Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్లో మోషన్: మేకింగ్ స్పీడ్ తగ్గడానికి కారణాలేంటి?

ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా పూర్తి చేయడానికి రెండు నుండి మూడు ఏళ్ల సమయం తీసుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   2 May 2026 7:00 AM IST
టాలీవుడ్ స్లో మోషన్: మేకింగ్ స్పీడ్ తగ్గడానికి కారణాలేంటి?
X

ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమా పూర్తి చేయడానికి రెండు నుండి మూడు ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి నటులు వేగంగా సినిమాలు పూర్తి చేస్తుంటే? టాలీవుడ్ లో మాత్రం మేకింగ్ స్పీడ్ గణనీయంగా తగ్గింది. పర్ఫెక్షన్ పేరుతో జరుగుతోన్న జాప్యం టాలీవుడ్ మార్కెట్ వేగాన్ని తగ్గిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లైన్ లో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `డ్రాగన్`, ప్రభాస్ - హను రాఘవపూడిల `ఫౌజీ`, మోస్ట్ అవేటెడ్ మహేష్ - రాజమౌళిల `వారణాసి` వంటి చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ కే చాలా స‌మ‌యాన్ని తీసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ కోసమే ఏడాది కాలం వెచ్చించడం, ఆపై హీరోల మేకోవర్ కోసం మరో ఆరు నెలలు కేటాయించడం పరిపాటిగా మారింది. దీంతో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి అది థియేటర్లలోకి రావడానికి మధ్య భారీ గ్యాప్ ఏర్పడుతోంది.

ఈ జాప్యానికి ప్రధాన కారణం పాన్ ఇండియా ఇమేజ్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. దీంతో ఏ చిన్న తప్పు దొర్లినా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తాయనే భయం దర్శకుల్లో పెరిగింది. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే క్రమంలో టెక్నాలజీపై అతిగా ఆధారపడటం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు నెలల తరబడి సాగడం సినిమా మేకింగ్‌ను స్లో మోషన్‌లోకి నెట్టేస్తున్నాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణ వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతోంది.

సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీలు పెరిగి నిర్మాతలపై పెను భారం పడుతోంది. అలాగే హీరోలు ఒక్కో సినిమాకు మూడేళ్లు కేటాయించడం వల్ల వారి కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయం వృథా అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడేళ్లలో మూడు విభిన్నమైన సినిమాలు చేయాల్సిన చోట, కేవలం ఒక్క సినిమాకే పరిమితం అవ్వడంతో మార్కెట్ పరిధి పెరిగినా? సినిమాల సంఖ్య తగ్గి బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గుతోంది.

మరోవైపు ప్రేక్షకుల నిరీక్షణ కూడా ఒక్కోసారి ప్రతికూలంగా మారుతోంది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం వల్ల, థియేటర్లలోకి వచ్చినప్పుడు చిన్న లోపం కనిపించినా ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమ తక్కువ బడ్జెట్ తో, తక్కువ సమయంలో నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తూ గ్లోబల్ లెవల్లో గుర్తింపు పొందుతుంటే? టాలీవుడ్ మాత్రం భారీతనం వెంటే పరుగులు తీస్తూ వేగాన్ని విస్మరిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఇతర భాషల సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. పర్ఫెక్షన్ ముఖ్యం కావొచ్చు. కానీ వేగం కూడా అంతే అవసరం. టాలీవుడ్ మేకర్స్ ప్రీ-ప్రొడక్షన్ పనులను మరింత పకడ్బందీగా, వేగంగా పూర్తి చేసే మార్గాలను అన్వేషించాలి. సాంకేతికతను వాడుకుంటూనే షూటింగ్ షెడ్యూల్స్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తే తప్ప టాలీవుడ్ అగ్రస్థానాన్ని కాపాడుకోలేదు. స్టార్ హీరోలు కూడా డేట్లను పక్కాగా ప్లాన్ చేసుకుని ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా విడుదలయ్యేలా చూడటం ఇండస్ట్రీ మనుగడకు ఎంతో కీలకం.