Begin typing your search above and press return to search.

కథ కాదు… టైమింగ్‌నే టాలీవుడ్‌లో అసలు హీరో!

ఇక్కడే టైమింగ్ అనే అంశం కీలకంగా మారుతుంది. ఒక కథ ఆలస్యమైతే అలాంటి ఆలోచనతోనే మరో డైరెక్ట‌ర్, మరో హీరో, మరో బ్యానర్ ముందుకు రావచ్చు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Aug 2026 7:00 PM IST
కథ కాదు… టైమింగ్‌నే టాలీవుడ్‌లో అసలు హీరో!
X

సినీ ఇండ‌స్ట్రీలో ఒక సినిమా అనౌన్స్ చేయ‌డం, పూజా కార్యక్రమాలు జరగడం, షూటింగ్ మొదలవడం ప్రేక్షకులకు కనిపించే దశలు మాత్రమే. కానీ ఆ దశలకు ముందుగా జరిగే స్టోరీ డిస్క‌ష‌న్స్, రీరైట్స్, పాత్రల నిర్మాణం, కాల్షీట్ లెక్కలు వంటి అంశాలే చాలా ప్రాజెక్టుల ఫ్యూచ‌ర్‌ను డిసైడ్ చేస్తాయి. అందుకే ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది మంచి కథ ఉండటం మాత్రమే సరిపోదు, అది సరైన హీరోకు, సరైన సమయంలో, సరైన మార్కెట్ పరిస్థితుల్లో చేరడం కూడా అంతే ముఖ్యమ‌ని చెప్తుంటారు.

ఒక కథపై హీరో ఆసక్తి చూపినా, డైరెక్ట‌ర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా, నిర్మాణ సంస్థ ముందుకు రావాలనుకున్నా కూడా, కథలోని కొన్ని కీలక భాగాలు ఆశించిన స్థాయికి రాకపోతే ప్రాజెక్టు నెలల తరబడి డెవలప్‌మెంట్ దశలోనే ఉండిపోతుంది. ఈ సమయంలో కథపై మళ్లీ వ‌ర్క్ జరుగుతుంది. పాత్రల గ్రాఫ్ మారుతుంది, క‌థ‌ను మ‌ళ్లీ తిరిగి రాస్తారు, ఫ్లాష్‌బ్యాక్ లేదా క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చేస్తారు. బయటకు ఇవేవీ కనిపించవు.

ఇక్కడే టైమింగ్ అనే అంశం కీలకంగా మారుతుంది. ఒక కథ ఆలస్యమైతే అలాంటి ఆలోచనతోనే మరో డైరెక్ట‌ర్, మరో హీరో, మరో బ్యానర్ ముందుకు రావచ్చు. ప్రేక్షకులకు రెండు కథలు ఒకేలా అనిపించకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఆ ఐడియా ఇప్పటికే వచ్చేసింద‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. అప్పుడు మొదటి ప్రాజెక్టు తన ప్రత్యేకతను కోల్పోతుంది. కొన్నిసార్లు మంచి కథలు కూడా ఈ కారణంగానే డ్రాప్ అవుతాయి.

స్టార్ హీరోల విషయంలో ఈ ప్రాసెస్ మరింత క్లిష్టంగా ఉంటుంది. వారు ఒక పాత్రతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా, మొత్తం స్క్రీన్‌ప్లే న‌చ్చిన విధంగా లేక‌పోతే ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా వాయిదా వేస్తారు. ఎందుకంటే స్టార్ సినిమా స‌క్సెస్ ను ఒక్క మంచి సీన్ కాదు, మొత్తం కథా నిర్మాణమే డిసైడ్ చేస్తుంది. అందుకే ఎన్నో అనౌన్స్ చేయ‌ని రీరైట్స్, కనిపించని స్టోరీ డిస్క‌ష‌న్స్, పూర్తి కాని స్క్రిప్టులు టాలీవుడ్‌లో సహజమైన ప్రక్రియగా మారాయి. అయితే ప్రేక్షకులు చూడలేకపోయిన పాత్రలు, తెరపైకి రాని కథలు, మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులు అన్నీ విఫలమైన ప్రయత్నాలు కావు. వాటిలో చాలా సినిమాలు సరైన టైమ్‌ను కోల్పోయిన ఆలోచనలు మాత్రమే. దీంతో టాలీవుడ్‌లో కథ పూర్తయ్యే టేబుల్ దగ్గరే కనిపించని అతిపెద్ద బాక్సాఫీస్ పోటీ మొదలవుతుందని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.