‌టించిన డైరెక్ట‌ర్ గ‌విరెడ్డి శ్రీ‌నివాస్ తో వ‌రుస ప్రాజెక్ట్‌లు ప్ర‌క‌టిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

వీళ్లే కాకుండా పెద్ద‌గా తెలియ‌ని సైడ్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించిన యంగ్ టాలెంటెడ్స్ కూడా ఇప్పుడు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ప్రియ‌ద‌ర్శి, త‌రుణ్ భాస్క‌ర్‌, రాగ్ మ‌యూర్ లాంటి వాళ్లు కూడా హీరోలుగా బిజీ అవుతున్నారంటే ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. దీంతో చిన్న హీరోలు, కొంత మేర ఫేస్ వ్యాల్యూ ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ద‌ర్శ‌కుల‌కు హీరోల కొర‌త ఏర్ప‌డుతోంది. దీంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌నే హీరోలుగా మార్చి సినిమాలు చేస్తున్నారు.