Begin typing your search above and press return to search.

యాభై ఏళ్ళ హీరోలు...హీరోయిన్లు!

యాభై అంకెకు ఒక అర్ధం పరమార్ధం ఉంది. వందకు సంపూర్ణత్వం ఎలా ఉందో అందులో యాభైకి కూడా ఒక విలువ గౌరవం ఉంది.

By:  Satya P   |   24 Nov 2025 8:00 AM IST
యాభై ఏళ్ళ హీరోలు...హీరోయిన్లు!
X

యాభై అంకెకు ఒక అర్ధం పరమార్ధం ఉంది. వందకు సంపూర్ణత్వం ఎలా ఉందో అందులో యాభైకి కూడా ఒక విలువ గౌరవం ఉంది. ఇక అర్ధ శతాబ్దం పాటు ఒకే రంగంలో కానీ వృత్తిలో కానీ నిరంతరాయంగా శ్రమిస్తూ రాణిస్తూ ఉంటే కనుక అది ఎంతో గొప్పగానే చూడాల్సి ఉంటుంది. అలాంటి ఘనతను దేశంలో చలన చిత్ర రంగంలో ఎంతో మంది సాధించారు. అయితే బాలీవుడ్ తో పాటుగా అతి పెద్ద పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ లో యాభై ఏళ్ళ చలన చిత్ర చరిత్రను సొంతం చేసుకున్న హీరోలు మనకు కళ్ళ ముందే చాలా మంది కనిపిస్తారు. ఇక టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటే ఈ ఘనత సాధించిన వారు లివింగ్ లెజెండ్స్ గా కొందరు ఉన్నారు.

బాలయ్య అచీవ్ మెంట్ :

నటరత్న ఎన్టీఆర్ తనయుడిగా టాలీవుడ్ లో బాలనటుడిగా అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ 1974 నుంచి ఏ ఒక్క ఏడాది మిస్ కాకుండా ఈ రోజుకీ నటిస్తూనే ఉన్నారు. 1974 ఆగష్టు 30న బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మకల రిలీజ్ అయింది. అలా ఆయన 2024 ఆగస్టు 30 నాటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చలన చిత్ర పరిశ్రమ అంతా కలసి సత్కారం చేసింది. ఇదే సందర్భంలో కేంద్రం కూడా ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డుని బాలయ్యకు ప్రదానం చేసింది. తాజాగా గోవాలో జరుగుతున్న ఇఫీ ఫెస్టివల్ లో బాలయ్యని కేంద్రం ఘనంగా సన్మానించింది.

మోహన్ బాబు శకం :

ఇక ఇదే వరసలో చూస్తే టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కూడా 1975 నవంబర్ 22న నటుడుగా తెరంగేట్రం చేశారు. స్వర్గం నరకం సినిమా ద్వారా మోహన్ బాబు హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చారు. అది లగాయతు ఈ రోజు దాకా మోహన్ బాబు నటిస్తూనే ఉన్నారు. కేవలం హీరోగానే కాదు, క్యారెక్టర్ యాక్టర్ గా విలన్ గా ప్రత్యేక పాత్రలలో కూడా ఆయన మెప్పించారు. ఇక మోహన్ బాబు యాభై ఏళ్ళ సినీ జీవితం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్ సహా ఇతర సినీ ప్రముఖులు అలాగే మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరై మోహన్ బాబు చేసిన సేవలను కొనియాడారు.

ఈ లిస్టులో వారూ :

ఇదే జాబితాలో యాభై ఏళ్ళ చలన చిత్ర జీవితాన్ని పూర్తి చేసుకున్న వారిలో మురళీ మోహన్ కూడా ఉన్నారు. ఆయన 1973లో సినీ రంగ ప్రవేశం జగమే మాయ చిత్రం ద్వారా చేశారు, 2023లో ఆయనకు హైదరాబాద్ లో జరిగిన సత్కార కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హజరయ్యారు. అనేక మంది చలన చిత్ర ప్రముఖులు అంతా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సహజ నటి జయసుధ కూడా యాభై ఏళ్ళ జీవితాన్ని 2023లోనే పూర్తి చేసుకున్నారు. పండంటి కాపురం చిత్రం ద్వారా ఆమె తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఇదే సినిమాలో బాలనటుడిగా పరిచయం అయిన హీరో నరేష్ కూడా 2022 లో యాభై ఏళ్ళ సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా చెప్పాలీ అంటే గిరిబాబు వంటి వారు యాభై ఏళ్ళ సినీ జీవితం చూశారు.

మెగాస్టార్ యుగం :

ఇదే వరసలో మెగాస్టార్ యాభై ఏళ్ళ సినీ వేడుకలకు తెర లేవనుంది ఆయన 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు. నిజానికి ఆయన మేకప్ వేసుకున్న తొలి చిత్రం పునాది రాళ్ళు, అది రిలీజ్ లేటు అయింది, రెండవ చిత్రంగా ఉన్న ప్రాణం ఖరీదు మొదట విడుదల అయింది. ఇక మరో మూడేళ్ళలో మెగాస్టార్ అర్ధ శతాబ్దపు సినీ జీవిత వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇలా చూస్తే కనుక ఇన్నేళ్ళ పాటు ప్రేక్షకులను మెప్పించి రాణించడం అన్నది చాలా కష్టం. రాను రానూ హీరోల సినీ కెరీర్ స్పాన్ కూడా తగ్గిపోతోంది. స్టార్ హీరోల హవా కూడా మునుపటిలా ఉండడం లేదు. దాంతో ఈ యాభై ఏళ్ళ హీరోల వైభవం తరువాత తరంలో చూస్తారా లేదా అన్న సందేహం అయితే చాలా మందిలో ఉంది.