టాలీవుడ్ లో మైథలాజికల్ సినిమాల హవా!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతిహాసాల ట్రెండ్ జోరందుకుంది. భారతీయ పురాణాలు, రామాయణ, మహాభారత ఘట్టాలను వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఊపందుకుంది.
By: Srikanth Kontham | 7 July 2026 8:00 AM ISTప్రస్తుతం టాలీవుడ్ లో ఇతిహాసాల ట్రెండ్ జోరందుకుంది. భారతీయ పురాణాలు, రామాయణ, మహాభారత ఘట్టాలను వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఊపందుకుంది. లైవ్ యాక్షన్ సినిమాలే కాకుండా.. అత్యాధునిక యానిమేటెడ్ , మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుతూ దైవిక గాథలను సరికొత్త దృశ్యకావ్యాలుగా మార్చడానికి దర్శక,నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో హనుమంతుడి పాత్ర చుట్టూ కథలు అల్లుతున్న చిత్రాల సంఖ్య పెరుగుతోంది. చందూ ముండేటి దర్శకత్వంలో `వాయుపుత్ర` పేరుతో ఓ భారీ మోషన్ క్యాప్చర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా `జై హనుమాన్` చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకె క్కిస్తున్నారు. అరుణ్ కుమార్ రాపోలు `హనుమత్ సుందరకాండ` పేరుతో 3డి యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతొ హనుమంతుడి భక్తి, పరాక్రమం నేటి సాంకేతికతతో ఎలా ఆవిష్కృతమవుతాయో? చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. పౌరాణిక పాత్రల చుట్టూ అల్లిన కథలకు కూడా భారీ ఆదరణ లభిస్తోంది. ఇటీవల ప్రకటించిన `మహావతార పరశురామ` చిత్రం పురాణాల్లోని అరుదైన ఘట్టాలను చూపించనుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రం కూడా కార్తికేయ స్వామి నేపథ్యంలోనే సాగుతుంది. ఇలాంటి కథలు కేవలం వినోదాన్నే కాకుండా భారతీయ సంస్కృతి , ఆధ్యాత్మిక నేపథ్యాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు చేరువ చేసేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సాంకేతికతకు , కథాబలానికి ఇస్తున్న ప్రాధాన్యత, టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మలుపు తిప్పుతోంది. భారీ సెట్టింగులు, విజువల్ ఎఫెక్ట్స్ , మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న సినిమాలు పాత తరం ప్రేక్షకులకు పౌరాణిక అనుభూతిని, కొత్త తరం వారికి అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నాయి.
ఇతిహాసాలలోని గొప్పతనాన్ని ఆధునిక సినీ భాషలో చెప్పడం ఇప్పటి టాలీవుడ్ అగ్ర దర్శకుల లక్ష్యంగా మారుతోంది. అయితే ఈ ప్రయోగాల వెనుక ఉన్న సవాళ్లు కూడా తక్కువ కాదు. పురాణాలను తెరకెక్కించేటప్పుడు వాటిలోని మూలాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా అదే సమయంలో ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టుగా చిత్రీక రిండం దర్శకులకు పెద్ద పరీక్ష. భారీ బడ్జెట్ చిత్రాలైనప్పుడు నాణ్యతలో రాజీ పడకుండా ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా? కథలోని భావోద్వేగ పట్టు సడలకుంటేనే ఇలాంటి చిత్రాలు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాయి.పౌరాణిక కథల వైపు టాలీవుడ్ ఆసక్తి చూపడం అనేది పరిశ్రమకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవించి భారతీయ మూలాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్న పరంపర భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన చిత్రాలకు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు.
