Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!

టాలీవుడ్‌లో సంగీత దర్శకుల కొరతపై చర్చ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాలు తగ్గించగా, తమన్, భీమ్స్ పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు జీవీ ప్రకాష్ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. విజయ్ బుల్గానిన్, వివేక్ సాగర్, గౌరహరి, హేషమ్ వంటి యువ సంగీత దర్శకులకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు కల్పిస్తే టాలీవుడ్‌లో కొత్త సంగీత ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By:  M Prashanth   |   20 Nov 2026 10:59 PM IST
టాలీవుడ్‌కు వీళ్లే సరిపోతారా!
X

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ ఛాయిస్‌గా ఉండేవారు. కానీ ఈ మధ్య DSP సినిమాల సంఖ్య బాగా తగ్గింది. పైగా ఇప్పుడు 'ఎల్లమ్మ'తో హీరోగానూ బిజీ అవుతున్నారు. మరోవైపు తమన్ వరుసగా పెద్ద సినిమాలను అందుకుంటున్నారు. భీమ్స్ సిసిరోలియో కూడా చిన్న సినిమాల నుంచి చిరంజీవి స్థాయి వరకు ఎదిగారు. అయితే టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల నెంబర్ కు తగ్గట్టుగా ఇంకా ఎక్కువమంది మ్యూజిక్ డైరెక్టర్లు అవసరమనే అభిప్రాయం కలుగుతోంది.

తమన్ ఇప్పటికే మాస్ రూట్లో పెద్ద సినిమాలతో బిజీగా ఉంటున్నారు. భీమ్స్ కూడా 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' విజయాలతో దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్‌గా మారారు. కానీ వీళ్లిద్దరిపైనే ఎక్కువగా ఆధారపడితే ప్రతి సినిమాకు కొత్త మ్యూజిక్ అందించడం కూడా కష్టమే. పైగా పెద్ద హీరోల సినిమాలకు పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం నెలల తరబడి వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే దర్శకులు ఇతర భాషల కంపోజర్ల వైపు కూడా చూస్తున్నారు.

తమిళంలో అనిరుధ్ ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ సాయి అభ్యంకర్ మంచి ఆల్టర్నేటివ్‌గా తయారవుతున్నారు. ఇండిపెండెంట్ సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్రాడు 'డ్యూడ్', 'కరుప్పు' సినిమాలతో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా'కు కూడా సంగీతం అందిస్తున్నారు. రాఘవ లారెన్స్ బెంజ్, కార్తీ మార్షల్ వంటి సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి. తక్కువ సమయంలోనే ఇన్ని పెద్ద అవకాశాలు అందుకోవడం విశేషం.

తెలుగులోనూ అలాంటి టాలెంట్ లేకపోలేదు. 'బేబీ', 'కోర్ట్' సినిమాలతో విజయ్ బుల్గానిన్ మంచి మెలోడీలు అందించారు. వివేక్ సాగర్ తనకంటూ ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్ సంపాదించుకున్నారు. 'హాయ్ నాన్న', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో హేషమ్ అబ్దుల్ వహాబ్ కూడా ఆకట్టుకున్నారు. మరోవైపు 'హనుమాన్', 'మిరాయ్'తో గౌరహరి, 'గూఢచారి', 'మేజర్'తో శ్రీచరణ్ పాకాల తమ సత్తా చూపించారు. అయితే వీళ్లలో చాలామందికి పెద్ద హీరోల నుంచి వరుస అవకాశాలు ఇంకా రావడం లేదు.

ఇప్పుడు జీవీ ప్రకాష్ మాత్రం తెలుగులో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'ఇరుముడి', 'ఆకాశంలో ఒక తార' సినిమాలతో వరుసగా మంచి ఫలితాలు అందుకున్నారు. మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించానంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో 'లక్కీ భాస్కర్' సంగీతానికి మంచి గుర్తింపు రావడం కూడా జీవీకి కలిసొచ్చింది. తమిళంలో బిజీగా ఉంటూనే ఇప్పుడు తెలుగు సినిమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

పైగా జీవీ చేతిలో మరిన్ని తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ 'జనవరి 12 విడుదల'కు సంగీతం అందిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమాకు కూడా ఇటీవల ఎంపికయ్యారు. దుల్కర్ సల్మాన్ 'శ్రీ శ్రీ' కూడా లైనప్‌లో ఉంది. అనిల్ రావిపూడి సినిమా నుంచి తొలి పాట విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి పెద్ద అవకాశాలు విజయ్ బుల్గానిన్, వివేక్ సాగర్, గౌరహరి లాంటి కంపోజర్లకు కూడా వస్తే టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ మరింత పెరగొచ్చు.