Begin typing your search above and press return to search.

మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌కి.. ఇప్పుడు ఎటువైపు? ఏపీ టాలీవుడ్ విస్త‌ర‌ణ‌కు ఏం జ‌ర‌గాలి?

అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా టాలీవుడ్‌ను డెవలప్ చేస్తామని ఇండస్ట్రీ పెద్దలు తరచూ ప్రకటిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   29 May 2026 8:00 AM IST
మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌కి.. ఇప్పుడు ఎటువైపు? ఏపీ టాలీవుడ్ విస్త‌ర‌ణ‌కు ఏం జ‌ర‌గాలి?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) ప్రస్థానం మద్రాసు (చెన్నై) నుండి హైదరాబాద్‌కు మారడం వెనుక ఒక సుదీర్ఘమైన చరిత్ర, ప్రభుత్వాల అపరిమితమైన ప్రోత్సాహం ఉన్నాయి. మద్రాసు నుంచి విడిపోయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు సినిమా తన సొంత గడ్డపైకి రావాలనే సినీ పెద్దల ఆకాంక్షకు అప్పటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అండగా నిలిచాయి. ఇండస్ట్రీ తరలింపు కోసం హైదరాబాద్‌లో రాయితీలపై భూముల కేటాయింపు, స్టూడియోల నిర్మాణానికి రాయితీలు.. పన్ను మినహాయింపులు వంటి బలమైన ప్రోత్సాహకాలను పాలకులు అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, డి. రామానాయుడు వంటి సినీ దిగ్గజాలు ప్రభుత్వాల భరోసాతోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించి, పరిశ్రమ ఇక్కడ స్థిరపడటానికి పునాది వేశారు. ప్రభుత్వాల తోడ్పాటు, ఇండస్ట్రీ పెద్దల ఆరాటం తోడై టాలీవుడ్‌ను హైదరాబాద్‌కు విజయవంతంగా షిఫ్ట్ చేయగలిగాయి.

అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా టాలీవుడ్‌ను డెవలప్ చేస్తామని ఇండస్ట్రీ పెద్దలు తరచూ ప్రకటిస్తున్నారు. కానీ హైదరాబాద్ తరహాలో వైజాగ్ (విశాఖపట్నం) లేదా అమరావతిలో మరో టాలీవుడ్‌ను అభివృద్ధి చేయడం అంత సులువైన విషయం కాదు. నేడు మనం చూస్తున్న హైదరాబాద్ సినీ సామ్రాజ్యం ఒకే రోజులో ఏర్పడింది కాదు. దీని వెనుక దశాబ్దాల కాలం.. సుదీర్ఘమైన శ్రమ దాగి ఉన్నాయి. షూటింగ్ స్టూడియోలు, అధునాతన రికార్డింగ్ థియేటర్లు, ల్యాబ్‌ల నిర్మాణంతో పాటు వేలాది మంది సినీ కార్మికులు ఒకే చోట అందుబాటులో ఉండే వాతావరణం అక్కడ దశాబ్దాల కాలంలో ఏర్పడింది. ఈ మౌలిక సదుపాయాలన్నీ సుస్థిరంగా మారినప్పుడే పరిశ్రమ ఒక చోట వేళ్లూనుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహజసిద్ధమైన అందాలతో సముద్ర తీరంతో సినిమా షూటింగ్‌లకు ఎంతో అనుకూలమైన ప్రాంతం. ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో వంటి వసతులు ఉన్నా కానీ.. పూర్తి స్థాయి ఇండస్ట్రీగా వైజాగ్ ఎదగాలంటే సినిమా పరిశ్రమకు చెందిన `24 శాఖల` సాంకేతిక నిపుణులు అక్కడ స్థిరపడాలి. కేవలం నటీనటులు, దర్శకులే కాకుండా.. లైటింగ్, కెమెరా ఎక్విప్‌మెంట్, మేకప్, కాస్ట్యూమ్స్, డ్రైవర్లు, ప్రొడక్షన్ బాయ్స్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు స్థానికంగా లభించాలి. షూటింగ్‌కు అవసరమైన ప్రతి చిన్న వస్తువు కోసం.. టెక్నీషియన్ కోసం మళ్లీ హైదరాబాద్‌పైనే ఆధారపడాల్సి వస్తే... వైజాగ్‌లో ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఇవన్నీ ఒకే గొడుగు కిందకు రావాలంటే భారీగా పెట్టుబడులు, సమయం అవసరమవుతాయి.

వైజాగ్ లేదా అమరావతిలో కొత్త టాలీవుడ్ రూపుదిద్దుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి గట్టి భరోసా మరియు భారీ ప్రోత్సాహకాలు అందాలి. సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని శాఖల వారికి, కార్మిక సంఘాలకు నివాస సముదాయాల కోసం మరియు స్టూడియోల నిర్మాణానికి రాయితీలపై భూములు ఇస్తామని ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. కేవలం భూములే కాకుండా ఇతర అత్యాధునిక రికార్డింగ్, పోస్ట్-ప్రొడక్షన్ విభాగాల తరలింపునకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందించాల్సి ఉంటుంది. సింగిల్ విండో అనుమతులు, తక్కువ ధరకే విద్యుత్ వంటి పరిశ్రమ అనుకూల విధానాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయాలి.

అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో పాటు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఏపీలో స్థిరపడాలనే నిజాయితీ గల ఆసక్తి, చిత్తశుద్ధి ఉండాలి. కేవలం హైదరాబాద్‌లో అవకాశాలు లేదా స్థలాలు దక్కని వారు మాత్రమే కాకుండా.. పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, స్టార్ హీరోలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. చిత్ర పరిశ్రమ పెద్దల బలమైన సంకల్పం... ఈ రెండూ సరిసమానంగా తోడైనప్పుడే విశాఖపట్నం లేదా అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త టాలీవుడ్ సామ్రాజ్యం సాకారమవుతుంది. ఏపీ ఎఫ్‌.డి.సి కొత్త డైరెక్ట‌ర్, అధ్య‌క్షుడు మ‌రో టాలీవుడ్ అభివృద్ధి గురించి ఏం చెబుతారో వేచి చూడాలి.