15 సెకన్ల రీల్ మాయ.. సినిమా పాటల సోల్ ఎక్కడ పోతోంది!
ఎలాగైనా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్లు స్టెప్పులేసేలా ఒక క్యాచీ బీట్, ఒక వైరల్ హుక్ స్టెప్ ఉంటే చాలు అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్లను అడుగుతున్నారు.
By: M Prashanth | 14 Oct 2026 9:09 AM ISTఒకప్పుడు సినిమా పాటంటే ఒక మంచి ఫీల్ ఉండేది. ఆడియో క్యాసెట్లు, సీడీలు కొనుక్కుని ప్రయాణాల్లోనూ, తీరిక వేళల్లోనూ రిపీట్ మోడ్ లో వినే రోజులుండేవి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం అరచేతిలోకి, అదీ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లోకి మారిపోయింది. ఏదైనా కొత్త పాట వచ్చిందంటే.. అది వినడానికి ఎంత బాగుంది అనే దానికంటే, రీల్స్ చేయడానికి ఎంత అనువుగా ఉందనే లెక్కలే మొదట వినిపిస్తున్నాయి. మొత్తం పాటను కాకుండా కేవలం 15 సెకన్ల హుక్ బిట్ ను టార్గెట్ చేసి ట్రాక్స్ రెడీ చేయడమే ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ అయిపోయింది.
సినిమా మేకర్స్ కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంటున్నారు. ఒక మంచి ఆల్బమ్ లో మెలోడీ, ఎమోషన్, కథను ముందుకు నడిపించే సాహిత్యంతో కూడిన నాలుగైదు పాటలు ఉండాలనే పాత పద్ధతిని పక్కన పెట్టేస్తున్నారు. ఎలాగైనా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్లు స్టెప్పులేసేలా ఒక క్యాచీ బీట్, ఒక వైరల్ హుక్ స్టెప్ ఉంటే చాలు అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్లను అడుగుతున్నారు.
ఆ ఒక్క బిట్ కోసం అవసరానికి మించి ఖర్చు చేస్తూ, మిగిలిన పాటలను నామమాత్రంగా కానిచ్చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిర్మాతల వైపు నుంచి చూస్తే వారి లాజిక్ కూడా ప్రాక్టికల్ గానే కనిపిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కోట్ల ఖర్చుతో చేసే ప్రమోషన్ల కంటే.. ఇన్ స్టాలో ఒక పాట వైరల్ అయితే వచ్చే ఫ్రీ పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. లక్షల కొద్దీ యూజర్లు ఆ పాటపై రీల్స్ చేస్తూ సినిమా పేరును జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
ఈ హైప్ వల్ల థియేటర్లలో మొదటి రోజు ఓపెనింగ్స్ పెరగడానికి, అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడానికి ఈ హుక్ స్టెప్పులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందుకే మేకర్స్ కూడా ఈ రూట్ నే సేఫ్ అనుకుంటున్నారు. అయితే ఈ హైప్ వెనుక ఉన్న పెద్ద లోపం ఏంటంటే పాటల షెల్ఫ్ లైఫ్ దారుణంగా పడిపోవడం. రీల్స్ లో విపరీతంగా వినిపించే పాటలు థియేటర్ లోకి వెళ్లేసరికి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాయి. కథతో సంబంధం లేకుండా ఇరికించినట్లు అనిపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు.
ఒకప్పుడు ఏళ్ల తరబడి గుర్తుండిపోయే క్లాసిక్ మెలోడీలు ఇచ్చే అవకాశం ఉండగా, కేవలం రెండు వారాల రీల్స్ ట్రెండ్ కోసం కంపోజర్లు తమ క్రియేటివిటీని ఒకే రకమైన ఫాస్ట్ బీట్లకు పరిమితం చేసుకోవాల్సి వస్తోంది. థియేటర్స్ లో సినిమా చూసి బయటకు వచ్చాక కనీసం ఒక్క లిరిక్ కూడా గుర్తుండని పరిస్థితి రావడం ఇండస్ట్రీ మ్యూజిక్ క్వాలిటీకి ఎదురవుతున్న పెద్ద సమస్య.
కంటెంట్ తో ట్రావెల్ అయ్యే సహజమైన పాటలు వచ్చినప్పుడే సినిమా ఎమోషన్ మరింత బలపడుతుంది. ప్రమోషన్లకు పనికొచ్చే వైబ్రెంట్ సాంగ్స్ అవసరమే అయినా, సినిమా సోల్ లాంటి మంచి మెలోడీలను పూర్తిగా పక్కన పెట్టేస్తే అసలైన నష్టం సినిమాకే జరుగుతుంది. మారుతున్న కాలంతో పాటు ప్రమోషన్ టెక్నిక్స్ మారడంలో తప్పులేదు. రీల్స్ ఇచ్చే మైలేజ్ ను వాడుకుంటూనే, ఆల్బమ్ కు కావాల్సిన వైవిధ్యాన్ని కాపాడుకోవడమే అసలైన బ్యాలెన్స్.
