Begin typing your search above and press return to search.

క్యాన్సర్ ను జయించలేక ప్రముఖ నటి మృతి.. ఈ జాబితాలో ఇంకెంతమందో?

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటి జయవాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతూ నిన్న కన్నుమూశారు. ఈ వార్త విన్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

By:  Madhu Reddy   |   5 Feb 2026 3:30 PM IST
క్యాన్సర్ ను జయించలేక ప్రముఖ నటి మృతి.. ఈ జాబితాలో ఇంకెంతమందో?
X

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటి జయవాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతూ నిన్న కన్నుమూశారు. ఈ వార్త విన్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నటి కరాటే కళ్యాణి ఆమె మృతిని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎంతో మందికి నవ్వులు పంచిన కళాకారులు ఇలా క్యాన్సర్ మహమ్మారికి బలికావడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. జయవాహిని మృతితో ఈ ప్రాణాంతక వ్యాధి ఎంతటి ప్రమాదకరమో మరోసారి చర్చకు దారితీసింది.

కరాటే కళ్యాణి భావోద్వేగం:

గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న జయవాహిని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఆమె తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెను కాపాడేందుకు చిత్ర పరిశ్రమలోని కొందరు మిత్రులు ఎంతో ప్రయత్నించినప్పటికీ, వ్యాధి ముదరడంతో ఫలితం లేకుండా పోయింది. "నిన్ను కాపాడాలని ఎంతో ఆశపడ్డాం, కానీ విధి నిన్ను మా నుంచి దూరం చేసింది" అంటూ కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. జయవాహిని మృతితో ఆమె కుటుంబ సభ్యులు మరియు సహనటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సినీ రంగుల ప్రపంచంలో ఎంతో మందిని అలరించిన దిగ్గజాలు క్యాన్సర్ బారిన పడి కన్నుమూయడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. టాలీవుడ్ లెజెండ్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి సతీమణి నందమూరి బసవతారకం ఈ వ్యాధితోనే మరణించారు (ఆమె జ్ఞాపకార్థమే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటైంది).

అలాగే, సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న మురళీ మోహన్ సోదరుడు, నటుడు కిషోర్ కుమార్ కూడా క్యాన్సర్‌తోనే తుదిశ్వాస విడిచారు. విలక్షణ నటి శ్రీవిద్య, ఇక ఇప్పుడు సీనియర్ నటి జయవాహిని వంటి వారు ఈ పోరాటంలో ఓడిపోయారు. ఎంతటి స్టార్ డమ్ ఉన్నా, ఆర్థికంగా బలంగా ఉన్నా.. ఈ ప్రాణాంతక వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని ఈ విషాద ఘటనలు మనకు గుర్తుచేస్తున్నాయి.

క్యాన్సర్‌ను జయించిన ధీశాలురు:

అయితే క్యాన్సర్ వంటి మహమ్మారిని ఎదుర్కోవడం అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఒక పెద్ద యుద్ధం చేయడమే. కానీ, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆ మృత్యువును జయించి, తిరిగి వెండితెరపై మెరిసిన ధీశాలురు మన చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ అందాల నటి మనీషా కొయిరాలా,మిర్చి మూవీలో నటించిన హంస నందిని, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాలి బింద్రే, ఇలాంటి వారిని చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే.. క్యాన్సర్ అంటే జీవితం ముగిసిపోవడం కాదు, అది ఒక కొత్త పోరాటానికి ఆరంభం.

అవగాహన ముఖ్యం:

క్యాన్సర్ అనేది ఎంతటి వారినైనా కుంగదీసే వ్యాధి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాల మీదకు వస్తుంది. సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో వెలుగులు చిమ్మే నటులు కూడా లోపల ఇంతటి బాధను అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జయవాహిని ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, లక్షణాలను గుర్తించి ముందే జాగ్రత్త పడటం మాత్రమే ఈ మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకునే మార్గాలు.