హీరో (X) డైరెక్టర్: ఈ వెనకబాటుతనానికి కారణం?
దురంధర్ ఫ్రాంచైజీ సక్సెస్ తర్వాత మన టాలీవుడ్ హీరోలు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్‌లో ఉండి ఉంటారు.
By: Sivaji Kontham | 27 March 2026 5:00 PM ISTతెలుగు సినిమా ఇప్పుడు ఒక వింతైన సంధి కాలంలో ఉంది. ఒకవైపు దురంధర్, దురంధర్ 2 వంటి చిత్రాలు భారీ ఎలివేషన్లు, అరుపులు, కేకలు లేకుండానే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటే మన అగ్ర దర్శకులు మాత్రం ఇంకా పాత మూస కమర్షియల్ ధోరణిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి వంటి మాస్ డైరెక్టర్లు ఇప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరంతా హీరోలకు ఇచ్చే అతిశయోక్తి ఎలివేషన్ల వల్లే కథాబలంలో వెనుకబడిపోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వీరు `అండర్ డాగ్` స్టైల్ కథలను, డీసెంట్ ఎలివేషన్లను నమ్ముకోకపోతే రేసులో వెనకబడటం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దురంధర్ మానియా తర్వాత రెగ్యులర్ మాస్ డైరెక్టర్లపై చాలా సందేహాలు ముసురుకున్నాయి.
అయితే ఇక్కడ అసలు చిక్కు దర్శకులతోనా..? లేక హీరోలతోనా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఈ దర్శకులంతా హీరోలకు ఎలివేషన్లు లేని, కేవలం కథకు ప్రాధాన్యత ఉన్న కథలు వినిపిస్తే మన స్టార్ హీరోలు వింటారా? అసలు ఊరమాస్ ఎలివేషన్లు లేకుండా తమ హీరోని తెరపై చూడటానికి మన స్టార్ హీరోల ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? అనే సందేహాలు కూడా మరోవైపు ఉన్నాయి. `మా హీరో ఎంట్రీ అదిరిపోవాలి.. మా హీరో రౌడీలను గాల్లోకి ఎగరేయాలి`` అని డిమాండ్ చేసే అభిమాన గణం మారనంత వరకు, దర్శకులు కూడా అదే పాత బాటలో నడవక తప్పని పరిస్థితి నెలకొంది. హీరోలు కూడా తమ ఇమేజ్ చట్రం నుండి బయటకు రాకపోతే భవిష్యత్తులో తెలుగు సినిమాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ ను మాత్రమే దృష్టి లో పెట్టుకుని ఎలివేషన్లు ఇవ్వాలనుకుంటే, మెజారిటీగా ఉన్న ప్రజలు థియేటర్లకు రావడం మానుకుంటారు.
ఇటీవల విడుదలైన `ఉస్తాద్ భగత్ సింగ్` ఫలితాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. బాక్సాఫీస్ వద్ద `దురంధర్ 2` సునామీ సృష్టిస్తుంటే పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్ ఉన్నా `ఉస్తాద్` నీరసపడిపోవడానికి కారణం హరీష్ శంకర్ అనుసరించిన పాత మూస కమర్షియల్ హంగులే అని సామాన్యులు భావిస్తున్నారు. కేవలం హీరో ఇమేజ్ ని నమ్ముకుని, అనవసరమైన ఎలివేషన్లతో కథను పక్కన పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ హరీష్ శంకర్ గనుక పవన్ కళ్యాణ్‌ను ఒక సాధారణ వ్యక్తిగా, ఎలివేషన్లు లేకుండా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకునేవారా? పవన్ కళ్యాణ్ అటువంటి సాదాసీదా పాత్రకు అంగీకరించేవారా? అనే సందేహాలు కూడా మరోవైపు వ్యక్తమవుతున్నాయి.
దురంధర్ ఫ్రాంచైజీ సక్సెస్ తర్వాత మన టాలీవుడ్ హీరోలు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్‌లో ఉండి ఉంటారు. భారీ ఎలివేషన్లు ఇస్తే క్లాస్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.. ఇవ్వకపోతే మాస్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారని భయపడుతున్నారు. కానీ నిజమైన మ్యాజిక్ కథలో ఉంటుందని `దురంధర్` నిరూపించింది. హీరో పాత్ర ఆరంభం అంతంతమాత్రంగానే ఉన్నా... క్లైమాక్స్‌లో ఎంత బలంగా లేస్తుందో చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ `అండర్ డాగ్` ఫార్ములాను వదిలేసి.. ఇంకా పాత కాలం నాటి బిల్డప్ సీన్లనే నమ్ముకుంటే మన స్టార్ హీరోల కెరీర్‌లు ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
దర్శకులు మారాలి.. హీరోలు తమ పంథా మార్చుకోవాలి. అన్నిటికీ మించి అభిమానులు తమ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పవర్ ఫుల్ ఎలివేషన్లు లేకపోయినా పర్వాలేదు, బలమైన కథ ఉంటే చాలు అని ఫ్యాన్స్ డిసైడ్ అయితేనే మన దర్శకులు కొత్త తరహా సినిమాలు తీయగలరు. లేదంటే మన హీరోలు ఎలివేషన్ల మత్తులో ఉండిపోయి.. పొరుగు నుండి వస్తున్న విభిన్నమైన కంటెంట్ ముందు తలవంచాల్సి వస్తుంది. తెలుగు సినిమా భవిష్యత్తు బాగుండాలంటే ఈ పాత మూస ధోరణికి ముగింపు పలకాల్సిందే.
