మరింత ముదురుతున్న 'మూవీ రూల్జ్'
టాలీవుడ్‌ను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. ఇటీవల పోలీసులు ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసి, ఆ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని ప్రకటించారు.
By: M Prashanth | 23 Nov 2025 9:00 PM ISTటాలీవుడ్‌ను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. ఇటీవల పోలీసులు ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసి, ఆ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేశామని ప్రకటించారు. బప్పం టీవీ వంటి సైట్లను కూడా బ్లాక్ చేశారు. ఇక పైరసీ బెడద తగ్గుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అసలు కథ వేరేలా ఉంది. ఐబొమ్మ సైలెంట్ అయినా, పైరసీ కింగ్ 'మూవీ రూల్జ్' మాత్రం పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతోంది.
మేము తగ్గేదేలే అన్నట్లు కొత్త సినిమాలను యథేచ్ఛగా రిలీజ్ చేస్తూ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ శుక్రవారం వారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు ఒక్క రోజు కూడా గడవక ముందే 'మూవీ రూల్స్'లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లలో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను హై క్వాలిటీతో అప్లోడ్ చేస్తున్నారు.
పోలీసులు ఎన్ని డొమైన్లు బ్లాక్ చేసినా, మూవీ రూల్స్ మాత్రం కొత్త కొత్త లింకులతో, కొత్త ఎక్స్‌టెన్షన్లతో పుట్టుకొస్తూనే ఉంది. ఇది టెక్నికల్‌గా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసి, విచారణ వేగవంతం చేసినా సరే, మూవీ రూల్జ్ నిర్వాహకులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా, మమ్మల్ని ఆపడం మీవల్ల కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఒక పక్క సైబర్ క్రైమ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నామని చెబుతున్నా, మరోపక్క పైరసీ సైట్లు మాత్రం తమ దారులు మార్చుకుంటూ దందా కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనివల్ల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక మూవీ రూల్స్ నిర్వాహకులు ఆడుతున్న ఆట అంతా ఇంతా కాదు. పోలీసులు ఒక డొమైన్‌ను బ్లాక్ చేస్తే, నిమిషాల్లోనే మరో కొత్త ఎక్స్‌టెన్షన్‌తో సైట్ ప్రత్యక్షమవుతోంది.
ఇదొక లెవెల్ వ్యవస్థలా మారింది. తల నరికేస్తే మరో తల పుట్టుకొచ్చినట్లు, ఒక లింక్ పోతే పది లింకులు పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు, వెబ్‌సైట్లు బ్లాక్ అవుతుండటంతో ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూపులను అడ్డాగా మార్చుకున్నారు. అక్కడ ప్రైవేట్ లింకులు షేర్ చేస్తూ, వీపీఎన్ ల ద్వారా యాక్సెస్ ఇస్తూ పోలీసుల కళ్లు గప్పుతున్నారు. ఈ టెక్నికల్ వార్‌లో పైరసీ గాళ్లే పైచేయి సాధిస్తుండటం గమనార్హం.
ఈ పైరసీ వల్ల ఎక్కువగా నష్టపోతున్నది చిన్న మధ్య తరహా చిత్రాలే. పెద్ద హీరోల సినిమాలకు ఎలాగూ ఓపెనింగ్స్ వస్తాయి, కానీ కంటెంట్ బేస్డ్ సినిమాలకు మౌత్ టాక్ వచ్చేలోపే.. ఆ సినిమా హెచ్‌డి ప్రింట్ ఫోన్లలోకి వచ్చేస్తోంది. దీంతో థియేటర్లకు జనం రావడం తగ్గిపోయింది. "మా కష్టాన్ని దోచుకుంటున్నారు, చొక్కా విప్పితే వాతలు కనిపిస్తాయి" అని బన్నీ వాసు లాంటి నిర్మాతలు ఎంత గగ్గోలు పెడుతున్నా, ప్రేక్షకుల మైండ్ సెట్ మారడం లేదు. ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక హెచ్చరిక మాత్రమే అని, మూవీ రూల్జ్ లాంటి పెద్ద చేపలను పట్టుకుంటేనే ఇండస్ట్రీకి నిజమైన విముక్తి లభిస్తుందని సినీ పెద్దలు అంటున్నారు.
