Begin typing your search above and press return to search.

రూట్ మారుస్తున్న హీరోలు.. దేవుళ్లే టార్గెట్.. లిస్ట్ పెద్దదే గురూ!

సెంటిమెంట్, పౌరాణిక అంశాలకు ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్ తోడవ్వడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   10 Sept 2026 3:31 PM IST
రూట్ మారుస్తున్న హీరోలు.. దేవుళ్లే టార్గెట్.. లిస్ట్ పెద్దదే గురూ!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆధ్యాత్మిక, భక్తి మరియు పౌరాణిక జానర్ సినిమాలు మళ్లీ హాట్ ట్రెండ్‌గా మారాయి. ఒకప్పుడు కేవలం కమర్షియల్, యాక్షన్ కథల వైపు మాత్రమే మొగ్గు చూపిన టాలీవుడ్.. ఇప్పుడు సనాతన ధర్మం, భక్తి, దైవత్వం బ్యాక్‌డ్రాప్ ఉన్న కథల వైపు భారీగా అడుగులు వేస్తోంది. సెంటిమెంట్, పౌరాణిక అంశాలకు ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్ తోడవ్వడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బాక్సాఫీస్ వద్ద భక్తి రసం హవా:

పాతకాలపు పద్ధతిలో కాకుండా సోషియో-ఫాంటసీ, మోడ్రన్ గ్రాఫిక్స్ జోడించి కథలను తీస్తుండటంతో నేటి తరం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. గత రెండేళ్లలో వచ్చిన 'హను-మాన్', 'కల్కి 2898 AD', 'కాంతార' వంటి సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇక ఇటీవల శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ నటించిన 'మిస్టర్ మిడిల్ క్లాస్' కూడా అలరించింది. అంతేకాదు శబరిమల అయ్యప్ప భక్తి నేపథ్యంతో రవితేజ చేసిన యాక్షన్ డ్రామా ఇరుముడి కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

వెంకటేశ్వర స్వామిగా జయం రవి:

ఇక తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య లీలల నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా 'వడ్డీ కాసుల వాడ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో ప్రముఖ నటుడు జయం రవి నటిస్తుండటం విశేషం. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ హీరోలు సైతం ఇలా దేవుడి పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

టాలీవుడ్‌లో రాబోతున్న మైథాలాజికల్ వండర్స్:

మున్ముందు రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సోషియో-ఫాంటసీ నేపథ్యంలో దైవిక శక్తుల కథతో వస్తోంది. అలాగే నితేష్ తివారీ 'రామాయణం', ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్', ప్రభాస్ 'కల్కి 2' సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ వంటి భారీ ప్రాజెక్టులు లైన్ కట్టాయి.

దైవత్వంతో పాన్ ఇండియా విజయం;

మొత్తానికి మన అగ్ర నటులతో పాటు యంగ్ హీరోలు కూడా రూట్ మార్చి దేవుళ్ల కథలు, పౌరాణిక అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, భక్తికి మంచి ఆదరణ దక్కుతుండటంతో మేకర్స్ కూడా వందల కోట్ల బడ్జెట్‌తో ఈ తరహా సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ భక్తి రస చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.