Begin typing your search above and press return to search.

వెండితెరపై 'ఐబొమ్మ' రవి కథ.. ఏం ప్లాన్ చేస్తున్నారు?

ప్రముఖ నిర్మాణ సంస్థ 'తేజ్ క్రియేటివ్ వర్క్స్' ఈ సంచలన ప్రాజెక్ట్ ను ప్రకటించింది.

By:  M Prashanth   |   19 Nov 2025 3:53 PM IST
వెండితెరపై ఐబొమ్మ రవి కథ.. ఏం ప్లాన్ చేస్తున్నారు?
X

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో 'ఐబొమ్మ రవి' పేరు మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ కొత్త సినిమాలను జనాలకు అరచేతిలో చూపించిన ఆ వెబ్‌సైట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అతని కథేంటి? అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ సినిమాలను పైరసీ చేసిన వ్యక్తి జీవితమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది.

ఒక నిర్మాణ సంస్థ 'తేజ్ క్రియేటివ్ వర్క్స్' ఈ సంచలన ప్రాజెక్ట్ ను ప్రకటించింది అనే పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇమ్మడి రవి జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వారు అనౌన్స్ చేశారు. కేవలం పైరసీ కింగ్ గానే కాకుండా, ఒక వ్యక్తిగా రవి ప్రయాణం ఎలా సాగిందనే కోణంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమాలో రవి జీవితంలోని ఎవరికీ తెలియని వాస్తవాలను చూపించబోతున్నారు. ముఖ్యంగా అతను చేసిన పోరాటం, తన ప్రయాణంలో ఎదుర్కొన్న నమ్మకద్రోహాలు, వెన్నుపోట్ల గురించి ఈ సినిమాలో ప్రధానంగా చర్చించనున్నారు. "రవి వెనుక ఒక కథ ఉంది, ఆ కథలో ఎమోషన్ ఉంది" అని చెబుతుండటం చూస్తుంటే, దీన్ని ఒక ఎమోషనల్ డ్రామాగా మలిచే ప్లాన్ లో ఉన్నట్లు అర్థమవుతోంది.

అంతేకాకుండా, ఐబొమ్మ టీమ్ గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో "చీకటి విషయాలు" ఈ సినిమాలో రివీల్ చేస్తామని మేకర్స్ హామీ ఇస్తున్నారు. అసలు ఆ టెక్నికల్ సామ్రాజ్యాన్ని రవి ఎలా నిర్మించాడు? అతనికి సహకరించింది ఎవరు? చివరికి అతను ఎలా దొరికిపోయాడు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం రవి కథేనా లేక అతని టీమ్ కథా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఏ ఇండస్ట్రీ అయితే ఐబొమ్మ వల్ల వందల కోట్లు నష్టపోయిందో, ఇప్పుడు అదే ఇండస్ట్రీలో అతనిపై సినిమా తీయడం గమనార్హం. ఇది రవిని గ్లోరిఫై చేసేలా ఉంటుందా, లేక వాస్తవాలను నిష్పక్షపాతంగా చూపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక పైరసీ వెబ్ సైట్ ఓనర్ లైఫ్ స్టోరీని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న.

ఏది ఏమైనా, 'ఐబొమ్మ' అనే బ్రాండ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కలగడం ఖాయం. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ, కాన్సెప్ట్ మాత్రం అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. మరి వెండితెరపై ఈ "రియల్ లైఫ్ పైరసీ డ్రామా" ఎలా ఉండబోతోందో, ఇందులో రవి పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి.